
కొత్తకోట, వెలుగు: విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలోనే ప్రారంభమవుతుందని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదవి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. బుధవారం కొత్తకోట మండలం పామాపురం జడ్పీ హైస్కూల్లో సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, పొక్సో చట్టంపై అవగాహన కల్పించారు. సమాజంలో చిన్నారులపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో ప్రతి టీచర్ కీలక పాత్ర పోషించాలన్నారు. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలన్నారు.
పిల్లలకు థర్డ్ పేరంట్ గా వ్యవహరించాలని, వారిపై ఎల్లప్పుడూ దృష్టి పెట్టి తప్పుడు మార్గంలో వెళ్లకుండా కాపాడాలన్నారు. జిల్లాలోని అన్ని కాలేజీలు, స్కూళ్లలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలపై ప్రతి ఒక్కరూ గళం విప్పాలని, ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాలపై అప్రమత్తం చేయాలని సూచించారు. కొత్తకోట సీఐ రాంబాబు, ఎస్సై ఆనంద్, పెబ్బేరు, శ్రీరంగాపురం ఎస్సైలు యుగంధర్ రెడ్డి, హిమబిందు, డాక్టర్లు ఆసియాబేగం, శ్రీనివాసులు, హెచ్ఎం రవి పాల్గొన్నారు.