
- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో దారుణం
శంకరపట్నం, వెలుగు: పింఛన్ డబ్బులు లెక్క చెప్పడం లేదని, అన్నీ చిన్నకొడుకుకే ఇస్తుందన్న కోపంతో ఓ వ్యక్తి తన తల్లిని గ్రామ పంచాయతీ బిల్డింగ్ వద్ద వదిలేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌లో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన వెంగల లచ్చవ్వకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. లచ్చవ్వను ఆమె ముగ్గురు కొడుకులు వంతులవారీగా పోషిస్తున్నారు.
రెండో కొడుకు రాజయ్య వంతు శుక్రవారం పూర్తి కావడంతో లచ్చవ్వను పెద్ద కొడుకు రాజకొమురయ్య ఇంటి వద్ద వదిలేశాడు. అయితే పింఛన్ పైసలన్నీ చిన్నకొడుకుకే ఇస్తుందని, ఆ డబ్బులు లెక్క చెప్పాకే తాను చూసుకుంటానని, లేదంటే తనకు సంబంధం లేదంటూ రాజకొమురయ్య.. తన తల్లి లచ్చవ్వను గ్రామపంచాయతీ వద్ద వదిలి వెళ్లాడు. సమాచారం అందుకున్న కేశవపట్నం పోలీసులు గ్రామానికి చేరుకొని రాజకొమురయ్యతో మాట్లాడారు. పెన్షన్ డబ్బుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాజకొమురయ్య తన తల్లిని ఇంటికి తీసుకెళ్లాడు.