ప్రాణాలు పణంగా పెట్టి డబ్బు సంపాదిస్తోన్న సోషల్ మీడియా స్టార్స్

ప్రాణాలు పణంగా పెట్టి డబ్బు సంపాదిస్తోన్న సోషల్ మీడియా స్టార్స్
  • హెవీగా ఫుడ్ తింటుండటంతో ఊబకాయం
  • బరువు పెరిగి చనిపోతున్న వైనం
  • ఫాలోవర్స్ కోసం యూట్యూబర్‌‌‌‌ల తంటాలు

సెంట్రల్ డెస్క్ : కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించడం అందరికీ ఇష్టం ఉండదు. అలాంటి వాళ్లు స్మార్ట్ గా, ఈజీగా మనీ సంపాదించాలని అనుకుంటారు. ఇలా స్మార్ట్ గా పనిచేసి విజయం సాధించడానికి ఉన్న సోర్సెస్ లో సోషల్ మీడియా ఒకటి. అందులోనూ యూట్యూబ్ ద్వారా వేలు, లక్షలు, కోట్లల్లో ఇన్ కం పొందొచ్చు. అయితే, సోషల్ మీడియా స్టార్స్​గా సక్సెస్ కావాలంటే మంచి కంటెంట్ ఉండాల్సిందే. మరి ఆ కంటెంట్ ఎంచుకోవడంలో తప్పు జరిగితే ప్రాణాలకు ముప్పు తప్పదు. అదిగో అలాంటి డేంజర్ కంటెట్లో ఒకటే 'బింజ్​ ఈటింగ్(అతిగా తినడం)'. వీళ్లు ఎక్కడ ఏ ఫుడ్ ఐటమ్ కనిపించినా లాగించేస్తారు. అన్నిఫుడ్ ఐటమ్స్ ఒకేసారి తింటూ వీడియోలు చేస్తారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఈ కంటెంట్ ద్వారా కొందరు చాలా పాపులర్ అయ్యారు. అంతకు మించి భారీగా డబ్బు సంపాదించినా.. ఫిజికల్ గా చాలా నష్టపోయారు. అలా.. డబ్బు కోసం హెవీగా ఫుడ్ తిని, సోషల్ మీడియా స్టార్స్ గా మారి.. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో సతమతమవుతోన్న ఇద్దరు పాపులర్ వ్యక్తుల గురించి తెలుసుకుందాం..

రోజుకు 10,000 కేలరీలు తింటున్న నికోలస్ పెర్రీ

నికోలస్ పెర్రీ ఉక్రెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. చూడటానికి యంగ్​గా, సన్నగా, చాలా యాక్టివ్ గా ఉండేవాడు. 2016లో "నికోకాడో అవోకాడో" పేరిట యూట్యూబ్ చానెల్ క్రియేట్ చేశాడు. దానిలో మొదట సంగీతానికి సంబంధించిన వీడియోలను పోస్టు చేశాడు. వాటికి ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో రూటు మార్చాడు. కెమెరా ముందు కూర్చుని ఫుడ్ తినడం ప్రారంభించాడు. దాంతో అతని వీడియోలకు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అతని చానల్ కు సబ్ స్కైబర్స్ సంఖ్య  3.5 మిలియన్లకు చేరింది. భారీ ఇన్ కం వచ్చింది.  డబ్బు కోసం, ఫాలోవర్స్ ను తనవైపు ఆకట్టుకోవడం కోసం రోజు పది వేల కేలరీలు తినేవాడు. దాంతో సన్నగా, యాక్టివ్ గా ఉండే పెర్రీ..180 కిలోల బరువుకు పెరిగాడు. అంతేకాదు.. అతని మానసిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కోసారి లైవ్​లో కారణం లేకుండానే ఏడుస్తున్నాడు. ఊబకాయంతో నడవలేకపోతున్నాడు. ఊపిరి పీల్చడం చాలా కష్టంగా మారింది. దాంతో ముక్కుకు నాన్- ఇన్వాసివ్ వెంటిలేషన్ ఫేస్ మాస్క్ ధరిస్తున్నాడు. కూర్చుంటే నిలబడరాదు. నిలబడితే కూర్చోరాదు. ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తున్నా నికోలస్ పెర్రీ ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోకపోతే ప్రాణానికే ప్రమాదమని అతని ఫాలోవర్స్, హెల్త్ ఎక్స్ పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బింజ్​ ఈటింగ్ వీడియోలపై డాక్టర్ల స్పందనేంటి?

బింజ్​ ఈటింగ్(అతిగా తినడం) చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఫుడ్ హేవీగా తీసుకుంటే ఊబకాయం బారిన పడతారని యూకేకి చెందిన జనరల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ డాక్టర్ జాక్ ఉద్దీన్ వెల్లడించారు. డబ్బు సంపాదన కోసం అతిగా తింటూ వీడియోలు చేయడం వెర్రితనమని తెలిపారు. ప్రజలు అసాధారణ విషయాల వైపు ఆకర్షితులవుతారని..వాటికి చాలా మంది మానసికంగా కనెక్ట్ అవుతారని చెప్పారు. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోలతో క్రియేటర్ తో పాటు వ్యూవర్స్ ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. ముఖ్యంగా వీడియో క్రియేటర్స్ బరువు విపరీతంగా పెరుగుతుందని..హెల్త్ పూర్తిగా దెబ్బతింటుందని చెబుతున్నారు. కోరి ఊబకాయం కొని తెచ్చుకోవద్దని డాక్టర్లు అంటున్నారు.  బింజ్​ ఈటింగ్ బదులుగా వేరే కంటెంట్ ఎంచుకుని సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

ఎక్స్ పైర్డ్ ఫుడ్ తిని ఫేమస్..చివరకు

ఫుడ్ తింటూ ఫేమస్ అయిన మరొక సోషల్ మీడియా స్టార్ టేలర్ లీజ్యూన్(33). లూసియానాకు చెందిన ఇతను ఒక టిక్ టాకర్. లీజ్యూన్ టిక్‌‌‌‌టాక్ అకౌంట్ పేరు 'వాఫ్ఫ్లర్ 69'. ఎక్స్ పైర్ అయిన జంక్ ఫుడ్ తో పాటు కొన్ని విచిత్రమైన వస్తువులను తినేవాడు. ఆ వీడియోలను 'వాఫ్ఫ్లర్ 69'లో పోస్ట్ చేసేవాడు. కంటెంట్ కొత్తగా ఉండటంతో వీడియోలు వైరల్ అయ్యాయి. అతని ఫాలోవర్స్ సంఖ్య 1.8 మిలియన్లకు చేరుకుంది. ఇన్ కం ఎక్కువగా వస్తుండటంతో ఫుడ్ వీడియోలు చేయడం కొనసాగించాడు. అలా ఏది పడితే అది తినేయడంతో టేలర్ లీజ్యూన్ కు 33 ఏళ్లకే గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఇటీవల మృతిచెందాడు.