
గద్వాల, వెలుగు: నకిలీ సీడ్స్ అమ్మినా, సప్లై చేసినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం ఎస్పీ ఆఫీస్లో జిల్లా పోలీస్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రైతులు నకిలీ సీడ్స్ తో మోసపోకుండా చూడాలన్నారు. పోలీస్ వ్యవస్థ పై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా డ్యూటీ చేయాలన్నారు. నకిలీ సీడ్స్ సరఫరా కాకుండా స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్లను ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహించాలన్నారు. వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు.
రాత్రి పూట గస్తీ పెంచాలని, అవసరమైన పట్టణాల్లో సైక్లింగ్ చేస్తూ గస్తీ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. బెట్టింగ్ లు ఆడినా, ఆడించినా కఠినంగా వ్యవహరించాలన్నారు. డీఎస్పీ మొగులయ్య, సీఐలు శీను, రవిబాబు, టాటా బాబు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.