- ఎస్పీ జానకీ
బాలానగర్, వెలుగు : అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ఎస్పీ జానకి తెలిపారు. మంగళవారం బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తా వద్ద డ్రైవర్లు, ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు కచ్చితంగా హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి ప్రాథమిక భద్రతా పరికరాలను వాడడం వల్ల కుటుంబాలను కాపాడుతుందన్నారు. ఒక చిన్న తప్పిదం కుటుంబాన్ని చీకటిలోకి నెడుతుందని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నేరం మాత్రమే కాకుండా ప్రాణాంతకమన్నారు.
నేషనల్ హైవేలు ప్రమాదాలకు హాట్‌స్పాట్లుగా మారాయని, డ్రైవర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యువత వేగాన్ని కాకుండా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను అందజేశారు.
కార్యక్రమంలో ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కిషన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, బాలానగర్ ఎస్ఐ లెనిన్, రాజాపూర్ ఎస్ఐ శివానంద్ గౌడ్, ప్రైవేట్ కంపెనీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
