మెక్సికోలో వడగళ్ల తుఫాను

మెక్సికోలో వడగళ్ల తుఫాను

వీధుల్లో 5 అడుగుల మేర ఐసు గడ్డలు       

కూలిపోయిన ఇళ్లు, ఇరుక్కుపోయిన వాహనాలు

ఈ ఫొటోను సరిగా చూడండి. రోడ్లన్నీ తెల్లగా ఉన్నాయి కదా. పక్కన రెండు మూడు ఇళ్లు కూలిపోయాయి. ఇంకొంచెం ఫోకస్ చేసి చూస్తే రోడ్లపై ఉన్న కార్లు, ట్రక్కులు సగానికి మునిగిపోయాయి. ఆ ఊరి పేరు గ్వాడలహరా. సెంట్రల్ మెక్సికోలో ఉంది. ఆ రోడ్లు నిండిపోయింది వడగళ్లతో! వడగళ్లు మామూలుగా చిన్నగా ఉంటాయి. అరుదుగా కొబ్బరికాయ సైజు వడగళ్లను చూసిన వాళ్లూ ఉంటారు. పేద్ద గుమ్మడికాయంత వడగళ్లు మీరు చూశారా? అవే గ్వాడలహరాను ఆదివారం అర్థరాత్రి హడలెత్తించాయి. పన్నెండు దాటిన తర్వాత పేద్ద శబ్దం గ్వాడలహరా వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఆ వెంటనే వరుసగా అవే శబ్దాలు. ఇంటిపై ఏవో భారీ సైజు ముద్దలు పడుతున్నట్లు అర్థమైంది! రేకులు, పెంకుల ఇళ్లు వాటి దెబ్బకు కూలిపోయాయి. కొన్ని గంటల పాటు సాగిన వడగళ్ల తుఫాను రోడ్లను మంచుతో ముంచేసింది. కొన్నిచోట్ల ఇళ్లలోకి కూడా వెళ్లిపోయింది. తెల్లవారగానే బయటకు వచ్చిన గ్వాడలహరా వాసులకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. తాము అంటార్కిటికాలో ఉన్నామా లేక తమ ఊర్లోనో ఉన్నామా అనే సంగతి తేల్చుకోలేకపోయారు! దాదాపు 1.5 మీటర్ల ఎత్తైన మంచు గ్వాడలహరాలోని ప్రతి వీధిని నింపేసింది. కార్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు మంచులో కూరుకుపోయాయి.

ఎందుకిలా జరిగింది?

గ్వాడలహరాలో ఎండ సగటున 30 నుంచి 35 డిగ్రీలు ఉంటుంది. అమెరికా, మెక్సికో మధ్య నుంచి దక్షిణానికి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని వల్లే వడగళ్ల వాన పడిందని సైంటిస్టులు చెబుతున్నారు.