మెడికోలు ఆదర్శంగా ఉండాలి : ఎస్పీ డి.జానకి

మెడికోలు ఆదర్శంగా ఉండాలి : ఎస్పీ డి.జానకి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: వైద్య విద్యార్థులు రేపటి సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్ నగర్  ప్రభుత్వ మెడికల్  కాలేజీలో కొత్తగా చేరిన ఎంబీబీఎస్  స్టూడెంట్స్, పేరెంట్స్, సీనియర్లకు యాంటీ ర్యాగింగ్, మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, అలవాట్లపై దృష్టి పెట్టాలని సూచించారు. 

మాదకద్రవ్యాల వాడకం ప్రమాదకరమని, ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని అంధకారంలోకి నెడుతుందన్నారు. ర్యాగింగ్,  డ్రగ్స్  వంటి నేరాలకు దూరంగా ఉండి, లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని సూచించారు. ర్యాగింగ్  చేయడం ఒక నేరమని, ఇలాంటి చర్యలు భవిష్యత్తు మీద చెడు ప్రభావం చూపుతాయని చెప్పారు. స్నేహపూర్వకంగా మెలగాలని, జూనియర్లను ప్రోత్సహించాలన్నారు. 

మితిమీరి ప్రవర్తిస్తే డయల్​100కు, కాలేజీ యాంటీ ర్యాగింగ్  కమిటీకి,  పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయాలన్నారు. స్టూడెంట్స్  భద్రత కోసం పోలీస్, షీ టీం అందుబాటులో ఉంటాయని తెలిపారు. హాస్పిటల్​ సూపరింటెండెంట్  రమణ, అకడమిక్  వైస్  ప్రిన్సిపాల్  కిరణ్మయి, రూరల్  సీఐ గాంధీ నాయక్, ఉమెన్  పోలీస్ స్టేషన్  ఇన్స్​పెక్టర్  శ్రీనివాస్, ఐటీ సెల్  ఇన్‌‌చార్జ్​ రాఘవేందర్  పాల్గొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం..

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే తమ డ్యూటీ అని ఎస్పీ డి.జానకి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్​ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.