సారీ అమ్మా… తలుపు వెనుక రాసిన 12 ఏళ్ల బాలిక

సారీ అమ్మా… తలుపు వెనుక రాసిన 12 ఏళ్ల బాలిక

12ఏళ్ల బాలికకు వ్యభిచార చెర విడిపించిన కేరళ పోలీసులు

రెండేళ్లలో బాధితురాలిపై 30మంది అత్యాచారం

కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో దారుణం బయటకొచ్చింది. అక్కడి పోలీసులు ఇటీవలే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి .. వ్యభిచార నరకం అనుభవిస్తున్న బాలికలకు స్వేచ్ఛ అందించారు. అందులో ఓ 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఆ బాలిక చెప్పిన కథ .. ఆ బాలిక అనుభవించిన వేదన అత్యంత బాధాకరమని పోలీసులు .. మీడియాకు వివరించారు. బాధితురాలిని విడిపించినప్పుడు.. ఆమె ఉంటున్న ఇంట్లో తలుపు వెనుక.. సారీ అమ్మా అని చేతితో రాసిన అక్షరాలు ఉన్నాయని.. అవి బాలికే రాసిందని చెప్పారు.

10 ఏళ్ల వయసులో తాను ఉన్నప్పుడు వ్యభిచారం అనే రొంపిలోకి తెలియకుండానే దిగాల్సి వచ్చిందని బాలిక పోలీసులకు చెప్పింది. తమది చాలా పేద కుటుంబం అనీ… నానమ్మ అనారోగ్యంతో బాధపడుతుండేదని.. ఇంట్లో తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో తనను ఈ పరిస్థితుల్లోకి తన సొంత తండ్రే నెట్టాడని బాలిక చెప్పింది.

ఏం జరుగుతుందో తనకు తెలియని పదేళ్ల వయసులో ఉన్నప్పుడే.. ఓ వ్యక్తి తనతో ఇబ్బందిగా ప్రవర్తించాడని బాలిక చెప్పింది. ఆ తర్వాత.. డబ్బులకు ఇంట్లో ఇబ్బంది ఎదురైనప్పుడల్లా తన తండ్రి తననే విటులకు ఎరగా వేసేవాడని అర్థమైందని తెలిపింది. అలా..  ఈ రెండేళ్లలో… దాదాపు 30 తనపై అత్యాచారం చేశారని తెలిపింది. జరుగుతున్న అన్యాయం, కుటుంబ అత్యవసరం అర్థమైనప్పుడు… ఎంతో మానసిక వేదనకు గురయ్యానని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. కుటుంబ పోషణకు తాను ఇంతకంటే మరేమీ చేయలేని పరిస్థితుల్లో సారీ అమ్మా అని తలుపు వెనుకవైపు బాధతో రాశానని వివరించింది. తన తల్లిని కూడా తండ్రి గతంలో ఇలాగే వేశ్యగా మార్చిన సంగతిని ఆమె పోలీసులకు తెలిపింది.

ఈ దారుణంపై దర్యాప్తు చేసిన పోలీసులు… బాలిక తండ్రి సహా.. మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. POCSO చట్టం, ఐపీసీ లైంగిక వేధింపు చట్టం సెక్షన్ 354, అత్యాచారం సెక్షన్ 376 కింద కేసులు పెట్టారు.