WCL 2025: ఒంటి చేత్తో పాక్‌ను ఓడించిన డివిలియర్స్.. WCL టైటిల్‌ విజేత సౌతాఫ్రికా

WCL 2025: ఒంటి చేత్తో పాక్‌ను ఓడించిన డివిలియర్స్.. WCL టైటిల్‌ విజేత సౌతాఫ్రికా

ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టైటిల్‌ను సౌతాఫ్రికా ఛాంపియన్స్ గెలుచుకుంది. శనివారం (ఆగస్టు 2) బర్మింగ్‌హామ్ వేదికగా  ఎడ్జ్‌బాస్టన్ లో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. మొదట బౌలింగ్ లో సఫారీ జట్టు విఫలమైనా.. బ్యాటింగ్ లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీకి తోడు జేపీ డుమినీ మెరుపులు మెరిపించడంతో 9 వికెట్ల తేడాతో గెలిచింది. డివిలియర్స్ 60 బంతుల్లోనే 7 సిక్సర్లు, 12 ఫోర్లతో 120 పరుగులు చేసి పాకిస్థాన్ కు నిరాశను మిగిల్చాడు. 

ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టు ప్రారంభంలోనే ఓపెనర్ కమ్రాన్ అక్మల్ (2) వికెట్ కోల్పోయింది. షార్జీల్ ఖాన్ 44 బంతుల్లో 76 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మిడిల్ ఆర్డర్ లో మొహమ్మద్ హఫీజ్ (17), షోయబ్ మాలిక్ (20) షార్జీల్ ఖాన్ కు సహకరించారు. చివర్లో ఉమర్ అమీన్ (36), ఆసిఫ్ అలీ (28) మెరుపులు మెరిపించి జట్టుకు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్డస్ విల్జోయెన్, పార్నెల్ తలో  రెండు వికెట్లు తీసుకున్నారు. డువాన్ ఆలివర్ ఒక వికెట్ పడగొట్టాడు. 

Also Read : దేశవాళీ సీజన్‌‌‌‌కు రెడీ అవుతోన్న షమీ

196 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు హషీమ్ ఆమ్లా, డివిలియర్స్ సూపర్ స్టార్ట్ ఇచ్చారు. తొలి వికెట్ కు 72 పరుగులు జోడించి మెరుపు ఆరంభాని ఇచ్చారు. పవర్ ప్లే తర్వాత ఆమ్లా 18 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ దశలో డివిలియర్స్, డుమినీ భారీ భాగస్వామ్యంతో పాక్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. పాక్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీలతో హోరెత్తించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు డివిలియర్స్ కే లభించాయి.