ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. సిట్ అదుపులో ముగ్గురు!

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. సిట్ అదుపులో ముగ్గురు!

హైదరాబాద్‌‌, వెలుగు: ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారనే కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌‌ (సిట్‌‌) దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి నెట్‌‌వర్క్‌‌లోని ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో నిందితులైన రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలు చంచల్‌‌గూడ జైలులో రిమాండ్‌‌లో ఉన్నారు. సీవీ ఆనంద్‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్‌‌, నిందితుల కాల్ డేటా ఆధారంగా ఇన్వెస్టిగేషన్‌‌ చేస్తున్నది. దర్యాప్తులో భాగంగా శనివారం నుంచి కేరళ, హర్యానాలోని ఫరీదాబాద్, కర్నాటకలోని పుత్తూర్​లోని రామచంద్ర భారతి ఇండ్లల్లో సోదాలు చేస్తున్నది. కేరళ కొచ్చిలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్ జాయింట్ డైరెక్టర్ సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా రామచంద్ర భారతి యాక్టివిటీస్‌‌పై పూర్తి వివరాలు రాబడుతున్నారు. సిట్‌‌ అదుపులో ఉన్న వీరిని హైదరాబాద్‌‌ తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలిసింది. నంద కుమార్‌‌‌‌, రామచంద్ర భారతి సన్నిహితులపైనే సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

బెయిల్​ పిటిషన్స్​ డిస్మిస్

రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజిల బెయిల్‌‌ పిటిషన్​ను ఏసీబీ స్పెషల్ కోర్టు సోమవారం కొట్టేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్‌‌ ఇవ్వలేమని తెలిపింది. పోలీసుల తరఫున పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ కోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు నిందితులు కుట్ర చేశారని తెలిపారు. పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు వివరించారు. నిందితులకు రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నట్లు వెల్లడించారు. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే చాన్స్ ఉందన్నారు. ఐదు రాష్ట్రాల్లో నిందితుల నెట్‌‌వర్క్‌‌ ఉన్నందున కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. ఇప్పటికే అందించిన సాక్ష్యాధారాలను పరిశీలించి బెయిల్ పిటిషన్​ను డిస్మిస్ చేయాలని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. బెయిల్ పిటిషన్స్​ డిస్మిస్​ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ డిస్మిస్ ఆర్డర్ కాపీతో మంగళవారం హైకోర్టులో బెయిల్ పిటిషన్​ ఫైల్ చేస్తామని నిందితుల తరఫు లాయర్లు తెలిపారు.

రామచంద్ర భారతిపై  పీటీ వారెంట్​ ఫైల్

జ్యుడీషియల్ రిమాండ్‌‌లో ఉన్న నిందితుడు రామచంద్ర భారతిపై బంజారాహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ ఫైల్ చేశారు. రామచంద్ర భారతి ఫేక్​ ఆధార్​కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్​కార్డులు కలిగి ఉన్నారంటూ రోహిత్​రెడ్డి గతంలో బంజారాహిల్స్​ పీఎస్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ప్రస్తుతం రామచంద్ర భారతి చంచల్​గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఒకవేళ కోర్టు పీటీ వారెంట్​కు అనుమతిస్తే రామచంద్రభారతిని అరెస్టు చేసి, తిరిగి కోర్టులో హాజరుపరుస్తారు. పీటీ వారెంట్​పై మంగళవారం విచారణ జరిగే చాన్స్​ ఉంది. తర్వాత కస్టడీ పిటిషన్​ దాఖలు చేసి ఫేక్​ డాక్యుమెంట్లపై విచారించే ఆలోచనలో బంజారాహిల్స్​ పోలీసులు ఉన్నట్టు సమాచారం.