"క్షమ"యేవ జయతే!!

"క్షమ"యేవ జయతే!!

‘సారీ’... రెండక్షరాల ఈ పదానికి మామూలు పవర్ లేదు. మనుషుల మధ్య బంధాలను పెంచే మ్యాజికల్ వర్డ్  ఇది. మనమీద పీకల్లోతు కోపమున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి ‘‘ సారీ’’ అంటే చాలు అతడు ఐస్ క్రీంలా కరిగిపోతాడు. మనస్పర్థలతో ఎడబాటుకు గురైన ఇద్దరు ప్రేమికులు ఒక్క ‘సారీ’ తో కలిసిపోతారు. ఊరికే ఫ్రస్టేట్ అయ్యి వర్కర్లను ఇష్టమొచ్చినట్లు తిట్టే ఓ మేనేజర్ కూడా... వాళ్లు ‘సారీ సర్’ అంటే  తన తప్పేంటో తెలుసుకుంటాడు. జాబ్ పోయే పరిస్థితుల్లో ఉన్న ఓ ఉద్యోగి... ‘ సారీ సర్.. ఇంకొక అవకాశం ఇవ్వండి’ అని తన జాబ్ నిలబెట్టుకుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సారీ వల్ల కలిగే ప్రయోజనాలకు అంతుండదు. ‘సారీ’ కి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే ప్రతి ఏడాది సెప్టెంబర్ 14ను ‘క్షమాపణ దినోత్సవం’గా  జరుపుకుంటారు.

 ఎట్లా ప్రారంభమైంది?

పలు మత గ్రంథాల్లో, పురాణేతిహాసాల్లో క్షమాపణ గురించి ఉంది. అయితే దాని గురించి మనిషి అవగాహన పెంచుకోవాలనుకోవడం, అలాంటి ఓ గొప్ప గుణానికి కాలచక్రంలో చోటు ఇవ్వాలనుకోవడం మాత్రం ఇంగ్లండ్ లో జరిగింది. 1994లో క్రిస్టియన్ ఎంబసీ ఆఫ్ క్రైస్ట్స్ అంబాసిడర్స్(CECA) అనే సంస్థ  కొలంబియాలో క్షమాపణకు క్యాలెండర్ లో ఓ డే ఉండాలని వాదించింది. ఈ క్రమంలోనే జాతీయ క్షమాపణ దినోత్సవం గురించి ప్రస్తావించింది. సెప్టెంబర్ 14ను జాతీయ క్షమాపణ దినోత్సవంగా ప్రకటిస్తూ విక్టోరియా నగరంలో ఓ భారీ బ్యానర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో అప్పటినుంచి ప్రజలు క్షమాపణ దినోత్సవం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. నెమ్మదిగా క్షమాపణ దినోత్సవం గురించి ప్రపంచమంతా పాకింది. అలా అలా సంవత్సరాలు గడిచి... బ్రిటన్  జాతీయ క్షమాపణ దినోత్సవం కాస్తా ప్రపంచ జాతీయ దినోత్సవంగా మారింది. క్షమాపణ గొప్పదనాన్ని, దాన్నుంచి కలిగే ప్రయోజనాలను వ్యాప్తి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో వ్యక్తులు, ఎన్జీవోలు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది సెప్టెంబర్ 14న ప్రపంచ క్షమాపణ దినోత్సవాన్ని జరుపుతున్నాయి. 

 ప్రాముఖ్యత ఏంటీ?

తమను బాధపెట్టిన వాళ్లను, తమకు కష్టం కలిగించిన వాళ్లను కూడా క్షమించాలని ఈ డే మనకు చెబుతుంది. ఇతరులపై ద్వేషాన్ని వదిలి... ప్రేమగా ఉండాలని క్షమాపణ దినోత్సవం ముఖ్య సందేశం. అయితే మనల్ని హర్ట్ చేసిన వాళ్లను క్షమించడం కొన్ని సార్లు సవాలుతో కూడిన విషయం. వాళ్ల వల్ల ఇబ్బంది పడడం వల్ల వచ్చిన ఓ రకమైన కోపం, పగ మనల్ని సంకుచితంగా ఆలోచించేలా చేస్తాయి. కానీ వాటిని అధిగమిస్తే మాత్రం శత్రువులు కూడా ప్రాణ స్నేహితుల్లా మారిపోతారు. క్షమించడం, క్షమించమని అడగడం అనేవి శాంతియుత జీవనానికి, వ్యక్తుల మధ్య బంధాలను స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడే అత్యున్నత సాధనాలు. విబేధాలు పక్కన పెట్టి.. కొత్త జీవితాన్ని ఆరంభించాలనే ఓ గట్టి మెసేజ్ ను ఈ డే మనకి కల్పిస్తుంది. 

రెండు ఉదాహరణలు..

క్షమాపణకు ఉన్న గ్రేట్నెస్ గురించి తెలుసుకోవాలంటే ఒకసారి కింద ఇచ్చిన రెండు ఉదాహరణల గురించి చదవండి. 

మొదటి ఘటన...

ఓ హోటల్ లో రాజు అనే వ్యక్తి టీ తాగుతున్నాడు. ఇంతలో అనుకోకుండా రాము అనే వ్యక్తి రాజుకు తగలడంతో టీ అంతా ఒలికి రాజు షర్ట్ మీద పడింది. దీంతో రాజుకు కోపం వచ్చింది. ‘‘ ఏం కళ్లు కనిపించడం లేదా? ’’ అంటూ రాముపై ఫైర్ అయ్యాడు. దానికి రాము బదులిస్తూ ‘‘ ఏయ్ ఏం మాట్లాడుతున్నవ్... చూసుకోలేదు. ఎందుకంత ఫీలవుతున్నవ్?’’ అని అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి కొట్టుకునే దాకా వెళ్లింది. 

