విదేశాల్లో వింతైన కొన్ని పండుగలు

విదేశాల్లో వింతైన కొన్ని పండుగలు

పండుగ అంటేనే సంతోషం. పండుగ వస్తుందంటే చాలు నెల రోజుల ముందునుంచే సందడి ఉంటుంది. అలాగే ప్రతి పండక్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. విదేశాల్లో కొన్ని పండుగలు వింతగా ఉంటాయి. ఎంతో సంతోషంగా జరిగే ఆ పండుగలని చూస్తే ఆశ్చర్యం, భయం రెండూ ఒకేసారి కలుగుతాయి. ఆ పండుగల విశేషాలే ఇవి.

యాన్షుయ్ బీ హైవ్  ఫైర్​ వర్క్స్

ఈ పండుగ ప్రపంచంలో జరిగే అతిపెద్ద ఫోక్ సెలబ్రేషన్స్​లో మూడోది. తైవాన్​లో జరుపుకునే ఈ వేడుకలో వేల కొద్దీ ఫైర్​ వర్క్స్ వాడతారు. ఆ టైంలో పెద్ద సంఖ్యలో తేనెటీగలు బయటకు వస్తాయి. ఈ ట్రెడిషనల్​ సెలబ్రేషన్​ని ‘బీ హైవ్​ ఫైర్​ వర్క్స్​’ అంటారు. దీన్ని ప్రతి ఏటా జులై లేదా ఆగస్ట్​ నెలల్లో చేస్తారు. 1885లో కలరా ప్యాండెమిక్​ టైంలో అందరూ భయపడుతుంటే  పాలంకిన్​ అనే వ్యక్తి దేవుడిని ప్రార్థిస్తూ టపాసులు పేల్చాడు. అది చూసి వీధిలో ఉన్న మిగతా వాళ్లు కూడా భయం పోగొట్టుకోవడానికి టపాసులు పేల్చారు. రెసిడెన్షియల్ గేట్ ఎంట్రన్స్​లో ‘గన్​ డెక్’ లేదా ‘గన్ వాల్’ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వేల కొద్దీ రాకెట్స్​ను ఒకేసారి వెలిగించేవాళ్లు. ఈ వేడుక ఫేమస్ కావడంతో చూసేందుకు టూరిస్ట్​లు వెళ్లడం మొదలైంది. ఇలా చేయడం వల్ల అన్ని రకాల బాధలు పోయి కొత్త ఏడాదిలో అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు. దీన్ని వాళ్లు ‘ఫైర్​ వర్క్స్ బాప్టిజం’ అంటారు.

తకనకుయ్ 

పెరూలోని చంబివిల్కాస్ ప్రావిన్స్​లో ఉన్న ఊర్లన్నీ కలిసి తకనకుయ్ అనే పండుగ చేసుకుంటాయి. ఈ పండుగ స్పెషల్​ ఏంటంటే... పిడికిలి బిగించి ఒకరినొకరు గుద్దుకోవాలి. ఆ టైంలో పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు రెఫరీలు కూడా ఉంటారు. పండుగ పేరు చెప్పుకుని పిడి గుద్దులు కురిపించే ఈ ఆటకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫైట్ చేసే వ్యక్తి తన చేతులకు ఒక బట్ట చుట్టుకోవాలి. ఈ ఫైట్​​లో కొట్టడం, కొరకడం, కింద పడేయడం, జుట్టు లాగడం వంటివి చేయకూడదు. నాకౌట్ పాయింట్​ మీద విన్నర్​ని అఫీషియల్​గా సెలక్ట్​ చేస్తారు. 

బేబీ జంపింగ్​

స్పెయిన్​లోని కాస్టిల్లో డి ముర్షియా అనే గ్రామంలో బేబీ జంపింగ్ ఫెస్టివల్​ జరుగుతుంది. ఇది వాళ్ల ట్రెడిషనల్ పండుగ.1620వ సంవత్సరం నుంచి ఈ వేడుకలు చేస్తున్నారట వాళ్లు. రోడ్డు మీద పరుపు వేసి ఏడాది వయసున్న పిల్లల్ని పడుకోబెడతారు. ట్రెడిషనల్ డ్రెస్​ వేసుకున్న ఒక వ్యక్తి ఆ పసిపిల్లలపై నుంచి దూకుతాడు. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు పిల్లల దరిచేరవని, వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్ముతారు. ప్రతి ఏటా వారం రోజుల పాటు ఈ వేడుక జరుగుతుంది. ఈ పండుగను ‘ఎల్ కొలాచో’ అని పిలుస్తారు. 

చీజ్ రోలింగ్

ఇంగ్లాండ్​లో చీజ్ రోలింగ్ అనే పండుగ చేసుకుంటారు. ఇది200 ఏండ్ల నాటి పండుగ. చలికాలం అయిపోయిన తర్వాత వేసే కొత్త పంటలు బాగా పండాలని ఈ పండుగ చేసుకుంటారు. చీజ్​రోలింగ్​ పండుగప్పుడు తొమ్మిది పౌండ్ల బరువు ఉండి గుండ్రంగా ఉన్న చీజ్​ని కొండపై నుంచి దొర్లిస్తారు. దాని వెనకాలే కొంతమంది పోటీదారులు పరుగెత్తుతారు. ముందుగా గమ్యాన్ని చేరుకున్న వాళ్లని విన్నర్​గా ప్రకటించి, ఆ చీజ్​ని ప్రైజ్​గా ఇస్తారు. మే చివరి వారంలో జరుపుకునే ఈ పండుగను కూపర్స్ హిల్ చీజ్ రోలింగ్ అండ్ వేక్ అని కూడా అంటారు. ఈ ఫెస్టివల్​ ఈ ఏడాది మే 29న జరుగుతుంది.

ఫ్రూట్​ బ్యాటిల్​

నార్తర్న్​ ఇటలీలోని ఇవ్రియా అనే సిటీలో ఇవ్రియా కార్నివల్ పండుగ చేస్తారు. దాన్నే ఫ్రూట్ బ్యాటిల్ అని కూడా అంటారు.  ‘మా స్వేచ్ఛను హరించొద్దు’ అంటూ ప్రభుత్వాని​కి వ్యతిరేకింగా ప్రజలు చేసే పండుగ ఇది. ఈ వేడుక కోసం ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోతారు. ఒకరి మీద ఒకరు ఆరెంజ్ పండ్లను విసురుకుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫుడ్ ఫైట్స్​లో ఇది ఒకటి.