ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • భైంసాలో 500 మంది పోలీసులతో భద్రత
  • జిల్లా ఎస్పీ ప్రవీణ్​కుమార్


నిర్మల్,వెలుగు: జిల్లాలో వినాయక నిమజ్జనం కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ప్రవీణ్​కుమార్​ చెప్పారు. మంగళవారం ఆయన ‘వీ6– వెలుగు’తో మాట్లాడారు. గురువారం భైంసాలో, శుక్రవారం నిర్మల్​లో వినాయక నిమ్జజనం ఉంటుందన్నారు. భైంసాలో 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్​ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. ఇప్పటికే  పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. డీజేలకు అనుమతి లేదన్నారు. రూల్స్​బ్రేక్​చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్మల్​లో జరిగే నిమజ్జనోత్సవానికీ భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గణేశ్​మంటపాల నిర్వాహకులు ఒకరికొకరు సహకరించుకొని శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించుకోవాలన్నారు.

భూములు లాక్కోని అక్రమ నిర్మాణాలు చేస్తున్రు

మందమర్రి,వెలుగు: మందమర్రి ఏజెన్సీ ఏరియాలో అక్రమంగా వెలిసిన వెంచర్లు, నిర్మాణాలను ఐటీడీఏ పీవో వరణ్​రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఆయన దృష్టికి వెంచర్లు, నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. కొందరు రియల్టర్లు స్థానిక ఆదివాసీ నాయకఫోడ్​లు, గిరిజనుల నుంచి మోసపూరితంగా భూములు లాక్కోని రియల్ ఎస్టేట్​ వ్యాపారం చేస్తున్నారని, పర్మిషన్లు లేకుండా ఏజెన్సీ భూముల్లో నిర్మాణాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆదివాసీ నాయక్ పోడ్​సేవా సంఘం లీడర్లు పీవోను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో  ఆదివాసీ నాయకఫోడ్​ సంఘం జిల్లా అధ్యక్షుడు లవుడం రాజ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంజి రాజన్న, ట్రెజరర్​మేసినేని అరుణ్ కుమార్, ప్రచార కార్యదర్శి పాలమకుల భీమ్ సేన్ తదితరులు పాల్గొన్నారు. 

అసెంబ్లీలో సింగరేణి సమస్యలపై చర్చించాలి

నస్పూర్, వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యలు, కార్మికులకు సీఎం ఇచ్చిన హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని సీఐటీయూ లీడర్లు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీరాంపూర్ ఓసీపీలో జరిగిన గేట్ మీటింగ్ లో పలువురు మాట్లాడారు. యాజమాన్యం ఇప్పటి వరకు లాభాలు ప్రకటించకపోవడం సరైందికాదన్నారు. సీరియర్​కార్మికులతో సేఫ్టీ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. కోల్ బెల్ట్ ఏరియాలోని ఎమ్మెల్యేలు యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయించాలన్నారు. కార్యక్రమంలో  సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, శ్రీరాంపూర్ డివిజన్ కార్యదర్శి గోదారి భాగ్యరాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, డివిజన్ లీడర్లు వెంగళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గందరగోళంగా సింగరేణి క్వార్టర్ల కౌన్సెలింగ్​
నిబంధనలు పాటించలేదని కార్మికుల ఆగ్రహం

నస్పూర్​,వెలుగు: శ్రీరాంపూర్​ఏరియాలో చేంజ్​ఆఫ్​ క్వార్టర్ల కౌన్సెలింగ్​లో నిబంధనలు, సీనియార్టీని సింగరేణి యాజమాన్యం పట్టించుకోలేదని పలువురు కార్మికులు ఆరోపించారు. మంగళవారం ప్రగతి స్టేడియంలోని సీఈఆర్​ క్లబ్​లో క్వార్టర్ల కేటాయింపు కోసం కౌన్సెలింగ్​నిర్వహించారు. సుమారు 170 క్వార్టర్లను చేంజ్ చేసుకోవడం కోసం 600 మంది కార్మికులు దరఖాస్తులు చేసుకున్నారు. కౌన్సెలింగ్​ సరిగా లేదని పలువురు కార్మికులు అసంతృప్తి వ్యక్తంచేశారు. సీనియర్టీకి ప్రయారిటీ ఇవ్వలేదని, డిజిగ్నేషన్​ ప్రకారం చేంజ్ ఆఫ్​ క్వార్టర్లను కేటాయించకుండా ఆఫీసర్లు ఇష్ట్యారాజ్యంగా వ్యవహరించారని కార్మికులు ఆరోపించారు. అనుకున్న క్వార్టర్లు తమకు దక్కలేదని మండిపడ్డారు. 

