మాయదారి డ్యాన్స్ రోగం..

మాయదారి డ్యాన్స్ రోగం..

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కమ్మేసిన మహమ్మారి కొవిడ్ 19.  కంటికి కనిపించని కరోనా వైరస్ ధాటికి దేశాలన్నీ అల్లలాడిపోతున్నాయిమనిషి నుంచి మనిషికి సోకే వైరస్ కావడంతో నలుగురు ప్రశాంతంగా ఒకచోట గుమిగూడని పరిస్థితిసరిగ్గా వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ అనే మహమ్మారి అచ్చం ఇలాంటి సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసిందికానీఐదువందల సంవత్సరాల క్రితం యూరప్లో ఒక జబ్బు అంతుచిక్కని రీతిలో వంద మందికిపైగా ప్రాణాలు తీసింది జబ్బేంటో? అదెలా సోకిందో? అది సోకిన జనాలు వింతగా ఎందుకు బిహేవ్ చేశారో?.. ఇప్పటికీ కారణాలు కనిపెట్టలేకపోయారు సైంటిస్టులు మిస్టరీ డిసీజ్ పేరేది డాన్సింగ్ ప్లేగు’.

సోయి లేకుండా డాన్స్​ చేస్తూ ప్రాణాలు పొగొట్టుకున్న మనుషుల గురించి ఎప్పుడైనా విన్నారా!. అదేం మాయ రోగం అనుకుంటున్నారా?.  దాని పేరు ‘ది డాన్సింగ్ ప్లేగు’.  ప్లేగు వ్యాధి విజృంభించిన టైంలో ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఆ అంతుచిక్కని వ్యాధికి ఈ పేరు పెట్టారు. 16వ శతాబ్దంలో ఆల్సేస్​లోని ‘స్ట్రాస్​బర్గ్’ ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. యాభై నుంచి 400 మంది రోడ్ల మీదకు చేరుకుని పిచ్చిగా గంతులేశారు. సుమారు రెండు నెలలపాటు అలా చేస్తూనే ఉన్నారు. అలసిపోయి కూలబడినా.. మళ్లీ తేరుకుని డాన్సుల్లో మునిగిపోయారు వాళ్లు.  వాళ్లను ఆపేందుకు ఎంతోమంది ట్రై చేశారు.  కానీ, ఎవరి వల్ల వీలుకాలేదు. చివరికి వాళ్లలో కొందరు బతికి బయటపడగా..  కొందరు మాత్రం ఈ వింత వ్యాధి బారినపడి ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయితే ఆ ఊరంతా ఎందుకు అలా బిహేవ్ చేసింది అనేందుకు కారణం మాత్రం ఇప్పటికీ దొరకలేదు.  హిస్టరీలో మాత్రం అదొక వింత జబ్బుగా నిలిచిపోయింది.  అయితే ఈ జబ్బుని ‘డాన్సింగ్ మేనియా’గా పోష్​గా వ్యవహరిస్తుంటారు ఈ జనరేషన్​ సైంటిస్టులు.

ఆధారాలున్నయ్

డాన్స్​ చేస్తూ అంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం విచిత్రంగా అనిపించొచ్చు. ఈ స్ట్రేంజ్ బిహేవియర్ ఇన్సిడెంట్ నిజంగా జరిగిందా?,  జరిగితే ఎవిడెన్స్​ ఉన్నాయా? అంటే.. ‘అవుననే’ చెప్పాలి. 1518, జులై  నెలలోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందని ఆధారాలు దొరికాయి.  డాన్స్​తో వింతగా ప్రవర్తించినవాళ్ల కోసం ఫిజీషియన్స్ ఇచ్చిన చీటీలు, లోకల్​గా నమోదు అయిన హెల్త్​ రికార్డులు, స్ట్రాస్​బర్గ్​ సిటీ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్టులు ‘ది డాన్సింగ్ ప్లేగు’ జరిగిందని స్పష్టం చేశాయి.  ఒక ఆవిడ వల్ల మొదలైన ఈ వింత వ్యాధి.. పదుల సంఖ్యలో ఆడవాళ్లకు పాకిందని, ఆ తర్వాత మగా ఆడా తేడా లేకుండా చాలామంది గ్రూపులుగా చేరి ప్రాణాలు పోయేదాకా చిందులేశారని సిటీ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్టు ఉంది.  కొంతమంది కళ్లు తిరిగి పడిపోగా.. వాళ్లను హాస్పిటల్స్‌‌లో చేర్పించగా,  కోలుకున్నాక వాళ్లు మళ్లీ అక్కడికే వచ్చి డాన్సులు వేశారని, అలా చేస్తున్న టైంలోనే ప్రాణాలు పొగొట్టుకున్నారని ఆ రిపోర్టులో రాసి ఉంది.  డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్స్​, లోకల్‌‌గా పబ్లిష్​​ అయిన కొన్ని కథనాలు, మేజిస్ట్రేట్..  బిషప్​ల ఆధ్వర్యంలో వాళ్లకు ట్రీట్​మెంట్ రిపోర్ట్స్​ను కన్ఫర్మ్ చేస్తూ పేపర్ స్టేట్​మెంట్స్​ దొరికాయి. పీటర్ బ్రూగెల్ అనే ఆర్టిస్ట్ ఆ టైంలో వేసిన ఒక పెయింటింగ్​ ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్​కి సజీవ సాక్ష్యంగా ఉంది.  కానీ, అంతమంది అలా ఎందుకు బిహేవ్ చేస్తూ చనిపోయారనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు.  మరోవైపు డాన్సింగ్ ప్లేగు వల్ల  ఎంతమంది చనిపోయారో  లెక్కంటూ  లేకపోవడం విమర్శలకు కారణమైంది.

