ములుగు జిల్లాలో ఆరుగురు మిలీషియా సభ్యులు అరెస్ట్

ములుగు జిల్లాలో ఆరుగురు మిలీషియా సభ్యులు అరెస్ట్

ఏటూరునాగారం, వెలుగు: త్వరలో జరగనున్న పీఎల్​జీఏ వారోత్సవాలకు సంబంధించిన పాంప్లెంట్లను ఛత్తీస్​ఘడ్ నుంచి తెస్తున్న ఆరుగురు మిలీషియా సభ్యులను ములుగు జిల్లాలోని వెంకటాపురం పోలీసులు అరెస్ట్​చేశారు. మంగళవారం ఏటూరునాగారంలో ఏఎస్పీ అశోక్​ కుమార్ వివరాలు వెల్లడించారు. సోమవారం ముత్తారం క్రాస్​రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోతున్న సీతారాంపురం, కలిపాకకు చెందిన కుర్మం రాంబాబు, బడిసే బాలరాజు, కుంజ శంకర్, కుర్మం మల్లయ్య, గట్టుపల్లి రాంబాబు, కోరాం సత్యంను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో మిలీషియా సభ్యులని తెలిసింది. వెంకటాపురం,-వాజేడు ఏరియా మావోయిస్టు కమిటీ సెక్రెటరీ సుధాకర్ ఆదేశాలతో ఛత్తీస్ ఘడ్ లోని ఉట్లపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లి పాంప్లెంట్లు తెచ్చినట్లు చెప్పారు. ఆలుబాక సమీపంలో అంటిచాల్సి ఉండగా పోలీసులు అరెస్ట్​ చేశారు.

వారోత్సవాలను సక్సెస్​చేయాలి

భద్రాద్రికొత్తగూడెం: పీఎల్ జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టు చర్ల–శబరి ఏరియా కమిటీ సెక్రెటరీ అరుణ మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. వచ్చే నెల 2 నుంచి 8వ తేదీ వరకు గ్రామగ్రామనా నిర్వహించాలని కోరారు. కూంబింగ్​పేర గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. పోడు భూముల పట్టాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలాడుతోందన్నారు. దోపిడీ రాజ్యం నుంచి ప్రజలను విముక్తి చేయడమే మావోయిస్టుల లక్ష్యమన్నారు.