పేద విద్యార్థులకు అండగా వెరబెల్లి ట్రస్ట్
దండేపల్లి, వెలుగు: పేద విద్యార్థులకు అండగా వెరబెల్లి ట్రస్ట్ నిలుస్తుందని ఫౌండర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు అన్నారు. దండేపల్లి మండలం గుడిరేవు, తాళ్లపేట హైస్కూళ్లలోని టెన్త్​ క్లాస్​ స్టూడెంట్లకు మంగళవారం ట్రస్ట్ ద్వారా స్కూల్ కిట్స్ అందించారు. విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే తమ ఫౌండేషన్ లక్ష్యమన్నారు. చిగురు కార్యక్రమం ద్వారా వారి ప్రతిభను గుర్తించి  ప్రోత్సహిస్తామని తెలిపారు. 10 జీపీఏ సాధిస్తే ఇంటర్మీడియెట్ ఫ్రీగా చదివిస్తానని హామీనిచ్చారు. బీజేపీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, నాయకులు గుండం రాజలింగం, గాదె శ్రీనివాస్, కర్నాల కిషన్, బందెల రవిగౌడ్, చీపిరిశెట్టి శ్రీనివాస్, ఎర్రం విజేందర్, ఎర్రం నరేష్, దొమ్మటి వెంకటేశ్​ పాల్గొన్నారు.

జామ్ పెద్దూర్ పీఎస్​ తనిఖీ

నిర్మల్,వెలుగు: సారంగాపూర్  మండలంలోని జామ్ పెద్దూర్ ప్రైమరీ స్కూల్​ను మంగళవారం ఆఫీసర్లు తనిఖీ చేశారు. పాఠశాలలో  మౌలిక  వసతులపై  ఆరాతీశారు. తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ పరిశీలించారు. పాఠశాల నిర్వహణ, మౌలిక సౌకర్యాలు, పరిశుభ్రతపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో  శ్రీనివాస్, ఎంపీవో సురేశ్​బాబు, ఏపీవో రామకృష్ణ, సర్పంచ్ విలాస్, పంచాయతీ సెక్రటరీ అశోక్, హెచ్​ఎం గంగామణి, టీచర్​రత్న, అంగన్​వాడీ వర్కర్​జ్యోతి, స్వరూప, సరోజ తదితరులు పాల్గొన్నారు.

గణేశ్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన

దండేపల్లి ,వెలుగు: గూడెం గోదావరి నది వద్ద గణేశ్​ నిమజ్జనం ఏర్పాట్లను డీసీపీ అఖిల్​ మహాజన్​, అధికారులు మంగళవారం పరిశీలించారు. గోదావరి వద్ద మూడు భారీ క్రేన్లు ఏర్పాటు చేయాలని, ట్రాక్టర్లు బురదలో దిగబడకుండా మొరం పోసి ల్యాండ్ లెవలింగ్ చేయాలని డీసీపీ సూచించారు. 50 మంది గజ ఈతగాళ్లను గోదావరిలో రెడీగా ఉంచాలన్నారు. గూడెం చెక్​పోస్ట్ నుంచి నదీ తీరం వరకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ కరీముల్లాఖాన్, ఎస్ఐ సాంబమూర్తి, తహసీల్దార్ హనుమంతరావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేశం, అధికారులు పాల్గొన్నారు. 

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్​డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక రెవెన్యూ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి 
తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12 నుంచి 20  తేదీ వరకు ఆదిలాబాద్ నుండి జోడే ఘాట్​వరకు మహాపాద యాత్ర  నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ లీడర్లు వెట్టి మనోజ్, మర్సకోల అశోక్, సునీల్, ప్రకాశ్, రోహీదాస్ తదితరులు పాల్గొన్నారు.

