
- ‘హురున్ సెల్ఫ్‌మేడ్& అండర్ 40’ రిచ్‌లిస్టులో చోటు సంపాదించుకున్న 45 మంది ఎంటర్‌ప్రెనూర్లు
- స్టార్టప్ ఫౌండర్ల సంపద పై పైకి..బెంగళూరు నుంచే ఎక్కువ
- సాఫ్ట్‌వేర్ సెక్టార్లలో పెరుగుతున్న ఎంటర్‌ప్రెనూర్లు
బిజినెస్‌డెస్క్, వెలుగు: సొంతంగా ఎదిగి, 40 కంటే తక్కువ వయసులోనే హురున్ రిచ్‌లిస్టులో చోటు సంపాదించుకున్న ఎంటర్‌ప్రెనూర్లను హురున్ ఇండియా బుధవారం ప్రకటించింది. ‘ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా 40 & అండర్ సెల్ఫ్‌మేడ్ రిచ్‌లిస్ట్ 2021’ పేరుతో ఈ లిస్టును విడుదల చేసింది. ఈ రిచ్‌లిస్టులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరూ లేకపోవడాన్ని గమనించాలి. 40 ఏళ్లలోపు ఉన్న మొత్తం 45 మంది ఎంటర్‌ప్రెనూర్లు ఈ రిచ్‌లిస్టులో చోటు సంపాదించారు. కనీసం రూ. వెయ్యి కోట్ల సంపద ఉన్న ఎంటర్‌ప్రెనూర్లకు హురున్ రిచ్‌లిస్టులో చోటు దక్కింది. మీడియా డాట్‌నెట్ ఫౌండర్ దివ్యాంక్ తురాఖియా (ఏజ్ 39) రూ. 12,500 కోట్ల సంపదతో ఈ లిస్టులో టాప్‌లో నిలిచారు. ఆ తర్వాత ప్లేస్‌లో బ్రౌజర్‌స్టాక్ ఫౌండర్లు నకుల్ అగర్వాల్ (38), రితేష్ అరోరా (37) లు ఒక్కోక్కరు రూ. 12,400 కోట్ల సంపదతో రెండో ప్లేస్‌లో ఉన్నారు. ఈ సారి రిచ్‌లిస్టులో చోటు సంపాదించిన వారిలో 31 మంది కొత్త వారు కాగా, ఇందులో 30 మంది స్టార్టప్ ఫౌండర్లే ఉండడం విశేషం.
ఇంకో ఐదేళ్లలో 200 కు..
గత ఐదేళ్లతో పోలిస్తే ఈ రిచ్‌లిస్టులోని ఎంటర్‌ప్రెనూర్లు 9 రెట్లు పెరిగారని హురున్ ఇండియా ఫౌండర్ ఆనస్ రెహ్మన్ జునైద్ పేర్కొన్నారు. ఈ నెంబర్ వచ్చే ఐదేళ్లలో 200 కు పెరుగుతుందని అంచనావేశారు. దేశంలోని టెక్ స్టార్టప్ కంపెనీల్లోకి భారీగా ఇన్వెస్ట్‌మెంట్లు వస్తున్నాయి. దీంతో ఈ కంపెనీల ఫౌండర్ల సంపద అమాంతం పెరుగుతోంది. దేశ ఐపీఓ మార్కెట్ దూసుకుపోతుండడంతో మార్కెట్‌లో లిస్టింగ్ అయిన స్టార్టప్ కంపెనీల ఫౌండర్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఈజ్‌మైట్రిప్ ఫౌండర్లు రికాంత్ పిట్టీ (33), నిషాంత్ పిట్టీ (35), ప్రశాంత్ పిట్టీ (37) లు ఈ రిచ్ లిస్టులో మొదటిసారిగా ఎంటర్ అయ్యారు. ఏకీ ఎనర్జీ ఫౌండర్ మనీష్ కుమార్ దబ్కారా (37) రిచ్‌లిస్టులో మొదటిసారిగా ఎంటర్ అయ్యారు. ఈ రిచ్‌లిస్టులోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో ఆయనొక్కరే నాన్–టెక్ కంపెనీని నుంచి రావడం గమనించాలి. హురున్ సెల్ఫ్‌మేడ్ & అండర్ 40 లోని ఎంటర్‌ప్రెనూర్ల సంపద మొత్తం రూ. 1,65,600 కోట్లకు పెరిగింది. కిందటేడాదితో పోలిస్తే ఈ సంపద 286 శాతం ఎగిసింది. ఈ లిస్టులో చోటు సంపాదించిన భారత్‌పే ఫౌండర్ శాశ్వత్ నక్రానీ( 23) అందరి కంటే చిన్నవాడు. కన్‌ఫ్లూయెంట్ ఫౌండర్ నేహా నర్ఖేదే (36) అత్యంత చిన్న వయసులోనే సెల్ఫ్‌మేడ్ వుమెన్ ఎంటర్‌ప్రెనూర్‌గా నిలిచారు.
ఈ సిటీల నుంచే ఎక్కువ..
హురున్ సెల్ఫ్‌మేడ్ & అండర్ 40 లో ఎక్కువ మంది ఎంటర్‌ప్రెనూర్ల హెడ్ క్వార్టర్లు బెంగళూరు నుంచే ఉన్నాయి. మొత్తం 15 మంది ఎంటర్‌ప్రెనూర్లు ఈ సిటీ నుంచి ఉండగా, న్యూఢిల్లీ నుంచి ఎనిమిది మంది, ముంబై నుంచి ఐదుగురు, గురుగ్రామ్ నుంచి ముగ్గురు, థానే నుంచి ఇద్దరు చోటు సంపాదించారు. మరో ముగ్గురు విదేశాల్లో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ సెక్టార్ నుంచి ఎక్కువ మంది (12 మంది) సెల్ఫ్‌మేడ్ ఎంటర్‌ప్రెనూర్లు వచ్చారు. ఆ తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ (5), రిటెయిల్ (5), ఎంటర్‌టైన్‌మెంట్ (5), ఫైనాన్షియల్ సర్వీసెస్ (5) సెక్టార్ల నుంచి ఉన్నారు. ఎకానమీ మెరుగవుతుండడం, టెక్నాలజీ, డిజిటిటల్ సెక్టార్ విస్తరిస్తుండడంతో కొత్తగా ఎంటర్‌ప్రెనూర్లు క్రియేట్ అవుతున్నారని ఐఐఎఫ్‌ఎల్ కోఫౌండర్ యాటిన్ షా పేర్కొన్నారు. ఇంకా చాలా స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారునున్నాయని, హురున్ లిస్టులో సెల్ఫ్‌మేడ్ ఎంటర్‌ప్రెనూర్లు మరింత పెరుగుతారని ఆయన అంచనావేశారు.