
వాషింగ్టన్ డీసీ: అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఊహించని నిర్ణయాలతో ముందుకెళుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారత్తో పాటు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థులకు కీలక హెచ్చరిక చేశారు. చదువుకోవడానికి అని అమెరికాకు వెళ్లి విద్యా సంస్థల అనుమతి లేకుండా క్లాసులు ఎగ్గొడితే వీసాలు రిస్క్లో పడతాయని ఇండియాలోని అమెరికా ఎంబసీ హెచ్చరించింది.
యూనివర్సిటీలకు ముందస్తు సమాచారం లేకుండా డ్రాపౌట్ అవడం, చదువును మధ్యలోని ముగించడం చేస్తే సదరు విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే కాకుండా భవిష్యత్లో యూఎస్ వీసా పొందే పరిస్థితి లేకుండా పోతుందని యూఎస్ ఎంబసీ హెచ్చరించడం గమనార్హం. చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగా స్టూడెంట్ స్టేటస్ను కొనసాగిస్తే చిక్కుల్లో పడకుండా ఉంటారని సూచించింది. వీసా నిబంధనలను పాటించకపోతే అమెరికా నుంచి పంపిచేస్తామని కూడా విదేశాల నుంచి చదువుకోవడానికి యూఎస్ వెళ్లిన విద్యార్థులను ఆ దేశం హెచ్చరించింది.
ఇప్పటికే వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కారు రద్దు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా తాను ప్రమాణం చేసినప్పటి నుంచి అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో చదువుకుంటున్న ఫారిన్ స్టూడెంట్ల పైనా ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారం చేపట్టిన కొన్ని వారాల్లోనే వెయ్యి మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా వారి చట్టబద్ధ హోదాలను తొలగించారు.
దీంతో ట్రంప్ తీరును నిరసిస్తూ బాధిత విద్యార్థులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. వీసాల రద్దులో ట్రంప్ సర్కారు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అసలు తమ వీసాలను రద్దు చేయడానికి ట్రంప్ సర్కారు వద్ద సరైన కారణాలు లేవని పేర్కొంటున్నారు. మరోవైపు వీసాలు రద్దయిన విదేశీ విద్యార్థులకు డిపోర్టేషన్ గండం పొంచి ఉంది.
ముఖ్యంగా హార్వర్డ్, స్టాన్ ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, ఓహియో వర్సిటీ విద్యార్థులకు ఈ ముప్పు ఎక్కువగా ఉంది. 2025 మార్చి చివరి వారం నుంచి 160 కాలేజీల నుంచి 1024 మంది విద్యార్థుల వీసాలు రద్దయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ అంచనా వేసింది. కాగా.. వీసాలు రద్దయిన విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది (దాదాపు 50 శాతం) ఇండియన్ స్టూడెంట్లే ఉండటం గమనార్హం.