వెనిగర్​లో వెరైటీలెన్నో!

వెనిగర్​లో వెరైటీలెన్నో!

మనదేశంలో వాడే కొన్ని ఫుడ్ ఐటమ్స్​ విదేశాల నుంచి వచ్చినవే. వాటిలో వెనిగర్​ ఒకటి. దీన్ని పోర్చుగీసువాళ్లు మనదేశంలోకి తెచ్చారు. అప్పటికే వెనిగర్​ను చాలా దేశాల్లో వాడుతున్నారు. నిజానికి ఇది దాదాపు క్రీ.పూ. 3000 ఏండ్ల నాటిది. మరి దీని చరిత్ర ఏంటో తెలుసా?

పూర్వం లాంగ్​ జర్నీ చేసేటప్పుడు ఫుడ్ పాడవకుండా ఉండేందుకు వెనిగర్​ని ప్రిజర్వేటివ్​గా వాడారు బాబిలోనియన్లు. ఆ కాలంలో రైతులు, ప్రయాణికులు వెనిగర్​ని నీళ్లలో కలిపి, దాహమేసినప్పుడు తాగేవాళ్లు. అప్పటి నుంచి వెనిగర్ అనేది బేవరేజ్​గా పాపులర్ అయింది. పురాతన గ్రీస్​ దేశంలో ఇదొక సాధారణ డ్రింక్​. తేనె, వెనిగర్, నీళ్లు కలిపి ఆక్సీడెస్​ అనే ప్రత్యేకమైన పాత్రల్లో పోసేవారు. అందుకని ఆ డ్రింక్​కి ‘ఆక్సీక్రాట్’ అనే పేరొచ్చింది. రోమన్లు వెనిగర్, నీళ్లు కలిపి తాగేవాళ్లు. దాన్ని ‘పోస్కా’ పేరుతో బాటిల్​లో పోసి వీధుల్లో అమ్మేవాళ్లు. చైనాలో ‘ఝౌ’ డైనస్టీ అప్పుడు రాయల్ ఫ్యామీలీలు వెనిగర్ తయారుచేసేవాళ్లకి ప్రత్యేక పదవి ఇచ్చేవాళ్లు. ఆ తర్వాత 5–15వ శతాబ్దాల మధ్యలో వెనిగర్​ యూరప్​లో పాపులర్ అయింది. ఆ తర్వాత ఇటలీలో బాల్సమిక్​ వెనిగర్ తయారైంది. కొంతకాలానికి వెనిగర్​ తయారీ ఫ్రాన్స్​లో ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టే బిజినెస్​గా మారింది. దాంతో ఆ దేశం సుమారు 150 రకాల వెనిగర్‌‌ని తయారుచేస్తోంది. బ్రిటన్​లో కూడా వెనిగర్ ప్రొడక్షన్​ పెరిగింది. ఇంగ్లండ్​లో మాల్ట్ వెనిగర్ అనే కొత్త రకం తయారైంది. దాన్ని మొదట ‘ఎలెగర్’ అని పిలిచేవారు. అమెరికాలో మాత్రం సిడార్​ వెనిగర్ ఎక్కువగా వాడతారు. 19వ శతాబ్దంలో ఇండస్ట్రీల్లో తయారుచేయడం మొదలైంది. దాంతో కొన్ని నెలల పాటు ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం) చేసే ప్రాసెస్​ని రెండు వారాలకు తగ్గించారు. అప్పుడే జపాన్​ కూడా వెనిగర్​ తయారుచేసే ఇండస్ట్రీలను మొదలుపెట్టింది. ఇక 20వ శతాబ్దం నాటికి వెనిగర్ ఒక రివల్యూషన్​గా మారింది. ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఫెర్మెంటేషన్ ప్రాసెస్​ పూర్తయ్యేది. 

రకరకాల ఫ్లేవర్స్​లో..

డిస్టిల్డ్​ వైట్ : ఎసిటిక్ యాసిడ్, నీళ్లు కలిపి దీన్ని తయారుచేస్తారు. 
రెడ్ వైన్ : సలాడ్స్​లో ఎక్కువగా వాడతారు. రెడ్ వైన్​ని పులియబెట్టి ఈ వెనిగర్​ని తయారుచేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే.. ద్రాక్ష రసం నుంచి తయారైంది ఇది.
బాల్సమిక్ : ఈ వెనిగర్​ ఇటలీలో తయారైంది. ఇది అన్ని రకాల వెనిగర్స్​ కంటే కొంచెం డిఫరెంట్​గా ఉంటుంది. ఇది కూడా ద్రాక్షల నుంచే తయారైంది. ఇది స్వీట్​ ఫ్లేవర్​. చూడ్డానికి నల్లగా ఉంటుంది.
రైస్​ వెనిగర్ : రైస్ వైన్​ని పులియబెట్టి దీన్ని తయారుచేశారు. ఇది ఆసియాకు చెందిన ఇండ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. దీంట్లో ఆల్కహాల్ శాతం తక్కువ. ఏసియన్ రెసిపీల్లో కామన్​గా వాడతారు. 
కేన్ వెనిగర్ : చాలా తక్కువగా కనిపించే వెనిగర్స్​లో ఇదొకటి. చెరకు (కేన్) రసంతో తయారుచేస్తారు. చెరకు రసంతో తయారైందని తియ్యగా ఉంటుంది అనుకుంటున్నారా? ఇది తియ్యగా ఉండదు.
కోకోనట్ వెనిగర్ : కొబ్బరి పాలతో తయారుచేసే వెనిగర్​ ఇది. కోకోనట్ వెనిగర్ రుచి, వాసన డిఫరెంట్​గా ఉంటాయి. 

ఇవేకాకుండా యాపిల్, షాంపెయిన్, ఆప్రికాట్, బార్లీ లేదా ఓట్స్ మాల్ట్, బీర్ వంటి చాలా రకాలున్నాయి వెనిగర్​లో. 

హెల్త్​కి మంచిదేనా?

యాపిల్ సిడార్ వంటి ఫ్రూట్ వెనిగర్​ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని ఒక రీసెర్చ్​లో తేలింది. చాలాకాలంగా దీన్ని వెయిట్ లాస్ రెమెడీగా వాడుతున్నారు. వెనిగర్ తీసుకోవడం వల్ల హార్ట్​కి మంచిదని, బీపీ, హైపర్ టెన్షన్ తగ్గుతాయని ఈ మధ్యనే ఒక స్టడీలో వెల్లడైంది. చర్మ ఆరోగ్యానికి వెనిగర్ ఉపయోగపడుతుంది. ఎగ్జిమా, చర్మం పొడిబారడం వంటివాటిని నయం చేస్తుంది. అలాగే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.   

వెనిగర్ అనేది ఫ్రెంచ్​ పదం ‘విన్ ఐగర్’ నుంచి వచ్చింది. అంటే పుల్లటి వైన్ అని అర్థం. వెనిగర్​కి ఒక స్పెషల్​ డే ఉందని తెలుసా! అదే నవంబర్ 1, ఆ రోజు నేషనల్ వెనిగర్ డే జరుపుకుంటారు. ఇండస్ట్రీల్లో తయారైన వంటల్లో, వైద్యంలో ఇప్పటికీ వాడుతున్న యాసిడ్ ఇది. వంటల్లోనే కాదు, కిచెన్​ శుభ్రం చేయడానికి కూడా వెనిగర్ వాడతారు. వెనిగర్​తో క్లీన్ చేయడంవల్ల బ్యాక్టీరియా రాదు. అలాగే కాటన్ డ్రెస్​లపై పడిన మరకల్ని పోగొడుతుంది వెనిగర్.