బెంగళూరు కేసులో ట్విస్ట్ : కారు ఢీకొని సత్తుపల్లి యువకుడు మృతి.. రైలు పట్టాలపై పడేసి వెళ్లిన నిందితులు

బెంగళూరు కేసులో ట్విస్ట్ : కారు ఢీకొని సత్తుపల్లి యువకుడు మృతి.. రైలు పట్టాలపై పడేసి వెళ్లిన నిందితులు

బెంగళూరు సిటీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. సిటీలో కారు ఢీకొని తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి చెందిన యువకుడు చనిపోయాడు.. కారు ప్రమాదంలో చనిపోతే తమపై ఎక్కడ కేసు పెట్టి.. జైల్లో వేస్తారనే భయంతో.. కారులోని వారు.. చనిపోయిన యువకుడిని.. రైలు పట్టాలపై పడేశారు. రైలు ఢీకొని చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. శవం నిజం లాంటిది కదా.. అసలు విషయం రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.. బెంగళూరులో సంచలనంగా మారిన ఈ కేసుల వివరాల్లోకి వెళితే...

 సత్తుపల్లి జవహర్ నగర్ కాలనీకి చెందిన అముదాల అబ్రహం మారెమ్మ కుమారుడు ప్రకాష్(22) బీటెక్ పూర్తి చేశాక బెంగుళూరులోని సాప్ట్‌వేర్ ఇంజనీర్ గా ఉద్యోగానికి ఎంపికయ్యాడు.2024, జూన్15వ తేదీన అక్కడ ఉద్యోగంలో చేరిన ప్రకాశ్.. 21వ తేదీ శుక్రవారం రాత్రి విధులకు హాజరయ్యేందుకు తన గది నుంచి ఆఫీస్ కు బయలుదేరాడు. అయితే, రైలుపట్టాలపై తీవ్ర గాయాలతో ప్రకాష్ మృతి చెందాడని అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో సత్తుపల్లి నుంచి తల్లిదండ్రులు, బంధువులు బెంగళూరు బయలదేరి వెళ్లారు.

రైలు పట్టాలపై తీవ్ర గాయాలతో ప్రకాష్ మృతి చెంది ఉన్నట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు తెలిపారు. అయితే, ప్రకాష్ నివాసం ఉండే ప్రాంతం, రైలు పట్టాలు ఉన్న ప్రాంతానికి సంబంధం లేకపోవడంతో వారు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బెంగళూరు పోలీసులు సీసీ టీవీల పుటేజీలను పరిశీలించగా.. కారు ఢీకొనడంతో ప్రకాశ్ మృతి చెందినట్లు తేలింది. దీంతో నిందితులు మృతదేహాన్ని రైల్వే పట్టాలపై వేసి రైలు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక, బెంగళూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం శనివారం రాత్రి కుటుంబ సభ్యులకు ప్రకాశ్ మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహన్ని స్వగ్రామం సత్తుపల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. చేతికి కొచ్చిన కొడుకు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద చాయాలు ఆలుముకున్నాయి.