హేమంత్ సోరెన్ కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సొంత వదిన

హేమంత్ సోరెన్ కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సొంత వదిన

జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ కు బిగ్ షాక్ తగిలింది. హేమంత్ సోరెన్ వ‌దిన‌, జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీలోని అన్ని ప‌ద‌వుల‌కూ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను పార్టీ కార్యాలయానికి  మంగ‌ళ‌వారం  పంపించారు. సీతా సోరెన్, మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్న దుర్గా సోరెన్ భార్య. దుర్గా సోరెన్ 2009లో మ‌ర‌ణించారు. భ‌ర్త మ‌ర‌ణానంత‌రం సీతా సోరెన్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 

అప్పటి నుంచి మూడు పరాయాలు వరసుగా గెలుపొందారు. పార్టీ స‌భ్యులు, కుటుంబం త‌మ‌ను వేరు చేసే విధంగా వ్యవ‌హ‌రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది త‌న‌ను తీవ్రంగా బాధకు గురిచేసిందని ఆమె లేఖలో పేర్కొన్నారు. త‌న భ‌ర్త విడిచిపెట్టిన ఆశ‌యాలను ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ చొర‌వ చూప‌డం లేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. త‌నకు  వ్యతిరేకంగా భారీ కుట్ర జ‌రుగుతోంద‌ని ఆమె ఆందోళ‌న వ్యక్తం చేశారు. 

కాలంతో పాటు ప‌రిస్ధితులు మార‌త‌యాని తాను ఆశించినా  త‌మ ఆశ‌యాలు, సిద్ధాంతాల‌తో స‌రిప‌డ‌ని వారి చేతిలో ఇప్పుడు పార్టీ బందీగా మారింద‌ని సీతా ఆరోపించారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.