సర్కార్​ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు చనిపోతున్రు

ఆసిఫాబాద్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వెల్ఫేర్ హాస్టళ్లలో స్టూడెంట్లు చనిపోతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.  మంగళవారం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎలగతి సుచిత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. క్వాలిటీ ఫుడ్​అందించడంతో ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరసనలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు 
కృష్ణ కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్నాక విజయ్ కుమార్, కోర్ కమిటీ మెంబర్ అజ్మీరా ఆత్మారాం నాయక్, జిల్లా ఉపాధ్యక్షురాలు  రాధిక, ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కుమురం వందన, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మేడి కార్తీక్, కార్యదర్శి సంజీవ్, ఉపాధ్యక్షుడు మందాడే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు..

మత్స్యకారులను ఆదుకోవాలి

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని మత్స్య కార్మిక కుటుంబాలకు చేయూతనందించి ఉపాధి కల్పించాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తమ రూపాలను కలిశారు. జిల్లాలో మత్స్య కార్మికుల పరిస్థితులు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తదితరులు ఉన్నారు.

కన్నాలలో ఆక్రమణల కూల్చివేత

బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న షెడ్లను మంగళవారం బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి ఫణిందర్ రావు కూల్చివేయించారు. షెడ్ల నిర్మాణాలపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. లక్ష్మీపూర్ గ్రామంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని పరిశీలించి జారీ చేసిన ఇంటి నంబర్ పై ఆరాతీశారు.  ఆయన వెంట సర్పంచ్​జిల్లపల్లి స్వరూప, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, సెక్రటరీ దుర్గం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

దేశభక్తిని పెంపొందించుకోవాలి

భైంసా,వెలుగు: ప్రతీ ఒక్కరు దేశభక్తిని పెంపొందించుకోవాలని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు విలాస్ గాదేవార్​ సూచించారు. మంగళవారం నర్సింహ కల్యాణ మంటపంలో విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఉన్నత చదువులు పూర్తి చేసి ప్రయోజకులు కావాలన్నారు. అంతకు ముందు బాసర వేద పాఠశాల పీఠాధిపతి విద్యాభారతీ స్వామి దేశభక్తి గురించి వివరించారు. గురువారం భైంసాలో జరిగే గణేశ్​నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ ప్రవీణ్​ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రామకృష్ణాగౌడ్, సభ్యులు దామోదర్ రెడ్డి, మహిపాల్, నగేశ్, రాజేశ్వర్, వెంకటేశ్, మంతెన వెంకటేశ్, గంగుల చిన్నన్న తదితరులు పాల్గొన్నారు.

యోగాతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

ఆసిఫాబాద్,వెలుగు: యోగాతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ చెప్పారు. రెబ్బెన మండలం గోలేటి సీఈఆర్ క్లబ్ లో  జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బాలికల యోగా చాంపియన్​షిప్​పోటీల సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. అనంతరం మలేషియాలో జరిగే ఇంటర్ నేషనల్ యోగా పోటీలకు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులను ఆయన సన్మానించారు.  కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం దేవేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణ కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గౌడ్, కోర్ కమిటీ మెంబర్ అజ్మీరా ఆత్మారాం నాయక్, ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి, అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, సిర్పూర్ బీజేపీ లీడర్​హరీశ్​ బాబు తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్​ను తీర్చిదిద్దేది టీచర్లే

రామకృష్ణాపూర్,వెలుగు: విద్యార్థుల భవిష్యత్​ను తీర్చిదిద్దడంలో టీచర్లే కీలక పాత్ర పోషిస్తారని డీఈవో వెంకటేశ్వర్లు చెప్పారు. మంగళవారం రామకృష్ణాపూర్​లోని తవక్కల్​ హైస్కూల్​లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. తవక్కల్​విద్యా సంస్థల అధినేత, ట్రస్మా జిల్లా ప్రెసిడెంట్ ఎండీ అబ్దుల్​అజీజ్​ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

టీచర్లు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. తవక్కల్ యాజమాన్యం ఉపాధ్యాయులను సన్మానించి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మందమర్రి ఎంఈవో జాడి పోచయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ రేణికుంట్ల ప్రవీణ్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్​ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్​రెడ్డి, కౌన్సిలర్​ఎర్రబెల్లి ప్రేమలత, ట్రస్మా ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ రాజీ రెడ్డి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా సెక్రటరీ చంద్రశేఖర్, ట్రెజరర్​ శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.