స్లీప్ ఆప్నియా సీరియస్​గా​ తీసుకోవాల్సిందే!

స్లీప్ ఆప్నియా సీరియస్​గా​ తీసుకోవాల్సిందే!

కొందరు గురకపెడితే ఇంటి పైకప్పు ఎగిరిపోతుందేమో అనే రేంజ్​లో ఉంటుంది. ఆ చప్పుడు బెడ్​రూం దాటి హాలులోకి వినబడుతుంది.  దీంతో  చుట్టు పక్కల వాళ్ల నిద్ర కూడా దెబ్బతింటుంది. అలాగని  గురకపెట్టేవాళ్లు హాయిగా నిద్రపోతున్నారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది నిద్రలోని శ్వాసకు ఆటంకం  కలగజేసే‘ స్లీప్​ ఆప్నియా’ వ్యాధికి సంకేతం కావొచ్చు​. గురకే కాదు రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, డ్రైవింగ్​లో, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, పనివేళ్లలో  హఠాత్తుగా నిద్రపోవడం,  తలనొప్పి లాంటివి కూడా ఈ వ్యాధి లక్షణాల్లో భాగమేనంటున్నారు డాక్టర్లు.

అసలు స్లీప్​ ఆప్నియా అంటే ఏంటి ?

నిద్రలో శ్వాస కొద్ది సేపు ఆగిపోవడమే స్లీప్​ ఆప్నియా. దీని వల్ల  నిద్ర మధ్యలో శ్వాస ఆగిపోయి మెలకువ వస్తుంటుంది.  శ్వాస సక్రమంగా లేనందువల్ల  రక్తంలో ఆక్సిజన్​ తగ్గి, నిద్రలో చాలా సార్లు ఇలా జరగొచ్చు. స్లీప్​ ఆప్నియా తీవ్రంగా ఉంటే మాత్రం గంటకు ఐదు నుంచి వందసార్లు నిద్రాభంగం కలుగుతుంది.

రెండు రకాలు..

స్లీప్​ ఆప్నియాలో రెండు రకాలుంటాయి.  నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే ‘అబ్​స్ట్రక్టివ్​​ స్లీప్​ ఆప్నియా’ అని, మెదడులో శ్వాస నియంత్రిత కేంద్రాలు నిలిచిపోయి నిద్రలో ఇబ్బంది కలిగితే దాన్ని ‘సెంట్రల్​ స్లీప్ ఆప్నియా’ అని అంటారు.

సమస్య ఉన్నట్లు కూడా తెలీదు

చాలామంది స్లీప్​ ఆప్నియా సమస్యతో బాధపడుతుంటారు. కానీ వాళ్లలో చాలామందికి తమకు ఈ సమస్య  ఉన్నట్లు కూడా తెలియదు. వీళ్లకి  నిద్ర మధ్యలో కొన్ని క్షణాల పాటు శ్వాస ఆగిపోయి, మళ్లీ మామూలైపోతుంది. మరికొందరిలో ఇది కొన్ని క్షణాల నుంచి నిమిషాల దాకా కొనసాగవచ్చు. వీళ్లకు గంటకు పది నుంచి ముప్పై సార్లు  నిద్రాభంగం జరుగుతూనే ఉంటుంది.  దీనివల్ల రాత్రంతా మంచం మీదే ఉన్నా, నిద్ర వల్ల వచ్చే విశ్రాంతి, ఉల్లాసమే ఉండవు. ఒకవేళ ఎప్పుడైనా నిద్రలోకి జారినా పెద్దగా గురక వస్తుంది.  ఈ సమస్య వల్ల రక్తంలో  ఆక్సిజన్​ శాతం కూడా తగ్గుతుంది.

ఇవీ కారణాలే

స్లీప్​ ఆప్నియా సమస్య ఎవరికైనా రావొచ్చు. కాకపోతే  స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో రెండింతలు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే 18 నుంచి 60 ఏళ్ల వయసువాళ్లే  ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు.   స్థూలకాయం,  అధిక రక్తపోటు, శ్వాస నాళాలు చిన్నవిగా ఉండడం, నాసికా రంధ్రాలు ముడుచుకుపోవడం, షుగర్​..  వీటితో పాటు పొగతాగడం, తాగుడు కూడా  ఈ సమస్యకు ప్రధాన కారణం.  ఈ సమస్యని గుర్తించి వెంటనే తగిన చికిత్స తీసుకోకపోతే కొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు.

