పరిహారం పెంచకుంటే ఉప ఎన్నికలో పోటీ చేస్తం

పరిహారం పెంచకుంటే ఉప ఎన్నికలో పోటీ చేస్తం
  • పరిహారం పెంచకుంటే ఉప ఎన్నికలో పోటీ చేస్తం
  • శివన్నగూడ, లక్ష్మణపురం ప్రాజెక్టుల నిర్వాసితుల ఆమరణ నిరాహార దీక్ష
  • మునుగోడు​లోని మర్రిగూడ మండల కేంద్రంలో నిరసన

చండూరు, వెలుగు: ప్రాజెక్టుల్లో విలువైన భూములు, ఇండ్లు కోల్పోయిన తమకు ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వాలని నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలోని చర్లగూడెం ప్రాజెక్టు, నాంపల్లి మండలంలోని లక్ష్మణపురం ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే ఈ ప్రాజెక్టుల కింద సర్వం కోల్పోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం మర్రిగూడ మండలంలోని స్థానిక చౌరస్తాలో రెండు మండలాలకు చెందిన నిర్వాసితులు దీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తామని హెచ్చరించారు. వారి దీక్షకు పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భూనిర్వాసితుల రాష్ట్ర అధ్యక్షుడు ఆశప్ప, నల్గొండ జిల్లా జన సమితి అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడారు. భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి ఏ కష్టం రాకుండా చూస్తానని చెప్పిన సీఎం కేసీఆర్, అవేవీ ఇవ్వకుండానే భూములు గుంజుకోవడం సరికాదని అన్నారు. ప్రాజెక్టు వద్ద దీక్ష చేస్తున్న నిర్వాసితులపై పోలీసులతో లాఠీ చార్జి చేయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 

రెండు మండలాలకు చెందిన భూనిర్వాసితులు మర్రిగూడ మండల కేంద్రంలో బై పోల్స్​సందర్భగా దీక్ష చేపట్టడం సరైన చర్య అని పేర్కొన్నారు. జన సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ.. నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు తీర్చేంతవరకు దీక్షకు జన సమితి అండగా ఉంటుందన్నారు. విషయం తెలుసుకున్న దేవరకొండ ఆర్డీవో గోపిరాం నాయక్, డీఎస్పీ నాగేశ్వరరావు అక్కడికి చేరుకొని దీక్ష విరమించాలని నిర్వాసితులను కోరారు. భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఎకరాకు రూ. 5 లక్షల 15 వేలు ఇచ్చిందని, ఇల్లు కోల్పోయిన వారికి స్ట్రక్చర్ ప్రకారం.. డబ్బులు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో బయట భూమి ఎక్కడ దొరుకుతుందని నిర్వాసితులు అధికారులను ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు దీక్ష విరమించబోమని నిర్వాసితులు తేల్చి చెప్పారు. విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

5 లక్షలకు భూమి దొరుకుతదా?

సీఎం ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు ఎవరికిచ్చిండు. ఎకరాకు రూ.5 లక్షల15 వేల చొప్పున ఇస్తే.. ఆ పైసలతో బయట గుంట భూమి కూడా కొనలేకపోతున్నం. ఇల్లు కోల్పోయిన మాకు ఇంటి స్ట్రక్చర్ ప్రకారం గజానికి 58 రూపాయలు చొప్పున ఇస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఈ పైసలకు ఎక్కడైనా గజం జాగ వస్తదా? ఇండ్లకు మాత్రమే ఇస్తే , ఖాళీ జాగలకు పైసలు ఎవరు ఇస్తరు? 

- గట్టుపల్లి నరసింహారెడ్డి, సింగిల్ విండో చైర్మన్, నాంపల్లి నిర్వాసితులు