ఆ పుస్తకమే మెయిన్​!

ది డాన్సింగ్ ప్లేగు ఇన్సిడెంట్​పై కొన్ని కాంట్రవర్సీలు  నెలకొన్నాయి. ఈ ట్రాజెడీ ఎందుకు జరిగింది? ఎంతమంది చనిపోయారనే విషయంలో అధికారులు ఒక లెక్కంటూ రాయలేకపోయారు.  కొన్ని సోర్స్​ల​ ప్రకారం.. డాన్సింగ్ ప్లేగు వల్ల రోజుకి పది నుంచి పదిహేనుమంది చనిపోయారట.  అంతమంది జనాలు చనిపోతుంటే.. అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారా? అంటూ కొందరు మేధావులు, రోమన్​ సామ్రాజ్యం అధినేతలకు లేఖలు కూడా రాశారు. కానీ, ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే డాన్సింగ్ ప్లేగు ఇన్సిడెంట్​పై అమెరికన్​ మెడికల్​ హిస్టారియన్​ జాన్​ వాల్లర్ రాసిన ఒక పుస్తకం కొంచెం క్లారిటీ ఇచ్చింది. ‘ఏ టైం టు డాన్స్​, ఏ టైం టు డై, ది ఎక్స్​ట్రార్డినరీ స్టోరీ ఆఫ్​ ది డాన్సింగ్ ప్లేగు ఆఫ్ 1518’ అనే పుస్తకంలో చాలావరకు ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి.  ఫ్రావూ ట్రోఫియా అనే ఆమె వల్లే ఈ డాన్సింగ్ ప్లేగు మొదలైందని,  సుమారు 400 మంది ఇందులో పాల్గొన్నారని సాక్ష్యుల కథనాలతో పుస్తకం రాశాడు జాన్​ వాల్లర్​.

రకరకాల థియరీలు

డాన్సింగ్ ప్లేగు ఇన్సిడెంట్ గురించి రకరకాల థియరీలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది ‘ఫుడ్ పాయిజినింగ్​’ థియరీ. ఆ టైంలో పండించిన పంటకి ‘ఇర్గోట్’​ అనే ఫంగస్​ సోకి.. దాని నుంచి తయారు చేసిన బ్రెడ్ తిన్నారని, అది వాళ్ల బ్రెయిన్​పై ఎఫెక్ట్​ చూపించిందని, అందుకే అలా ప్రవర్తించి ఉంటారని కొందరు సైంటిస్టులు అభిప్రాయపడ్డారు.  అయితే జాన్​ వాల్లర్ మాత్రం ఆ థియరీని కొట్టిపడేశాడు. ఒకవేళ అదే గనుక నిజమైతే..  రైనే, మోసెల్లే నదీ తీరాల వెంబడి ప్రజలంతా అలాగే బిహేవ్​ చేయాలని ఆయన వాదించారు.