రెండో ఘటన... 

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు మీద మార్నింగ్ పూట రాకేశ్  స్కేటింగ్ ప్రాక్టిస్ చేస్తున్నాడు. వర్షం వల్ల రోడ్డు స్లిప్పరీగా మారడంతో స్కేటింగ్ చేస్తున్న రాకేశ్ అదుపు తప్పి అక్కడే వాకింగ్ చేస్తున్న రమేశ్ పై పడ్డాడు. దీంతో రమేశ్ చేతికి స్పల్ప గాయాలయ్యాయి. అయితే కిందపడ్డ రమేశ్ ను వెంటనే రాకేశ్ పైకి లేపి‘‘ సారీ బ్రో.. స్లిప్పయింది. దెబ్బలేమైనా తాకాయా?’’ అని అన్నాడు. దాంతో రమేశ్ ‘‘ ఫర్వాలేదు బ్రో... ఇట్స్ ఓకే’’ అన్నాడు. దాంతో వారిద్దరూ ఎవరిదారిలో వారు వెళ్లిపోయారు. 

ఇక... పై రెండు ఘటనలు చూస్తే క్షమాపణ గురించి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఈగోకు పోవడంతో చిన్న విషయానికే గొడవదాకా వెళ్లారు. కానీ రెండో ఉదాహరణలో తప్పు చేసిన వ్యక్తి తన తప్పు తెలుసుకొని... అందుకు తగ్గట్లు వ్యవహరించడంతో సమస్య ఈజీగా సద్దుమణిగింది. 

 ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలి ?

క్షమాగుణాన్ని ఎలా అలవర్చుకోవాలన్నది ఓ పెద్ద ప్రశ్న.  అయితే ఈ లక్షణాన్ని అలవర్చుకోవడం అంత కష్టమేమీ కాదు. ప్రతి రోజు ఏదో ఓ సందర్భంలో మనం ఇతరులను హర్ట్ చేయడం గానీ, లేదా మనల్ని ఇతరులు హర్ట్ చేయడం గానీ జరుగుతుంటాయి. ఆ సందర్భాల్లో ఏమాత్రం ఈగోకు పోకుండా.. సాటి మానవుడి పట్ల సహృదయంతో వ్యవహరించాలి. మన వల్ల కష్టం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్లి సారీ అనో.. తప్పయిందనో ఒప్పుకుంటే అతడు తప్పకుండా క్షమిస్తాడు. క్షమించకపోయినా ఫర్వాలేదు.  అదే విధంగా ఒక వ్యక్తి మనల్ని హర్ట్ చేసినప్పుడు మనమే ముందుగా సారీ చెబితే... ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం మొదలవుతుంది. దాంతో అతడు తన తప్పు తెలుసుకుంటాడు. అయితే ఇది ప్రతిసారీ జరుగుతుందని చెప్పలేం. అలా జరగాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ మనమేం చేస్తున్నామనేదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మన వంతు పాత్ర మనం సక్రమంగా నిర్వహిస్తే.. ఆటోమేటిగ్గా అవతలివాళ్లు కూడా  అదే చేస్తుంటారు. 

సాహిత్యం, సినిమాలు, ఘటనలు..

క్షమా గుణాన్ని పెంపొందించే సాహిత్యాన్ని చదవాలి. సినిమాలు చూడాలి. గొప్ప వ్యక్తుల సందేశాలు వినాలి... వినిపించాలి. మన జీవితాల్లో అలాంటి ఘటనలు జరిగి ఉంటే వాటి గురించి పదిమందికి చెప్పాలి. ఇలా మనల్ని మనం మార్చుకుంటూ ప్రజల్లో క్షమాపణ గొప్పతనం గురించి అవగాహన కల్పించాలి. శత్రవును కూడా క్షమించినవాడు నిజమైన విజేతగా నిలుస్తాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇతరుల తప్పులను క్షమిద్దాం... తప్పు చేస్తే క్షమించమని అడుగుదాం.

ప్రముఖుల అభిప్రాయాలివీ..

* బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమాపణ అనేది బలవంతుల లక్షణం.
- మహాత్మా గాంధీ

* క్షమించడం అనేది బలహీనుల లక్షణం అని కొందరు భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు.  క్షమించడం అనేది గొప్పవాళ్ల లక్షణం.
 -టీడీ జేక్స్

* మనం నిజంగా ప్రేమించాలనుకుంటే  ముందు క్షమించడం ఎలాగో నేర్చుకోవాలి.
- మదర్ థెరిసా

* తప్పు చేయడం మానవ నైజం.. కానీ ఆ తప్పును క్షమించడం దైవత్వం.
- అలెగ్జాండర్ పోప్

* క్షమాపణ అనేది మధురమైన ప్రతీకారం.
- ఐజాక్ ఫ్రైడ్‌మాన్

* క్షమాపణ అనేది తెగిపోయిన బంధాల మధ్యం వంతెన లాంటిది.
- జేపీ వాస్వాని

* క్షమించడం ధైర్యవంతుల లక్షణం.
- ఇందిరా గాంధీ

* కోపం మిమ్మల్ని చిన్నదిగా చేస్తుంది. కానీ క్షమాపణ మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మిమ్మల్ని పెద్దదిగా చేస్తుంది.
- చెరీ కార్టర్ స్కాట్

* యుద్ధంలో వెయ్యి మందిని సంహరించే వాడి కన్నా,  తనను తాను జయించినవాడే నిజమైన వీరుడు.
- గౌతమ బుద్ధుడు