గద్వాల, వెలుగు: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జోగులాంబ గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. గురువారం ఎస్పీ ఆఫీసులో జిల్లా స్థాయి క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు.
దీంతో బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. పోలీస్ ఆఫీసర్లు బాధ్యతయుతంగా పని చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, మట్కా, జూదం, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్స్ గుర్తించాలన్నారు. అడిషనల్ ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగులయ్య, సీఐలు శీను, రవిబాబు, టాటా బాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
హైబీపీతో పడిపోయిన గద్వాల సీఐ..
జిల్లా క్రైమ్ మీటింగ్ జరుగుతుండగా గద్వాల సీఐ టంగుటూరి శీను హై బీపీతో కింద పడిపోవడం కలకలం రేపింది. వెంటనే ఆయనను గద్వాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందించారు. బీపీ ఒక్కసారిగా 250కి పెరగడంతో స్పృహ కోల్పోయి కింద పడిపోయారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. పని ఒత్తిడితోనే బీపీ పెరిగినట్లు భావిస్తున్నారు.
