భార్యను కొడుతుంటే అడ్డుకున్నాడని తండ్రిని హత్య చేసిన కొడుకు

భార్యను కొడుతుంటే అడ్డుకున్నాడని తండ్రిని హత్య చేసిన కొడుకు

వర్ధన్నపేట, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని భార్యను చంపబోతుండగా.. తండ్రి అడ్డుకోవడంతో అతడిని హత్య చేశాడు. వరంగల్‌‌ జిల్లా వర్ధన్నపేటలో శనివారం జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బడి తండాకు చెందిన సురేశ్‌‌కు తాళ్లకుంటకు చెందిన మౌనికతో 2019లో వివాహమైంది.

తాగుడుకు బానిసైన సురేశ్‌‌ నిత్యం మౌనికను కొడుతుండేవాడు. సురేశ్‌‌కు ఓ యువతితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం మౌనికకు తెలియడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకొని మౌనికను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. సురేశ్‌‌ వివాహేతర సంబంధం విషయం అతడి తండ్రి రాజాకు తెలియడంతో కొడుకును మందలించాడు. 

దీంతో తండ్రి, భార్య అడ్డు తొలగించుకునేందుకు సురేశ్‌‌ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం మద్యం తాగొచ్చి భార్య మౌనికతో గొడవ పడి ఆమెను కొట్టాడు. గమనించిన అతడి  తండ్రి రాజా.. కొడుకును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన సురేశ్‌‌ రాజా ఛాతిపై పిడిగుద్దులు గుద్దాడు. అనంతరం చీరతో మెడకు ఉరి వేసి హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయి తొర్రూరుకు వెళ్లి తిరిగి వర్ధన్నపేటకు వచ్చాడు. 

ఈ విషయం తెలుసుకొని సురేశ్‌‌ను అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీవివాస్‌‌, ఎస్సైలు సాయిబాబు, రాజు పాల్గొన్నారు. నిందితుడిని పట్టుకున్న సీఐ శ్రీవివాస్, ఎస్సైలు సాయిబాబు, రాజును సీపీ సన్‌‌ప్రీత్‌‌సింగ్‌‌ అభినందించారు.