సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో ఇంజినీరింగ్ క్లాసులు

సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో ఇంజినీరింగ్ క్లాసులు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల స్టూడెంట్లకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులే ప్రొఫెసర్లుగా రానున్నారు. సీనియర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, పలు ఇండ్రస్టీల్లోని సీనియర్ ఉద్యోగులతో ఇంజినీరింగ్ స్టూడెంట్లకు పాఠాలు చెప్పించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు మొదలుపెట్టారు. 

కొత్త కోర్సుల స్టూడెంట్లకు క్లాసులు

రాష్ట్రవ్యాప్తంగా 177 బీటెక్ ఇంజినీరింగ్ కాలేజీలుండగా, వాటిలో లక్షకు పైగా సీట్లున్నాయి. వీటిలో మెజార్టీ కాలేజీలు జేఎన్టీయూ పరిధిలోనే ఉన్నాయి. బీటెక్​లో ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, సివిల్ అండ్ మెకానికల్ తదితర అనుబంధంగా 45 కోర్సులున్నాయి. వీటన్నింటిలోనూ కంప్యూటర్ సైన్స్​కే ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ మధ్యకాలంలో కంప్యూటర్ సైన్స్​కు అనుబంధంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లర్నింగ్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తదితర కోర్సులను ఉన్నత విద్యాశాఖ తీసుకొచ్చింది. కానీ, వీటికి ప్రత్యేకమైన సిలబస్ లేదు. సిలబస్ తయారీ కమిటీ సభ్యులకు అవగాహన ఉన్నంతలో రూపొందించి, అందులోంచే స్టూడెంట్లకు క్లాసులు చెప్తున్నారు. అయితే ఇది మార్కెట్లో అవసరాలకు అనుగుణంగా స్టూడెంట్ల క్వాలిటీని పెంచలేదనే వాదన ఇండస్ట్రీల నుంచి వినిపిస్తోంది. దీన్ని అధిగమించేందుకు జేఎన్టీయూ కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. 

యూజీసీ గ్రీన్ సిగ్నల్..

పెద్ద కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని, ఆ కంపెనీల ఉద్యోగులతోనే పాఠాలు చెప్పించుకునేందుకు కాలేజీలకు యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. దీంతో జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లోనూ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ (పీవోపీ) పేరుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాఠాలు చెప్పించనున్నారు. ఇందుకు సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఇండస్ట్రీల్లో పనిచేస్తున్న కనీసం15 ఏండ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్నవాళ్లను అవకాశం ఇవ్వాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. వాళ్లతో వారంలో రెండ్రోజులు లేదా రెండు క్లాసులు ఆన్​లైన్​లో లేదా ఆఫ్ లైన్​లో చెప్పించాలని యోచిస్తున్నారు. అయితే, మొత్తం లెక్చరర్లలో 10% మందిని కంపెనీల నుంచి తీసుకునేందుకు యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. దీంతో జేఎన్టీయూ అనుబంధ సర్కారు కాలేజీల్లోనూ టీసీఎస్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. పెద్దగా సిలబస్ , పుస్తకాల్లేని కోర్సుల్లో ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు పలు కోర్సుల్లోని స్టూడెంట్లకు వారితో క్లాసులు చెప్పించనున్నారు.

ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తం

ఈ ఏడాది నుంచి పీవోపీ కింద సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఇండస్ట్రీలోని సీనియర్ ఉద్యోగులతో స్టూడెంట్లకు క్లాసులు చెప్పాలని నిర్ణయించాం. యూజీసీ గైడ్​ లైన్స్ ప్రకారమే ఇలా చేస్తున్నాం. సంబంధిత ఫీల్డ్​లో కనీసం15 ఏండ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్న ఉద్యోగులకు మాత్రమే క్లాసులు చెప్పేందుకు అనుమతిస్తాం. ప్రైవేటు కాలేజీవాళ్లు కూడా జేఎన్టీయూ పర్మిషన్​తో ఇలా నియమించుకోవచ్చు.
- మంజూర్ హుస్సేన్, జేఎన్టీయూ రిజిస్ట్రార్