పాత ఫోన్లు, కంప్యూటర్ల వేగాన్ని పెంచేందుకు సాఫ్ట్​వేర్

పాత ఫోన్లు, కంప్యూటర్ల వేగాన్ని పెంచేందుకు సాఫ్ట్​వేర్

ఇష్టంగా కొనుక్కున్న ఫోన్ లేదా ల్యాప్​టాప్​ సరిగ్గా పనిచేయకుంటే మనసంతా ఏదోలా ఉంటుంది. కంప్యూటర్ లేదా ఫోన్​లో గేమ్స్​ ఆడేవాళ్లు, కొత్త గేమ్స్​ డిజైన్ చేసేవాళ్లు అయితే  తెగ బాధపడతారు. అలాంటి సమస్యే వీళ్లకు ఎదురైంది. ఇకపై ఎవ్వరికి ఈ సమస్య రాకూడదని  ఒక సాఫ్ట్​వేర్ తయారుచేశారు కేరళకు చెందిన అన్నదమ్ములు విష్ణు నాయర్, వాసుదేవ్​ నాయర్. బీటెక్​ మూడో సంవత్సరం చదువుతున్నాడు విష్ణు. వాసుదేవ్​ ప్లస్​ టూ స్టూడెంట్.  వీళ్లు ఇద్దరూ లాక్​డౌన్​లో కంప్యూటర్ గేమ్స్​ బాగా ఆడేవాళ్లు. కొన్నిరోజులకు వాళ్ల కంప్యూటర్​ హార్డ్​వేర్​ అవుట్​డేట్​ కావడంతో దాని స్పీడ్ తగ్గిపోయింది. దాంతో ‘ఏం చేయాలి?’ అని ఆలోచించారు. కొత్త హార్డ్​వేర్​కి ఎక్కువ డబ్బులు కావాలి. అందుకని పాత ఫోన్లు, కంప్యూటర్ల వేగాన్ని పెంచేందుకు ఒక సాఫ్ట్​వేర్ ఉంటే బాగుండు అనుకున్నారు. ఆ పనేదో మనమే ఎందుకు చేయకూడదు అనిపించింది వీళ్లకు. అలా... ‘విర్గ.టెక్​’ పేరుతో కొత్త సాఫ్ట్​వేర్ తయారుచేశారు. హై– ఎండ్ ప్రాసెసర్, శక్తివంతమైన గ్రాఫిక్స్​ ప్రాసెసింగ్ యూనిట్​, ఎక్కువ స్టోరేజ్​ ఫీచర్లు ఉన్నాయి ఇందులో. ఈ సాఫ్ట్​వేర్ ఉంటే  కంప్యూటర్, ఫోన్​లో గేమ్స్​ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆడొచ్చు. వీడియో ఎడిటింగ్ చేయొచ్చు.

ఎలా పనిచేస్తుందంటే...

కంప్యూటర్, ల్యాప్​టాప్ లేదా ట్యాబ్​ని ‘విర్గ’ వెబ్​సైట్​తో కనెక్ట్ చేయాలి. ఈ సాఫ్ట్​వేర్ కంప్యూటర్, ఫోన్​ స్పీడ్​ని మాత్రమే కాకుండా వాటి స్పేస్​ని కూడా పెంచుతుంది. దీంతో బ్యాటరీ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్​ మంచిగుంటే పదేండ్ల నాటి కంప్యూటర్ కూడా గ్రాఫిక్స్​ కార్డ్​ ఉన్న కంప్యూటర్​లా పనిచేస్తుంది. 1జిపిఎస్​ వేగంతో గేమ్స్​, ఇతర ఫైళ్లను డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

వంద మందికి ఉచితం...

యూజర్లు ‘విర్గ’ వెబ్​సైట్​లోకి లాగిన్ కావాలి. తర్వాత అవసరమైన సర్వీస్​ని ఎంచుకోవాలి. ఆ సర్వీస్​ ఎంత టైం వరకు, ఎన్ని రోజులకు కావాలో కూడా చెప్పాలి. ట్రయల్​లో భాగంగా ముందుగా లాగిన్​ అయిన వంద మంది  ఈ సాఫ్ట్​వేర్​ని ఉచితంగా వాడుకోవచ్చు. త్వరలోనే ఈ సాఫ్ట్​వేర్​ని పూర్తిస్థాయిలో డెవలప్ చేసే పనిలో ఉన్నారు విష్ణు, వాసుదేవ్​.