లక్షణాలు

పగటిపూట అతిగా నిద్రపోవడం, పెద్దగా గురక పెట్టడం, నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమై పదేపదే హఠాత్తుగా మెలకువ రావడం లాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. వీటితో పాటు మేల్కొన్నప్పుడు గొంతు ఎండిపోవడం లేదా గొంతు నొప్పి,  ఛాతి నొప్పి, ఉదయం లేవగానే తలనొప్పిగా అనిపించడం,  రోజంతా  ఏ విషయం మీద మనసు లగ్నం చేయలేకపోవడం, డిప్రెషన్,  మతిమరుపు, ఏకాగ్రత కుదరకపోవడం,  కుంగుబాటు  లాంటివి కూడా స్లీప్​ అప్నియా లక్షణాల్లో కనిపిస్తాయి.
అధిక బరువు, ముక్కు దిబ్బడ,  రక్తపోటు పెరగడం,  నాలుక పిడసగట్టుకుపోవడం లాంటి లక్షణాలు  కూడా కొందరిలో కనిపిస్తాయి. పిల్లల్లో అయితే హైపర్​ యాక్టివిటీ, చదువులో వెనకబడడం,  కోపం, టాన్సిల్స్,​అడనాయిడ్స్ పెద్దవైపోవడం, దవడ భాగాలు నొప్పిగా అనిపించడం, నోటితో శ్వాస తీసుకోవడం లాంటివి  ఎక్కువగా కనిపిస్తాయి.

ఎలా నిర్ధారిస్తారు

ఒకసారి స్లీప్​ ఆప్నియా ఉన్నట్లు అనుమానిస్తే స్లీప్​ సెంటర్​లో రాత్రంతా వాళ్ల నిద్రను  స్టడీ ( పాలీ గ్రోమిక్​) చేస్తారు. స్లీప్​ ల్యాబ్​​లో చార్ట్​  ద్వారా మెదడు తరంగాలు, గుండె కదలిక, ఆక్సిజన్ శాతం, శ్వాస తదితర వాటిని  పరిశీలించాలి. పరీక్షల్లో స్లీప్​ ఆప్నియా నిర్ధారణ అయితే తీవ్రత ఆధారంగా చికిత్స చేస్తారు.

నివారణ మార్గాలు

స్లీప్​ ఆప్నియా సమస్య మరీ తీవ్రమైనప్పుడు ట్రీట్​మెంట్లు ఎలాగూ తప్పవు. ఒకవేళ సమస్య అంత తీవ్రంగా లేకపోతే  లైఫ్​స్టయిల్​లో కొన్ని మార్పుల ద్వారా చాలా వరకు  ఈ సమస్యను అధిగమించొచ్చు. సమస్య ప్రారంభంలోనే ఈ జాగ్రత్తలు పాటిస్తే స్లీప్​ ఆప్నియా నుంచి బయటపడొచ్చు.

శరీర బరువుని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ బరువు ఉన్నవాళ్లకి గొంతు వెనుక భాగంలో ఎక్కువ కణజాలం ఉంటుంది. ఇదే గాలి శ్వాసకోశాల్లోకి వెళ్లకుండా అడ్డుపడుతుంది,  అందుకే శరీర బరువు తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నియంత్రించొచ్చు.

పొగ తాగడం వల్ల గొంతులో ద్రవాలు నిలిచిపోవడం, గొంతు లోపలి భాగాల్లో వాపు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి.  దీనివల్ల శ్వాసలో ఇబ్బంది తలెత్తుతుంది. అందువల్ల  సిగరెట్లకి దూరంగా ఉండాలి. అలాగే తాగుడు, నిద్రమాత్రలు వేసుకోవడం, మత్తు పదార్థాలు తీసుకుంటే గొంతులోని కండరాల్లో సమస్య వస్తుంది, ఫలితంగా శ్వాస తీసుకోవడంలో  ఇబ్బందులు తలెత్తుతాయి. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి.

 క్రమం తప్పకుండా
ఎక్సర్​సైజ్​ చేయడం వల్ల శరీరం యాక్టివ్​గా ఉంటుంది, ఇలాంటి సమస్యలు దరిచేరవు. అంతేకాదు నిద్రకు రెండు గంటల ముందు నుంచి కాఫీ తాగడం, అతిగా భోజనం చేయడం మానేయాలి.  అలాగే ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవాలి.  వెల్లకిలా కాకుండా పక్కకు తిరిగి పడుకుంటే అంగిలి భాగం శ్వాస మార్గానికి  అడ్డుపడకుండా ఉంటుంది.

పల్మొనాలజిస్ట్​ డాక్టర్​ రఫీ