అంతరిక్షం నుంచి చిన్న ముక్క ఢీకొంటే ఏం జరుగుతుందో తెలుసా..?

అంతరిక్షం నుంచి చిన్న ముక్క ఢీకొంటే ఏం జరుగుతుందో తెలుసా..?

చిన్న ముక్కలు.. పెద్ద ముప్పు

దశ దిశ లేకుండా తిరుగుతున్న రాకెట్లు, ఉపగ్రహాల ముక్కలు

17 కోట్ల ముక్కలు స్పేస్​లో చక్కర్లు..  బరువు 8,400 టన్నులు

10 సెంటీమీటర్ల ముక్క ఢీకొడితే 7 కిలోల టీఎన్​టీ పేలుడుతో సమానం

నానాటికీ పెరుగుతున్న ప్రయోగాలతో అంతరిక్షంలో పెరుగుతున్న ట్రాఫిక్​

ప్రస్తుతం స్పేస్​లో దేశాల రేస్​ జోరు మీదుంది. శూన్యంలో ‘ట్రాఫిక్​’ ఎక్కువైపోయింది. ఏ దేశానికి ఆ దేశం ప్రయోగిస్తున్న చిన్నా, పెద్ద ఉపగ్రహాలు, రాకెట్ల ముక్కలు పెద్ద ముప్పును మూటగట్టి భూమిపై వేసేందుకు శరవేగంగా దూసుకెళుతున్నాయి. ఒక దానినొకటి ఢీకొట్టి పెద్ద ప్రభావాన్ని సృష్టించేందుకు కత్తులు దూస్తున్నాయి. ఒక్క పది సెంటీమీటర్లుండే ఓ చిన్న ముక్క ఢీకొడితే, దాని వల్ల ఏర్పడే తీవ్రత ఎంతుంటుందో తెలుసా..? అక్షరాల ఏడు కిలోల టీఎన్​టీ బాంబు పేలితే వచ్చేంత శక్తితో సమానంగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు 17 కోట్ల ముక్కలు అంతరిక్షంలో దశ, దిశ లేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాయి. వాటి బరువు అక్షరాల 8,400 టన్నులు. ఇప్పుడు ఇదే.. స్పేస్​ సైంటిస్టులను కలవరపెడుతోంది.

ఫిబ్రవరి 2009.. భూమికి 800 కిలోమీటర్ల ఎత్తులో రెండు శాటిలైట్లు ఢీకొట్టుకున్నాయి. పని చేయకుండా ఉన్న రష్యా మిలటరీ శాటిలైట్​, అమెరికా కమ్యూనికేషన్​ శాటిలైట్లు దాదాపు గంటకు 42 వేల కిలోమీటర్ల వేగంతో ఎదురెదురుగా ఢీకొట్టేసుకున్నాయి. అంత వేగంతో ఢీకొట్టినప్పుడు దాని ప్రభావం మాత్రం ఊరికే ఉంటుందా? ఆకాశంలో దట్టమైన మేఘాలను పరిచేశాయి. 2 వేల పెద్ద పెద్ద ముక్కలు, వేలాది చిన్నముక్కలు స్పేస్​లో ఏర్పడ్డాయి. దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడింది. కొన్ని దేశాల్లో ఆ యాక్సిడెంట్​ తాలూకు తీవ్రత జనాల చెవికి చేరింది. ఇంకా ఎంత పెద్ద ముప్పు పొంచి ఉందోనని సైంటిస్టులు తలలు పట్టుకుని కూర్చున్నారు. ఆ తర్వాత మూడేళ్లకు రష్యా శాటిలైట్​కు చెందిన ఓ చిన్న ముక్క అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్​ఎస్​)కు జస్ట్​ 130 గజాల దూరం నుంచి దూసుకెళ్లింది. దాని నుంచి రక్షించుకునేందుకు అందులోనే ఆరుగురు ఆస్ట్రోనాట్లు రెండు సోయజ్​ డాక్​లలో తలదాచుకున్నారు. ఇలాంటి యాక్సిడెంట్లు మున్ముందు మరిన్ని జరిగే ప్రమాదముందంటూ సైంటిస్టులు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు.

