- గంగూలీకి మరో టర్మ్ ఇచ్చేందుకు బోర్డు పెద్దల నిరాకరణ!
- ఐసీసీ చైర్మన్ రేసులోనూ లేనట్టే!
న్యూఢిల్లీ: బీసీసీఐలో సౌరవ్ గంగూలీ పాత్ర మరో వారంలో ముగియనుంది. బోర్డు తదుపరి ప్రెసిడెంట్‌గా.. 1983 వరల్డ్‌కప్ హీరో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. వారం రోజులుగా జరిగిన సుదీర్ఘమైన చర్చల తర్వాత బిన్నీ ఎంపికకు సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ రెండోసారి కొనసాగుతానని సంకేతాలిచ్చినా.. అతని పని తీరుపై బీసీసీఐ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రెండోసారి పదవి చేపట్టే చాన్స్‌ను దాదా కోల్పోయాడని బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే గంగూలీని కూల్ చేసేందుకు ఐపీఎల్ చైర్మన్ పోస్ట్‌ను ఆఫర్ చేస్తే దానిని అతను తిరస్కరించాడు. ప్రెసిడెంట్‌గా పని చేసిన తాను బోర్డులోని ఓ సబ్ కమిటీకి హెడ్‌గా ఉండటం కరెక్ట్ కాదని గంగూలీ భావిస్తున్నాడు. ఇక ఐసీసీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న సౌరవ్‌కు అక్కడ కూడా మొండి చెయ్యే ఎదురుకానుంది. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ బాడీకి పోటీ చేసే అభ్యర్థిని బోర్డు నిర్ణయించలేదు. అయితే, ఐసీసీ బోర్డు మీటింగ్ కు కూడా గంగూలీ బదులుగా జై షాను పంపిస్తారని తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలను చూస్తే బీసీసీఐలో ‘దాదా గిరి’కి దాదాపుగా ముగింపు పలికే సమయం ఆసన్నమైనట్లుగా కనిపిస్తున్నది.
ప్రెసిడెంట్‌గా బిన్నీ, సెకట్రరీగా షానే
గంగూలీ ప్లేస్‌లో రోజర్ బిన్నీ కొత్త ప్రెసిడెంట్ కానున్నాడు. సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా కుమారుడు.. జై షా రెండోసారి సెక్రటరీగా కొనసాగనున్నాడు. వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా మరో టర్మ్ పని చేయనున్నాడు. ఈ పోస్టులకు బిన్నీ, షా, శుక్లా మంగళవారం నామినేషన్లు వేశారు. ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్థానంలో ప్రస్తుత ట్రెజరర్ అరుణ్ సింగ్ ధుమాల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
మహారాష్ట్ర బీజేపీ లీడర్ ఆశిష్ షీలర్‌ను కొత్త ట్రెజరర్‌గా నియమించొచ్చు. అస్సాం సీఎం హిమంత బిశ్వ సన్నిహితుడు దేవజిత్ సైకియా.. జయేశ్ జార్జ్ ప్లేస్‌లో కొత్త జాయింట్ సెక్రటరీగా రావొచ్చు. ఓవరాల్‌గా అన్ని పోస్టులు ఏకగ్రీవం చేయాలని బోర్డు పెద్దలు చూస్తున్నారు. ఈ నెల 18న ముంబైలో జరిగే ఏజీఎమ్ లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు.
