ట్రైనీ టీచర్లలో స్కిల్స్ అంతంతం మాత్రమే, ఎస్సీఈఆర్టీ అధ్యయనంలో వెల్లడి, రాష్ట్రంలో 73 డైట్ కాలేజీల్లో సర్వే

ట్రైనీ టీచర్లలో స్కిల్స్ అంతంతం మాత్రమే, ఎస్సీఈఆర్టీ అధ్యయనంలో వెల్లడి, రాష్ట్రంలో 73 డైట్ కాలేజీల్లో సర్వే
  • 40 శాతం మందిలోనే లెసన్ ప్లాన్, టీచింగ్, ప్రొఫెషనల్ డెవలప్​మెంట్ స్కిల్స్ 
  • మిగతా 60 శాతం మంది డైట్ స్టూడెంట్స్​లో అరకొర నైపుణ్యం
  • ఎస్​సీఈఆర్టీ అధ్యయనంలో వెల్లడి,  రాష్ట్రంలో 73 డైట్ కాలేజీల్లో సర్వే

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో డిప్లొమా ఇన్  ఎలిమెంటరీ ఎడ్యుకేషన్  కోర్సు చేస్తున్న ట్రైనీ టీచర్లలో స్కిల్స్  అరకొరగానే ఉంటున్నాయని, ఆయా డైట్  కాలేజీల్లో ట్రైనింగ్  పద్ధతులు చాలా పూర్ గా ఉన్నాయని స్టేట్  కౌన్సెల్‌‌‌‌ ఆఫ్ ఎడ్యుకేషనల్  రీసెర్చ్  అండ్  ట్రైనింగ్(ఎస్ సీఈఆర్టీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాక్టికల్  ట్రైనింగ్, ఇంటర్న్‌‌‌‌షిప్  సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని గుర్తించింది. 

‘ఏ స్టడీ ఆన్  ది పెడలాజికల్  పర్ స్పెక్టివ్స్  అండ్  ప్రాక్టికల్  అప్రోచెస్  ఆఫ్  స్టూడెంట్  టీచర్స్  ఆఫ్  ది డిప్లొమా ఇన్  ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్’ అనే అంశంపై ఎస్ సీఈఆర్టీ ఫిలాసఫీ ఫ్యాకల్టీ డాక్టర్  బి.రామకృష్ణ నేతృత్వంలో నిర్వహించిన​ అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 

రాష్ట్రంలోని 73 డైట్  కాలేజీల్లో 150 మంది ఫ్యాకల్టీ, 600 మంది ఫైనల్​ ఇయర్  స్టూడెంట్స్ పై ఈ రీసెర్చ్  జరిగింది. ఇందులో డిప్లొమా ఇన్  ఎలిమెంటరీ ఎడ్యుకేషన్  కోర్సులో చేరిన ట్రైనీ టీచర్లకు ఎలా శిక్షణ ఇస్తున్నారు? వారి పెడగాజీ పద్ధతులు, క్లాస్  రూమ్  ప్రాక్టీస్, టెక్నాలజీ వినియోగం, క్లాస్ రూమ్  టీచింగ్  వంటి అంశాల్లో ఎంత వరకు అవగాహన కలిగి ఉన్నారో అంచనా వేశారు.

40 శాతం మందిలోనే స్కిల్స్.. 

ట్రైనీ టీచర్లలో 26 శాతం మంది మాత్రమే లెసన్  ప్లాన్, క్లాస్ రూమ్  మేనేజ్ మెంట్, ప్రొఫెషనల్  డెవలప్ మెంట్  విషయంలో చురుకుగా ఉండగా.. మరో 40 శాతం మంది మధ్యస్థ సామర్థ్యం కలిగి ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 35 శాతం మంది ట్రైనీ టీచర్లు ప్రాక్టికల్  ట్రైనింగ్, ఇంటర్న్‌‌‌‌షిప్  అనుభవంలో బలహీనంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ట్రైనీ టీచర్లలో 35 శాతం మంది తమ కాలేజీల్లోనే అకడమిక్ వాతావరణం లేదని, కాలేజీల నుంచి తక్కువ సహకారం అందుతోందని చెప్పారు. 

ప్రాక్టికల్  ట్రైనింగ్, ఇంటర్న్‌‌‌‌షిప్  నాణ్యతలో లోపాలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో ఫ్యాకల్టీ సహకారం తక్కువగా ఉండడంతో ట్రైనీ టీచర్లకు సరైన గైడెన్స్  అందడం లేదు. ప్రాక్టికల్  ట్రైనింగ్​లో క్వాలిటీని పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ట్రైనీ టీచర్లతోపాటు డైట్  కాలేజీల్లోని ఫ్యాకల్టీ తమ బోధన పద్ధతులపై సెల్ఫ్​ అసెస్ మెంట్  చేసుకుంటూ లోపాలను సవరించుకుని మెరుగు పరుచుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. 

అలాగే డైట్  కోర్సులో సిద్ధాంతపరమైన సిలబస్(థియరీ పార్ట్) ఎక్కువగా ఉండి, టీచింగ్  మెథడ్స్  ఆచరణలో నేర్చుకునే పద్ధతులు పరిమితంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. వీరిలో క్లాసులో బోధించే విషయాలు, పాఠశాలల్లో వారికి వాస్తవంగా అవసరమయ్యే అంశాలకు సరిపోలడం లేదని పేర్కొన్నారు. 

జండర్, బోధన భాష ఆధారంగా కూడా ట్రైనీ టీచర్ల స్కిల్స్ లో తేడాలు ఉన్నాయని తేలింది. పురుషుల కంటే మహిళలు బోధన పద్ధతులు, స్వీయ సమీక్షలో మెరుగ్గా ఉన్నట్లు వెల్లడైంది. డిజిటల్  స్కిల్స్ లో ఇద్దరూ వెనకబడే ఉన్నారు. ఇంగ్లీష్  మీడియం ట్రైనీలు టెక్నాలజీ వినియోగంలో మెరుగ్గా ఉండగా.. తెలుగు మీడియం, ముఖ్యంగా ఉర్దూ మీడియం ట్రైనీలు చాలా వెనకబడినట్లు గుర్తించారు. 

సూచనలివే.. 

ప్రభుత్వ డైట్  కాలేజీల్లో 95 శాతానికి పైగా లెక్చరర్  పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గెస్ట్  ఫ్యాకల్టీపై ఆధారపడుతున్నారని, శాశ్వత ప్రాతిపదికన లెక్చరర్ల నియామకాలు చేపట్టడం అవసరం.
    
ఉర్దూ మీడియం కోసం సరైన టెక్ట్స్ బుక్స్, రిఫరెన్స్  బుక్స్  లేవు. వీటిని అభివృద్ధి చేయాలి.
    
డైట్ కాలేజీల్లో హాస్టల్  సౌకర్యం కల్పించాలి. దీంతో విద్యార్థులు పూర్తి స్థాయిలో కాలేజీకే పరిమితమై లైబ్రరీ, క్లాస్ రూమ్  తదితర వనరులను వినియోగించుకోగలుగుతారు. 
    
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన గిజుభాయ్ బధేకా, సోసాకు కోబయాషి, సుఖోమ్లిన్స్కీ, డేనియెల్ గ్రీన్‌‌‌‌బర్గ్, పాలో ఫెయిరీ మొదలైనవారి పద్ధతులు అధ్యయనం చేసి, వాటిని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్  కోర్సులో అనుసంధానం చేసే అవకాశం పరిశీలించాలి.