నైరుతి రుతుప‌వ‌నాలు నాలుగు రోజులు ఆలస్యం

నైరుతి రుతుప‌వ‌నాలు నాలుగు రోజులు ఆలస్యం

ఈ ఏడాది దేశాన్ని తొల‌క‌రి ఆల‌స్యంగా ప‌ల‌క‌రించ‌బోతోంది. నైరుతి రుతుప‌వ‌నాలు సాధార‌ణం క‌న్నా లేటుగా కేర‌ళ తీరానికి వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. సాధార‌ణంగా జూన్ 1న ప్రారంభం కావాల్సిన రుతుప‌వ‌నాలు నాలుగు రోజులు లేట్ అవుతాయ‌ని అంచానా వేసింది భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ). జూన్ 5న కేర‌ళ తీరాన్ని తాకే అవ‌కాశం ఉంద‌ని శుక్ర‌వారం ఐఎండీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అయితే అండ‌మాన్ నికోబార్ దీవుల‌ను మాత్రం గ‌తంలో అంచ‌నా వేసిన దానిక‌న్నా ఆరు రోజుల ముందే రుతుప‌వ‌నాలు చేరుతాయ‌ని తెలిపింది.

సాధార‌ణంగా అయితే నైరుతి రుతుప‌వ‌నాలు మే 20 నాటికి అండ‌మాన్ తీరానికి చేరాలి. అయితే గ‌త నెల‌లో భార‌త వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించిన అంచ‌నాల్లో మే 22 నాటికి నైరుతి రుతుప‌వ‌నాలు అండ‌మాన్ నికోబార్ తాకుతాయ‌ని ప్ర‌క‌టించింది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో నెల‌కొన్ని తుఫాను ప‌రిస్థితుల కార‌ణంగా ఆరు రోజుల ముందుగానే మే 16న రుతుప‌వ‌నాలు అండ‌మాన్ ను తాకుతాయ‌ని ఐఎండీ శుక్ర‌వారం బులిటెన్ లో వెల్ల‌డించింది.