
శ్రీనివాస శాస్త్రి 1869 సెప్టెంబర్ 24న జన్మించాడు. అంటే దాదాపు మహాత్మా గాంధీ సమ వయస్కుడు. యూనివర్సిటీలో కోర్సు పూర్తైన తర్వాత విద్యారంగాన్ని ఎంచుకున్నాడు. ఆయన దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రసిద్ధ హైస్కూల్ హెడ్‌మాస్టర్ అయ్యాడు. అయితే.. శాస్త్రిలోని నిగూఢమైన శక్తిని గోపాలకృష్ణ గోఖలే ముందుగానే గుర్తించి, ఆయన దగ్గరకు పిలిపించుకున్నాడు.
లార్డ్ కర్జన్‌ని వ్యతిరేకించి గోఖలే అప్పటికే రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా గోఖలే రాజకీయాల్లో రాణిస్తున్నప్పుడే నయంకాని వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసింది. ‘క్రమేణా క్షీణిస్తున్న శక్తి సామర్థ్యాలతో ఏదైనా చేస్తే ఇప్పుడే చేయాలని లేదంటే ఎప్పటికీ చేయలేన’ని ఆయనకు అర్థమైంది. అందుకే తన నైతిక, ఆధ్యాత్మిక శక్తినంతా ధారపోసి ‘ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా’ సొసైటీని స్థాపించాడు. ఆ సొసైటీ భవిష్యత్తులో ఆయన ఆశయాలను కొనసాగించాలనేది గోఖలే కోరిక. ఆ సొసైటీలో చేరేవాళ్లు ప్రొబేషన్ పూర్తయ్యాక జీవితకాలమంతా సేవ చేస్తామని ప్రమాణం చేయాలి. అయితే.. గోఖలే ఈ సొసైటీని తన తర్వాత నడిపించే వారసుడిని ఎంపిక చేయకముందే చనిపోయాడు. శ్రీనివాస శాస్త్రి గోఖలే లాగే ఆలోచించేవాడు. అందుకే గాంధీ హాజరైన ఒక సమావేశంలో శాస్త్రిని ఏకగ్రీవంగా సొసైటీ అధ్యక్షుడిని చేయాలని తీర్మానించారు.
అవి ప్రపంచ యుద్ధ పరిస్థితులు. అప్పటికే రిటైరైన శాస్త్రి ప్రశాంత జీవితం గడపొచ్చు. కానీ.. ఢిల్లీకి వెళ్లి, తన నాయకుడు తనకు విడిచిపెట్టిన కర్తవ్యాన్ని నెరవేర్చే ప్రయత్నాలు చేశాడు. శాస్త్రి తన ఉపన్యాసాల్లో రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ‘‘అధికారులు ఏ చర్య తీసుకోవాలని భావిస్తున్నారో ఆ చర్య తీసుకుంటే తర్వాత వారే పశ్చాత్తాపపడవలసి వస్తుంది” అని నొక్కి చెప్పాడు. శాస్త్రి ప్రభుత్వాన్ని ఖండించిన తీరు, నిజాయితీ ఢిల్లీలోని వైశ్రాయ్‌కి నచ్చింది. అందుకే ఆ తర్వాత లండన్‌లో జరిగిన ఇంపీరియల్ కాన్ఫరెన్స్‌లో భారతదేశం తరఫున ఒక ప్రతినిధిగా శాస్త్రినే ఎంచుకున్నాడు.
శాస్త్రి 1921లో లండన్‌కి వెళ్లినప్పుడు విదేశాల్లో ఉన్న భారతీయుల సమస్యల గురించి ఆయనకు తెలిసింది. శాస్త్రికి అదే ఇంపీరియల్ కాన్ఫరెన్స్‌లో అప్పటి దక్షిణాఫ్రికా ప్రధాని జనరల్ స్మట్స్‌తో తీవ్ర విరోధం ఏర్పడింది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఆ దేశ పౌరులతో సమానంగా పౌరసత్వాన్ని ఇవ్వాలని శాస్త్రి గట్టిగా వాదించాడు.
ఆర్థిక కారణాల వల్ల అలా ఇవ్వడం కుదరదని జనరల్ స్మట్స్ వ్యతిరేకించాడు. ఆ సమావేశానికి హాజరైన వారందరికీ దాని వెనుక ఉన్నది ‘వర్ణ వ్యత్యాసం’ అని తెలుసు. భారతీయులకు సమాన పౌరసత్వం కోసం శాస్త్రి ఎంతగానో పోరాటం చేశాడు. దానికోసం ఆయన ప్రపంచంలోని అన్ని దేశాలు పర్యటించాడు. ఆయనను దక్షిణాఫ్రికా ఆ దేశంలోకి రావడానికి అప్పుడు అనుమతించలేదు. అమెరికాలో జరిగిన వాషింగ్టన్ కాన్ఫరెన్స్‌లో కూడా పాల్గొన్నాడు. 1923లో జరిగిన కెన్యా కన్వర్జేషన్స్‌లో శాస్త్రి మొదటి భారత దూతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయనకు తీవ్రమైన జబ్బు చేసింది. అయినా డాక్టర్ల మాట లెక్కచేయకుండా క్వీన్స్ హాల్‌లో జరిగిన బహిరంగ సభకు వెళ్లాడు.
ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఏడాది తర్వాత కోలుకున్నాడు. ఆ తర్వాత బ్రిటిష్ కామన్‌వెల్త్‌కి ఆయన అందించిన సేవల వల్ల ‘ప్రీవీ కౌన్సిలర్’ కావడమే గాక ‘రైట్ ఆనరబుల్’ అని పిలవడానికి అర్హుడయ్యాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా వెళ్లాడు. అక్కడ ‘కేప్ టౌన్ కాన్ఫరెన్స్’ అనంతరం ఏకగ్రీవ ఆమోదంతో శాస్త్రిని సౌత్ ఆఫ్రికాకు మొదటి ‘ఏజెంట్ జనరల్’గా నామినేట్ చేశారు. అప్పుడే మళ్లీ అనారోగ్యం వల్ల ఇండియాకు తిరిగి వచ్చేశాడు. కానీ.. అంతలోపే అక్కడ చేయగలినదంతా చేశాడు.
- మేకల మదన్మోహన్ రావు, కవి, రచయిత-