ఢిల్లీ అల్లర్ల వెనుక ఎన్నో కన్నీటి కథలు

ఢిల్లీ అల్లర్ల వెనుక ఎన్నో కన్నీటి కథలు

తండ్రిని కోల్పోయిన కొడుకు ఒకరు..
బిడ్డని పోగొట్టుకున్న తండ్రి మరొకరు..
పెళ్లయిన 10 రోజులకే భర్తను పోగొట్టుకున్న అమ్మాయి ఇంకొకరు

న్యూఢిల్లీ: ‘‘సీఏఏ వల్ల ఏ ఒక్కరి పౌరసత్వమూ పోలేదు.. కానీ ఓ కుటుంబం తమ ఇంటి పెద్దని కోల్పోయింది. ఓ తండ్రి తన కొడుకును పోగొట్టుకున్నాడు.. ఓ భార్య తన భర్తను పోగొట్టుకుంది.. ఓ బిడ్డ తన తల్లిని కోల్పోయాడు..” వాట్సాప్, ఫేస్​బుక్​లలో వైరల్ అవుతున్న ‘స్టేటస్’ ఇది. నిజమే… సీఏఏ వల్ల ఏ ఒక్కరికీ నష్టం జరగలేదు. కానీ రాజకీయ నాయకుల విద్వేష వ్యాఖ్యల వల్ల.. ప్రజల్లో నెలకొన్న ఆందోళనల వల్ల.. ఆ ఆందోళనలు ఆవేశంగా మారడం వల్ల తీరని నష్టం వాటిల్లింది.
ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంది. ఢిల్లీలో విధ్వంసానికి కారణమైంది. తమ వారి మృతదేహాల కోసం ఆస్పత్రి మార్చురీ వద్ద కన్నీళ్లతో ఎదురుచూస్తున్న గుండెలెన్నో.. ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ… కానీ.. చిమ్మచీకటిలో రవ్వంత వెలుగును పంచే మిణుగురు పురుగులా ఓ ఘటన జరిగింది. మోడులా మారిన మానులో ఆశలను చిగురింపచేసింది. హింస జరిగిన అదే ఢిల్లీలో.. ఉద్రిక్తతలు కొనసాగుతున్న అదే ప్రాంతంలో ఓ హిందూ జంట పెళ్లికి హాజరై, కాపలాగా నిలబడ్డారు

తప్పిపోయి.. పేరెంట్స్​ను కలిసి..

సోనియా విహార్​కు 4.5 కిలోమీటర్ల దూరంలోని ఖజూరి ఖాస్ ఏరియాలో ఉన్న స్కూల్​కు వెళ్తొందని తను. 8వ తరగతి చదువుతోంది. తండ్రి రెడీమేడ్ గార్మెంట్స్​లో పని చేస్తుంటాడు. రోజూ సాయంత్రం 5.20కి వచ్చి.. 13 ఏళ్ల కూతురిని పికప్ చేసుకుంటాడు. కానీ సోమవారం అల్లర్లు చెలరేగాయి. గొడవల్లో చిక్కుకుని అమ్మాయిని పిలుచుకుని రావడానికి ఆ తండ్రి పోలేకపోయాడు. స్కూల్లో పరీక్ష రాసేందుకు వెళ్లిన బిడ్డ ఇంటికి రాలేదు. 1..2.. 5 రోజులు గడిచాయి. పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ఇటు ఫోన్ ఎత్తిన ఆ తండ్రిలో భయం.. ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన.. చేతులు వణుకుతున్నాయి.. అంతలో ‘పాప భద్రంగా ఉంది. వచ్చి తీసుకెళ్లండి’ అని అటు నుంచి గొంతు వినిపించింది. ఇక ఆ తండ్రి సంతోషానికి అవధులు లేవు. సోమవారం తప్పిపోయిన అమ్మాయి.. శుక్రవారం పేరెంట్స్ చెంతకు చేరింది. తల్లి గుండెల మీద సేదతీరుతోంది. కథ సుఖాంతమైంది.

మానవత్వం చాటారు

ఈశాన్య ఢిల్లీకి చెందిన రాజ్​కుమార్​ భరద్వాజ్​ వేరే మతానికి చెందిన కుటుంబాన్ని  అల్లరి మూకల దాడులనుంచి కాపాడారు. తన ఇంట్లో వాళ్లను పెట్టుకుని మానవత్వాన్ని చాటుకున్నారు.

తండ్రి శవం కోసం ఆస్పత్రి బయట..

జీటీబీ ఆస్పత్రిలోని మార్చురీ బయట ఎదురు చూస్తున్నాడు మోను కుమార్. షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు అతను. తన తండ్రి వినోద్‌ కుమార్‌‌(51)తో కలిసి మెడికల్ షాపు నుంచి ఇంటికి బయలుదేరాడు. కానీ దారిలో వారిపై దాడి జరిగింది.  నినాదాలు చేస్తూ వచ్చిన ఓ గుంపు… రాళ్లు, కత్తులతో దాడి చేసింది. తీవ్ర గాయాలైనా మోను కుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ తండ్రి వినోద్ కుమార్ అక్కడికక్కడే చనిపోయారు. బైక్​ను కాల్చేశారని మోను చెప్పాడు.

