
- తెలంగాణలో గెలుపు కోసం ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్ కృషి చేయాలి
- పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతల మీటింగ్‌లో కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసినయ్
- రాష్ట్రంలో నిజాం తరహా పాలన నడుస్తున్నది
- హైదరాబాద్ నుంచి గట్టి సంకల్పంతో ముందుకు పోదాం
- తెలంగాణ సహా కేంద్రంలో విజయం సాధిద్దాం
- నేతలెవరూ గొడవలు పడొద్దని హితవు ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశాలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వాలని, టైమ్ పెద్దగా లేదని, విరామం లేకుండా కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలను పార్టీ హైకమాండ్ ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, రాష్ట్రంలో నిజాం తరహా పాలన సాగుతున్నదని మండిపడింది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో రెండ్రోజుల పాటు నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 29 మంది పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలతో రెండో రోజు సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఎన్నికల కోసం పార్టీ సంసిద్ధతపై చర్చించారు. డిసెంబర్లో జరగాల్సి ఉన్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది మేలో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే శ్రమించాలని నేతలకు హైకమాండ్ సూచించింది. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. శాంతి భద్రతలు, స్వేచ్ఛ, సామాజికార్థిక న్యాయం, సమానత్వం వంటి మూల అంశాలు కాంగ్రెస్‌తోనే సాధ్యమని భావిస్తున్నారని పేర్కొంది. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు. తెలంగాణ ప్రజలకు సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేకంగా ఓ మెసేజ్‌ను ఇచ్చింది. ‘‘సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా ఉద్యమకారులు, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అన్ని వర్గాల వాళ్లూ ఇబ్బందులు పడుతున్నరు. ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా మోసం చేశాయి. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను తీసుకొచ్చారు. నిజాం తరహాలో పాలనను సాగిస్తూ మళ్లీ రాష్ట్రాన్ని గతంలోకి నెట్టారు” అని అందులో ఆరోపించింది. రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, ధరణితో హక్కులను కోల్పోయారని తెలిపింది. కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లో మాదిరిగా తెలంగాణలోనూ కాంగ్రెస్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైందని పేర్కొంది.
పెను సవాళ్లు ముందున్నయ్
దేశం ముందు పెను సవాళ్లున్నాయని సీడబ్ల్యూసీ పేర్కొంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని రక్షించేందుకు, వాటిని అణగదొక్కాలనుకునే శక్తులను ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్ సన్నద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో నోరు మూసుకుని కూర్చోలేమని, అందరం కలిసికట్టుగా నియంత పాలనను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
మీ గొడవలు పక్కనపెట్టండి: ఖర్గే
‘‘ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లోనే జరగబోతున్నాయి. మరి, మీరు సిద్ధంగా ఉన్నారా? మీ మండల, బ్లాక్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీల నియామకం ఎంతవరకు వచ్చింది? వారు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారా? ఎన్నికల కోసం బలమైన అభ్యర్థులను గుర్తించారా?’’ అంటూ పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలను సమావేశంలో ఏఐసీసీ చీఫ్మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ‘‘ఇది విశ్రాంతి తీసుకునే టైం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ పదేండ్ల పాలనలో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. ఎవరినీ మోదీ పట్టించుకోవట్లేదు. ఇలాంటి వారిని గద్దె దించాలంటే మనం అవిశ్రాంతంగా శ్రమించాల్సిందే. మీ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టండి.
Also Rard: విజయభేరితో ఓఆర్ఆర్పై.. 10 కి.మీ. ట్రాఫిక్ జాం
మీ విభేదాలను వదిలేయండి. నేతలెవరూ గొడవలు పడొద్దు. గొడవలకు సంబంధించి నేతలు మీడియాకు దూరంగా ఉంటే మంచిది. బయటకు సమాచారం లీక్ చేయొద్దు. సొంత పార్టీ నేతల మీద ఎవరూ బురదజల్లే ప్రయత్నంగానీ, ఆరోపణలుగానీ మీడియా ముందు చేయొద్దు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే అది పార్టీకే నష్టం చేస్తుంది. పార్టీలో ఐక్యతే చాలా ముఖ్యం. ఆ ఐక్యత, క్రమశిక్షణతో అన్ని ఆటంకాలను మనం జయించగలుగుతాం. కర్నాటకలో క్రమశిక్షణతో ముందుకెళ్లాం కాబట్టే గెలిచాం’’ అని ఆయన నేతలకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.
మన గెలుపునకు హైదరాబాదే వేదిక
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే టార్గెట్ అని కాంగ్రెస్ నేతలకు ఖర్గే సూచించారు. దేశంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకు హైదరాబాద్ వేదికగానే తీర్మానాలు చేశామన్నారు. తెలంగాణ నుంచి రెట్టించిన కొత్త ఉత్సాహం, ఒరవడితో ప్రచారంలో ముందుకెళ్దామని ప్రతి ఒక్కరికీ తేల్చిచెప్పారు. పటిష్ఠమైన సందేశాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు. ఓ గట్టి కమిట్మెంట్తో హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లి.. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేలా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఆ కమిట్మెంట్ ఉంటేనే ఒక్క తెలంగాణలోనే కాకుండా.. దేశమంతా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు వివరించాలని ఖర్గే సూచించారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా మహాత్మా గాంధీ ఎంపికై 2024 నాటికి వందేండ్లు పూర్తవుతాయని, బీజేపీని గద్దె దించడమే మహాత్ముడికి అర్పించే ఘనమైన నివాళి అని ఆయన చెప్పారు.
కోటా పెంచాల్సిందే.. కులగణన చేయాల్సిందే
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కోటాను పెంచాల్సిందేనని సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. ఆయన తీర్మానానికి సీడబ్ల్యూసీ నేతలంతా అంగీకారం తెలిపారు. ఇప్పటిదాకా జనాభా లెక్కింపు చేపట్టలేదని, వెంటనే చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. వెంటనే కులగణననూ చేయాలని సమావేశంలో నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.