
ఎంత బలవంతంగా కన్నులు మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో గురక శబ్దం కుటుంబ సభ్యుల నిద్రను హరిస్తోందా? మొద్దనిద్ర వీడడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బందిగా ఉన్నదా? ఇలాంటి సమస్యలు ప్రమాదకర నిద్రలేమి రుగ్మత (స్లీప్ అప్నియా)కు కారణమని తెలుసుకోవాలి. ఆరోగ్యవంతులకు ప్రతిరోజు రాత్రిపూట దాదాపు 7 గంటల గాఢనిద్ర తప్పక అవసరం అవుతుంది.
నిద్ర సరిగ్గా పట్టనపుడు అది దీర్ఘకాలిక సమస్యగా మారి అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిద్రలేమి సమస్యతో హృదయ సంబంధ రుగ్మతలు, అధిక రక్తపోటు, మధుమేహం, స్ట్రోక్ రిస్క్, గురక, పండ్లు కొరకడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, సులభంగా అలసిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం, ఆలోచనా సామర్థ్యం పలుచబడడం, నిరాశకు గురి కావడం జరుగుతుంది.
Also Read : గ్రామాల్లో ‘ఇందిరమ్మ ఇండ్లు’ గేమ్ చేంజర్
తలనొప్పి, మానసిక అస్థిరతకు గురికావడం, మానసిక ఆందోళనలు పెరగడం, నిద్ర లేచినపుడు గొంతు ఎండిపోవడం, నిరుత్సాహపడడం, పని మీద ఏకాగ్రత కొరవడడంలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం, నిద్ర ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. నిద్రలేనివారిలో జ్ఞాపక శక్తి, ఆలోచనల సామర్థ్యాలు ప్రభావితం అవుతున్నట్లు తేలింది.
నిద్రలేమి సమస్యలను తొలిదశలోనే గుర్తించి వైద్యం తీసుకోవడం, క్రమశిక్షణతో దినచర్యను పాటించడంలాంటి చర్యలు నిద్రలేమి రుగ్మతకు చికిత్సా మార్గాలుగా గుర్తించాలి. మానసిక, శారీరక, సామాజిక, భావోద్వేగ సమతుల్యత సాధిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని తెలుసుకోవాలి.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి-