
ముంబై: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన తల్లి కలలోకి వచ్చి పిలిచిందని ఓ బాలుడు(16) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివశరణ్ అనే బాలుడి తల్లి మూడు నెలల క్రితం జాండీస్‌తో మరణించింది.
అప్పటి నుంచి అతను సోలాపూర్‌లోని తన మామయ్య ఇంట్లో ఉంటున్నాడు. శుక్రవారం బాలుడు అక్కడే ఉరివేసుకున్నాడు. తన తల్లి కలలో కనిపించిందని శివచరణ్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.'నేను శివశరణ్. నాకు బతకాలని లేదు. నా తల్లి చనిపోయిప్పుడే నేనూ పోవాల్సింది. కానీ మామయ్య, అమ్మమ్మ ముఖాలు చూసి బతికాను.
నిన్న అమ్మ నా కలలోకి వచ్చింది. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నా వద్దకు రా అని పిలిచింది. అందుకే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా. మామయ్య, అమ్మమ్మ నన్ను చాలా ఆదరించారు" అని నోట్‌లో రాశాడు. కాగా, శివశరణ్ 10వ తరగతిలో 92 శాతం మార్కులు సాధించాడు. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడని శివశరణ్ మామయ్య తెలిపారు.