
చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ పేపర్ ప్రకటన ఇస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. పేపర్ ప్రకటనతో కొంతమంది కేటుగాళ్ల బ్యాంకుల్లో లక్షలు కాజేస్తున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన ఆరుగురు ముఠా సభ్యులు దొడ్డిదారిన డబ్బులు సంపాదించేందుకు పేపర్ ప్రకటనను అస్త్రంగా వాడుకుంటున్నారు. చనిపోయిన వారికి శ్రద్దాంజలి ఘటిస్తూ ఇస్తున్న పేపర్ ప్రకటనలతో పాటు రోడ్డు ప్రమాదాల్లో, వివిధ కారణాలతో మరణించిన ఓ లిస్ట్ ను తయారు చేసుకుంటున్నారు. ఆ లిస్ట్ లో ఉన్న వారి సంపాదన, ఉద్యోగం ఆధారంగా బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్నారు. అలా గుంటూరులో చనిపోయిన నలుగురు ఐటీ ఉద్యోగుల పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లో 54లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారు.
అయితే నిందితుల వాలకంపై అనుమానం రావడంతో బ్యాంక్ అధికారులు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో గుంటూరు కు చెందిన ముఠాసభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి 100 ఫేక్ ఓటర్ ఐడీ కార్డ్స్, 6 సెల్ ఫోన్స్ తో పాటు ఓ కారు ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన సజ్జనార్ …పేపర్ ప్రకటన ఆధారంగా చనిపోయిన వారి పేరుమీ పర్సనల్ లోన్లు తీసుకున్నారని తెలిపారు. ఈ నిందితులపై గతంలో కేసులున్నాని, పీడీ యాక్ట్ ప్రకారం కేసులు పెడతామని సీపీ సజ్జనార్ చెప్పారు.