
లేహ్: నాలుగు పాయింట్ల అజెండా అమలుపై లడఖ్ నాయకత్వంతో చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్ చుక్ నేతృత్వంలో ఆదివారం లేహ్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించారు. మొత్తం వందమంది వలంటీర్లు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ‘ఢిల్లీ చలో పాదయాత్ర’ పేరుతో కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్(కేడీఏ) తో కలిసి లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ) ఈ యాత్రను ప్రారంభించింది.
రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ను పొడిగించడం, లడఖ్‌కు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం, లేహ్– కార్గిల్ జిల్లాలకు ప్రత్యేక లోక్ సభ సీట్లు కేటాయించాలన్న 4 డిమాండ్లతో కేడీఏ, ఎల్ఏబీ ఈ యాత్ర చేపట్టాయి. ఈ ఏడాది మార్చిలో కేంద్రం, లడఖ్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అయినా ఎలాంటి పురోగతి రాలేదు. దీంతో వాంగ్‌చుక్ ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించారు. ‘భారత్ మాతా కీ జై’, ‘మాకు ఆరో షెడ్యూల్ కావాలి’ అని నినదిస్తూ వలంటీర్లు ముందుకు సాగారు. వాంగ్ చుక్ తో కలిసి ఎల్ఏబీ చైర్మన్ తుప్సన్ చెవాంగ్.. ఎన్డీఎస్ పార్క్ వద్ద ఈ యాత్రకు జెండా ఊపారు.