
నకిరేకల్, వెలుగు : నేర నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలో డీఎస్పీ ఆధ్వర్యంలో 5 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 50 మంది టీజీఎస్పీ సిబ్బందితో కలిపి మొత్తం 300 మంది పోలీసులు 350 ఇండ్లలో సోదాలు నిర్వహించారు. సరియైన పత్రాలు లేని మొత్తం 130 వాహనాలు పట్టుకున్నారు.
వీటిలో 120 ద్వి చక్ర వాహనాలు,10 త్రీ చక్ర వాహనాలు, 8 మంది అనుమానితులు, ఒక నిందితుడిని అదుపులో తీసుకున్నారు. ఒక షెడ్ లో అక్రమంగా ఉంచిన 15 ఆవు దూడలు పట్టుకొని గోశాలకు తరలించారు. గంజాయి తాగతున్నట్లు అనుమానం ఉన్న 18 మందిని అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
కాలనీల్లో ఎవరైనా అనుమానితంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కొత్తగా ఇండ్లలో కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అద్దెకు ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు రాఘవరావు, ఆదిరెడ్డి, కొండల్ రెడ్డి, కరుణాకర్, మహాలక్ష్మయ్య, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.