పారాణి ఆరకముందే..

ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం.. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.. అందుకే అదే రోజు పెండ్లి చేసుకున్నాడు అష్ఫాక్ హుస్సేన్‌‌. పెళ్లికూతురు కాళ్లకు పెట్టిన పారాణి ఇంకా ఆరలేదు. కానీ మనువాడిన వాడు అప్పుడే కన్నుమూశాడు. ఢిల్లీ అల్లర్లకు బలయ్యాడు. దుండగుల కాల్పుల్లో చనిపోయాడు. ‘ఇంకా అతను ఎవరో కూడా నాకు తెలియదు’ అంటూ గుండెలవిసేలా ఏడుస్తోంది ఆ పెళ్లికూతురు. యూపీలోని బులంద్​షహర్​కు చెందిన తస్లీమ్.. ఢిల్లీలోని ముస్తఫాబాద్​కు చెందిన అష్ఫాక్​తో ఫిబ్రవరి 14న పెళ్లి జరిగింది. గత ఆదివారం రాత్రి వారు ఢిల్లీకి వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం.. ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేశారు. ఆమె తన భర్తతో కలిసి తినడం అదే తొలిసారి. ఎలక్ట్రీషియన్ అయిన అష్ఫాక్​కు ఫోన్ వచ్చింది. పవర్ సప్లై ఆగిపోయిందని, సాయం కావాలని అడిగారు. వెళ్లి పని ముగించుకుని వస్తుండగా ముస్తఫాబాద్‌‌ సమీపంలో తుపాకీ కాల్పులకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా..చికిత్స పొందుతూ చనిపోయాడు. కానీ ఇప్పటికీ అతడి డెడ్ బాడీని కుటుంబసభ్యులకు ఇవ్వలేదు. జీటీబీ ఆస్పత్రి మార్చురీ దగ్గర ఎదురుచూస్తూ ఉన్నారు బంధువులు. హై ఫీవర్​తో బాధపడుతున్న తస్లీమ్.. మంగళవారం నుంచి అన్నం ముట్టలేదు… కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు.

కాపలా ఉండి పెళ్లి చేశారు..

మంగళవారం.. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ముస్లిం మెజారిటీ ఏరియాలో ఉంటున్న 23 ఏళ్ల సావిత్రి ప్రసాద్ పెళ్లి జరగాల్సి ఉంది. గోరింటాకు పెట్టుకుని, నగలు వేసుకుని రెడీ అయి ఉంది తను. కానీ బయట అల్లర్లు ఉధృతంగా సాగుతున్నాయి. యుద్ధం వాతావరణం నెలకొని ఉంది. ఇక తన పెళ్లి జరగదని ఏడుస్తూ కూర్చుందామె. బంధువులు ఎవరూ రాలేదు.. చుట్టూ ముస్లిం కుటుంబాలు.. బయట గొడవలు.. బాధ ఒకవైపు.. భయం మరోవైపు.. అయితే ఆమె తండ్రి మాత్రం ధైర్యంగా ఉన్నారు. అల్లర్లు కొంచెం తగ్గగానే బుధవారం పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట.. ‘చుట్టుపక్కనున్న ముస్లింలే నా బంధువులు’ అని.. వరుడు రాగానే పొరుగున ఉన్న ముస్లింలు వచ్చారు. ఆచారం ప్రకారం మంత్రాల నడుమ పెళ్లి జరిగింది. ఇంటి బయట కొందరు కాపలాగా ఉన్నారు. ‘‘మేం మా హిందూ సోదరులతో శాంతియుతంగా బతుకుతున్నాం. వాళ్లకు మేమే అంతా.. అందుకే వారి కోసం అక్కడ ఉన్నాం” అని అమీర్ మాలిక్ అన్నారు. చాంద్ బాగ్ జిల్లాలోని ఇరుకైన సందులో చిన్న ఇంట్లో సావిత్రి ప్రసాద్ పెళ్లి జరిగింది. ‘‘హింస వెనుక ఎవరున్నారో మాకు తెలియదు. కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్లయితే కాదు. ముస్లింలు, హిందువుల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు” అని సావిత్రి తండ్రి భోడే ప్రసాద్ చెప్పారు. ‘‘నా బిడ్డ పెండ్లికి బంధువులు రాలేకపోయారు. కానీ ముస్లింలు వచ్చారు. వాళ్లు మా కుటుంబం” అని అన్నారు. ‘‘ఆమె బాధ మాకు కన్నీళ్లు తెప్పించింది. కూతురు ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఏడుస్తూ ఇంట్లో కూర్చోవాలని ఎవరు కోరుకుంటారు?” అని పక్కింట్లో ఉండే సమీనా బేగం అన్నారు.