మంత్రగాడు చెప్పాడని కూతురుకు గుండు గీయించిన్రు

మంత్రగాడు చెప్పాడని కూతురుకు గుండు గీయించిన్రు
  • అబ్బాయి కుటుంబంపై దాడి చేసి అమ్మాయి కిడ్నాప్​ 
  • పోలీసుల అదుపులో నిందితులు
  • జగిత్యాల జిల్లాలో ఘటన  

జగిత్యాల రూరల్, వెలుగు : ప్రేమ వివాహం చేసుకుందని బిడ్డను కిడ్నాప్​ చేసిన తల్లిదండ్రులు..మంత్రగాడు చెప్పాడని ఆమెకు గుండు గీయించారు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు..రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జవ్వాజి అక్షిత 2022 జులై 3న ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి అమ్మాయి అబ్బాయితో పాటు బాలపల్లిలోనే ఉంటోంది. దీంతో అమ్మాయి తండ్రి భూమయ్య, మేనమామ సత్తయ్యతో పాటు మరికొందరు కార్లలో ఆదివారం బాలపల్లిలోని మధు ఇంటికి వచ్చారు. మారణాయుధాలతో మధు కుటుంబసభ్యులపై దాడి చేసి అడ్డు వచ్చిన అక్షిత అత్త, ఆడపడుచులను తీవ్రంగా గాయపరిచారు. అక్షితను కిడ్నాప్​ చేసి తీసుకుని వెళ్లారు. వెంటనే మధు రూరల్ పోలీసులకు కంప్లయింట్​ఇవ్వగా ఎస్సై అనిల్ రెండు టీంలతో గాలింపు చేపట్టారు. 

మాంత్రికుడు చెప్పాడని..

ఆర్థికంగా స్థిరపడని మధు తన బిడ్డను పెళ్లి చేసుకోవడాన్ని సీరియస్ గా తీసుకున్న పెరెంట్స్ అక్షితకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. ఆమె ఎంతకూ వినకపోవడంతో ఓ మాంత్రికుడి వద్దకు తీసుకువెళ్లారు. అక్షిత వెంట్రుకల్లో మరుగు మందు పెట్టడంతోనే ప్రేమ వివాహం చేసుకుందని, గుండు చేయించడమే విరుగుడని చెప్పడంతో అలాగే చేశారు. మరోవైపు అక్షిత కోసం గాలిస్తున్న రూరల్ ​పోలీసులు 24 గంటల్లోనే భూమయ్య స్వగ్రామమైన రాయికల్ మండలం ఇటిక్యాల సమీపంలో గుర్తించి పోలీస్​స్టేషన్ కు తరలించారు. అక్షిత తండ్రి భూమయ్య, తల్లి జయలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.