కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు భారత్‌కు వచ్చాయి. నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళ తీరాన్ని తాకాయి. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా అనుకున్న సమయానికే రుతుపవనాలు చేరుకున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నైరుతి రుతుపవనాలు జూన్‌ 5న కేరళ తీరాన్ని తాకవచ్చని మొదటగా ప్రకటించిన ఐఎండీ.. వాతావరణ మార్పులతో జూన్‌ 1నే చేరుకుంటాయని స్పష్టం చేసింది. అంచనాకు తగినట్లుగానే రుతుపవనాల ఆగమనం ప్రారంభం కావడంతో రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. రుతుపవనాల ప్రభావంతో లక్షదీప్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో  రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలోని 9 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం, కన్నూర్‌ జిల్లాలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు తెలిపారు.