ప్రతీకారం తీర్చుకున్న లంక.. రెండో వన్డేలో అఫ్ఘనిస్తాన్‌పై భారీ విజ‌యం

ప్రతీకారం తీర్చుకున్న లంక..  రెండో వన్డేలో అఫ్ఘనిస్తాన్‌పై భారీ విజ‌యం

తొలి వ‌న్డేలో అఫ్ఘనిస్తాన్ చేతిలో ఎదురైన ఘోర ఓటమికి శ్రీలంక ప్ర‌తీకారం తీర్చుకుంది. ఆదివారం హంబన్‌తోటా వేదికగా జ‌రిగిన రెండో వ‌న్డేలో అఫ్ఘాన్‌ను 132 ప‌రుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 323 ప‌రుగులు చేయ‌గా, అనంతరం భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌కు దిగిన అఫ్ఘాన్ 191 ప‌రుగుల‌కే కుప్పకూలింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన లంకకు మంచి శుభారంభం లభించింది. ఓపెన‌ర్లు నిస్సాంక(43), క‌రుణ‌ర‌త్నే(52) అఫ్ఘాన్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. ఆపై క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండిస్(78), స‌మ‌ర‌విక్ర‌మ‌తో(44) ఆ జోరును కొన‌సాగించాడు. చివ‌ర‌లో హ‌స‌రంగా(29), ష‌న‌క(23) మెరుపులు మెరిపించడంతో లంక 323 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. అఫ్ఘాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్, మహమ్మద్ నబీ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ముజీబ్ రెహ్మాన్, నూర్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు. 

అనంతరం భారీ టార్గెట్‌తో బ‌రిలో దిగిన అఫ్ఘ‌నిస్తాన్ 42 ఓవ‌ర్ల‌లో 191 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఇబ్ర‌హీం జ‌ర్దాన్(54), హ‌స్మ‌తుల్లా షాహిదీ(57) రాణించడంతో అద్భుతం చేసేలా క‌నిపించినా, ఆ తరువాత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. హ‌స‌రంగా, ధ‌నుంజ‌య డిసిల్లా చెరో మూడు వికెట్లు తీసుకొని అఫ్ఘాన్ ఓటమిని శాసించారు. మూడు వ‌న్డేల సిరీస్‌లో ఇరి జట్లు 1-1తో స‌మంగా ఉన్నాయి. నిర్ణ‌యాత్మ‌క మూడో వ‌న్డే జూన్ 7న బుధ‌వారం జ‌రగ‌నుంది.