
ఎక్కువగా బయట తిరిగేవాళ్ల.. ఎండ, వేడి నుంచి తప్పించుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగి ఉపశమనం పొందుతుంటారు. అదే ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ, కూలర్ల కింద సేద తీరుతుంటారు. అయితే, ఇకనుంచి అంత కష్ట పడాల్సిన పనిలేదు అంటోంది సోనీ కంపెనీ. ఎండల్లోనూ ఏసీ కింద ఉండొచ్చు అంటోంది. అవును. అందుకే పాకెట్ ఏసీని తయారు చేసింది. సోనీ రియాన్ పాకెట్ ఏసీ2 పేరుతో తీసుకొస్తున్న ఈ ఏసీ.. జేబులో పట్టేస్తుంది.
క్రౌడ్‌ఫండింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా తీసుకొస్తున్న ఈ ఏసీ.. పవర్ బ్యాంక్ సైజులో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ తో ఈ డివైజ్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. టెంపరేచర్ కావాల్సినట్లు మార్చుకోవచ్చు. అయితే, ఈ ఏసీ కేవలం ఎండాకాలమే కాదు.. చలి కాలంలో కూడా పనికొస్తుంది. అదెలాగంటే.. చలికాలంలో టెంపరేచర్ కి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు.
కారు, వైన్ కూలర్స్‌లో ఉపయోగించే టెక్నాలజీతో ఈ పాకెట్ ఏసీని తయారుచేసింది సోనీ. రియాన్ పాకెట్ ఎయిర్ కండీషనర్‌తో పాటు స్మాల్, మీడియం, లార్జ్ సైజ్‌ల టీషర్ట్స్ వస్తాయి. అందులో ఏసీని ఉంచాలి. లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. 2 గంటలు ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించుకోవచ్చు. సోనీ రియాన్ పాకెట్ ఏసీ ధర సుమారు రూ.10,990. ఈ డివైజ్తో పాటు ఓ టీషర్ట్ వస్తుంది. ఒకవేళ డివైజ్‌తో పాటు ఐదు టీషర్ట్స్ కావాలంటే.. రూ.12,000 చెల్లించాలి. ప్రస్తుతం ఈ ప్రొడక్ట్ కేవలం జపాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.