రెండో థియరీ.. అదొక మాస్ట్ హిస్టీరియా అని.  ‘డాన్సింగ్ ప్లేగు’ అనేది కొత్త విషయం కాదనేది జాన్​ వాల్లర్​ చెప్పిన మాట.  మధ్యయుగం నుంచి 16వ శతాబ్దం వరకు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇలాంటి ఘటనలు ఏడుసార్లు జరిగాయని వాల్లర్​ తన రిపోర్ట్​లో పేర్కొన్నాడు. ఆ లెక్కన ఇది ఒక మాస్​ సైకోజెనిక్​ డిజార్డర్​ అని ఆయన పేర్కొన్నాడు.  ‘‘అప్పటికే స్మాల్​ పాక్స్​, ప్లేగు వ్యాధులు యూరప్​ని కుదిపేస్తున్నాయి. స్ట్రాస్​బర్గ్ ఏరియాలో ఆకలి చావుల కేసులు రికార్డు అయ్యాయి. ప్రజలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఆ ఒత్తిడిలోనే మానసికంగా కుంగిపోయారు. దాని నుంచి బయటపడేందుకు అలా ఒకచోట చేరి డాన్సులు చేసి ఉంటారు. అలా అదొక మానసిక జబ్బుగా అందరికీ పాకింది”అని వాల్లర్​ పేర్కొన్నాడు. 20వ శతాబ్దపు సైంటిస్టుల్లో చాలామంది వాల్లర్​ చెప్పిన మాస్​ హిస్టరీయా థియరీకే ఓటేస్తుంటారు.  కానీ, కొందరు మాత్రం దెయ్యాలు పట్టడం వల్లే జనాలు అలా చేసి ఉంటారని చెప్తుండగా, మరికొందరు మాత్రం రక్తం ఓవర్ హీట్ కావడం వల్లే అలా డాన్సులు చేసి ఉంటారని చెప్తుంటారు.  ఎన్ని థియరీలు ఉన్నా.. ఓ సన్యాసి శాపం వల్లే  జనాలు చనిపోయారని ఇప్పటికీ కథలుగా చెప్తుంటారు స్ట్రాస్​బర్గ్ ప్రజలు.  అయితే స్ట్రాస్​బర్గ్​ ఇన్సిడెంట్ విషయంలో ఒక క్లారిటీ రాకపోవడానికి రీజన్​.. ఆ తర్వాత ఈ భూమ్మీద మరెక్కడా ఇలాంటి ఇన్సిడెంట్స్​ జరగకపోవడం.  కానీ, యూరప్​లో మాత్రం ఈ మిస్టరీ ఇన్సిడెంట్​పై లెక్కలేనన్ని డాక్యుమెంటరీలు, నాటకాలు ప్రచారం అయ్యాయి.

ఒక్కామె నుంచి మొదలై..

జాన్​ వాల్లర్ పుస్తకం ప్రకారం.. ‘‘ఏదైనా ఒకటి నుంచి మొదలవుతుంది. డాన్సింగ్ ప్లేగు విషయంలోనూ ఇదే జరిగింది. రోమన్ సామ్రాజ్యంలోని స్ట్రాస్​బర్గ్​ సిటీ.. (ఇప్పుడది ఫ్రాన్స్​లో ఉంది).  1518, జులై నెలలో ఒక రోజున ఫ్రావూ ట్రోఫియా అనే మహిళ సడన్​గా రోడ్ మీదకు వచ్చి డాన్స్​ మొదలుపెట్టింది.  అలా ఆమె నాన్​ స్టాప్‌‌గా డాన్స్​ చేస్తూనే ఉంది. చివరికి స్పృహ కోల్పోవడంతో ఆమెని భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ సాయంత్రమే మళ్లీ ఆమె అక్కడికే చేరుకుంది. అలా వారంపాటు డాన్స్​ చేశాక .. మరో 30 మంది ఆడవాళ్లు ఆమెతో  చేరారు. కాళ్లకు దెబ్బలు తగులుతున్నా..  రక్తంతో కాళ్లు బొబ్బలెక్కినా వాళ్లు డాన్స్ ఆపట్లేదు.  వాళ్లను చూసి మరికొందరు మగవాళ్లు ఆ గ్రూప్​ డాన్స్​లో జాయిన్​ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన లోకల్ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. మత పెద్దలతో చర్చించి ఏం చేయాలి అనేదానిపై ఒక డెసిషన్​ తీసుకున్నారు.  కానీ, అది మూర్ఖపు డెసిషన్​ అయ్యింది.  ‘ఎక్కువ మంది కలిసి డాన్స్​ చేస్తే..  మిగతా వాళ్లు కంట్రోల్​లోకి వస్తారని’ ఆలోచన చేశారు. అలా మరికొంత మందిని ఆ డాన్స్​ చేసేవాళ్లతో కలిపించారు. వాళ్లకు కావాల్సిన తిండి, వైన్​ అన్నీ అక్కడే సమకూర్చారు.  కానీ, ప్లాన్​ బెడిసి కొట్టింది. డాన్స్​ చేస్తూనే పదుల సంఖ్యలో జనాలు పిట్టల్లా రాలిపోయారు. నెలన్నర తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో ఆ ఉధృతి తగ్గిపోయింది. – శుభాశ్రీ