మొన్నటికి మొన్న తప్పిన పెను ప్రమాదం

అంతెందుకు సెప్టెంబర్​ 2న ఓ పెద్ద ప్రమాదమే తప్పిపోయింది. యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ (ఈఎస్​ఏ)కి చెందిన ఏవ్​లస్​ ఉపగ్రహం, ఎలాన్​మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్​ స్టార్​ లింక్​లోని ఒక శాటిలైట్​ ఢీకొట్టుకునే ప్రమాదం తప్పింది. స్పేస్​లో ఉపగ్రహాలపై కన్నేసి ఉంచే అమెరికా ఎయిర్​ఫోర్స్​ కొద్ది రోజుల ముందే దీనిపై వార్నింగ్​ ఇవ్వడంతో ఈఎస్​ఏ అప్రమత్తమైంది. స్పేస్​ఎక్స్​కు సమాచారమిచ్చినా దాని నుంచి స్పందనే రాలేదు. దీంతో ఈఎస్​ఏ ఇంజనీర్లు తమ ఉపగ్రహం ఇంజన్లను మండించి దాని ప్రయాణ దిశను మార్చారు. లేదంటే అప్పటికే దాదాపు 30 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్న ఆ ఉపగ్రహం ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అయితే, ఓ బగ్​ వల్ల ఈఎస్​ఏ పంపిన మెసేజ్​ తమకు చేరలేదని స్పేస్​ఎక్స్​ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. అయితే, పరస్పర సహకారం లేకుంటే స్పేస్​లో పెద్ద ముప్పును ఎవరూ తప్పించలేరని ఈఎస్​ఏ స్పేస్​ సేఫ్టీ హెడ్​ హోల్గర్​ క్రాగ్​ చెప్పారు.

భూమిపై పడే ప్రమాదం

వాటి వల్ల స్పేస్​లోనే కాదు, భూమిపైన ఉన్న జనానికీ ప్రమాదమే. అవును, గతి తప్పి భూ వాతావరణంలోకి దూసుకొచ్చే చిన్న చిన్న స్పేస్​ ముక్కలు దాదాపు 83 శాతం కనుమరుగైనా మిగతా 17 శాతం ముక్కలు జనంపై విరుచుకుపడే ప్రమాదముందని స్పేస్​ సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే ఇలాంటి ఘటనల వల్ల ఆరుగురు జపాన్​ నావికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముప్పును తప్పించాలంటే స్పేస్​ గ్రేవ్​యార్డ్​గా పిలిచే జనం ఎవరూ ఉండని పసిఫిక్​ మహాసంద్రంలోని దక్షిణాన స్పేస్​క్రాఫ్ట్​ల గమనాన్ని మళ్లించాలంటున్నారు. అయితే, అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమంటున్నారు. అది కాకుండా స్పేస్​ జంక్​ కక్ష్యలో తిరుగుతున్నప్పుడే హార్పూన్లు, లేజర్లు, ‘పెద్ద పెద్ద వలల’తో ఆ శకలాలను తొలగించాలన్న మరో సలహా ఇస్తున్నారు. ఇక, ఇలాంటి ప్రయోగాలపై, ప్రమాదాలపై వివిధ స్పేస్​ కంపెనీల మధ్య సమాచార మార్పిడి జరగాలంటే విమానయానంలో ఉపయోగించినట్టే ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్​ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

పెరిగిన ప్రయోగాలు

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు స్పేస్​ ప్రయోగాలు బాగా పెరిగాయి. పదేళ్ల క్రితం 66 ప్రయోగాలు జరిగితే, ఒక్క 2018లోనే 111 ప్రయోగాలు జరిగాయి. ఒక్కో ప్రయోగంలో పదుల సంఖ్యలో పేలోడ్లు, ఉపగ్రహాలు ఆకాశంలోకి వెళుతున్నాయి. అంతెందుకు స్పేస్​ ఎక్స్​ చీఫ్​ ఎలాన్​ మస్క్​ 12 వేల ఉపగ్రహాలను స్పేస్​లోకి పంపించేందుకు రెడీ అవుతున్నారు. అమెజాన్​ 3 వేలు, వర్జిన్​కు చెందిన వన్​వెబ్​ 650 శాటిలైట్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఇన్ని ప్రయోగాలు జరుగుతున్నాయే కానీ, పైకి పంపించిన వాటిని మళ్లీ భూమ్మీదకు తీసుకురావడమంటే కుదరని పని. ఒకవేళ తీసుకొద్దామని అనుకున్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే చాలా దేశాలు పనికి రాకుండా పడి ఉన్న స్పేస్​ ముక్కలను అలాగే వదిలేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా టెలిస్కోపులు, రాడార్లతో క్రికెట్​బాల్​ సైజులో ఉండే 23 వేల చిన్న చిన్న స్పేస్​ ముక్కలపై కన్నేసి ఉంచుతోంది. చదవడానికి చిన్నవే అని అనిపించినా అవి ఒక్కోటి 30 వేల కిలోమీటర్ల వేగంతో వెళుతుంటాయి. అది ఢీకొడితే దాని ప్రభావం 7 కిలోల టీఎన్​టీ పేల్చినంత ఎఫెక్ట్​ ఉంటుంది. ఒక్కటి ఢీకొడితే ఆగకుండా చైన్​ ప్రమాదాలు జరిగిపోతాయి. చైన్​ రియాక్షన్​లా అన్నమాట. దాన్నే కెస్లర్​ సిండ్రోమ్​ అని పిలుస్తున్నారు సైంటిస్టులు. నాసా ఆస్ట్రోఫిజిసిస్ట్​ డొనాల్డ్​ కెస్లర్​ పేరునే దానికీ పెట్టారు.