ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి

బీర్కూర్, వెలుగు: రైతుల బాధలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోందని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్​ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను స్పీకర్​.. మంత్రి ప్రశాంత్​ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్​తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు  ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి నష్టపోయేవారని, ఈ బాధను తొలగించడానికి కేసీఆర్  ‘రైతుబంధు’ ద్వారా నగదు సాయం అందిస్తున్నారన్నారు.  ప్రధాని మోడీ దేశంలోని  ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని విమర్శించారు.   

విద్వేషాలు సృష్టిస్తున్నరు: మంత్రి  ప్రశాంత్​రెడ్డి

దేశంలో బీజేపీ ప్రభుత్వం  చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడమే వారు పనిగా పెట్టుకున్నారని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్​ ప్రయారిటీ అభివృద్ధేనన్నారు.  బీజేపీ లీడర్ల మాటలు నమ్మితే  తెలంగాణ ఆగమైతదన్నారు. తెలంగాణ అభివృద్ధిని  ఓర్వలేకనే, కేంద్ర పని తీరును ప్రశ్నిస్తున్న వారిపై ఈడీ కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ జితేశ్​వి. పాటిల్​,  ఎస్పీ బి. శ్రీనివాస్​ రెడ్డి, డీసీసీబీ  చైర్మన్​పోచారం భాస్కర్​ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్​, ఎంపీపీ రఘు  పాల్గొన్నారు. 

గణేశ్​ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

సీపీ కేఆర్​ నాగరాజు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని  నిజామాబాద్ సీపీ నాగరాజు సూచించారు.  జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్​లో గణేశ్​ మండలి నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి  సీపీ హాజరై  మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు ముందుగా పోలీస్ శాఖ పర్మిషన్​తీసుకోవాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని  సౌలత్​లు  కల్పించాలని అన్నారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పోలీసులను సంప్రదించాలన్నారు.  అడిషనల్​డీసీపీ అరవింద్ బాబు, డిఫ్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

బందోబస్త్​ ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ 

సెప్టెంబర్ 5న సీఎం కేసీఆర్​నిజామాబాద్ పర్యటన సందర్భంగా శుక్రవారం  సీపీ నాగరాజు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొత్త కలెక్టరేట్ బిల్డింగ్, గిరిరాజు కాలేజ్ గ్రౌండ్ లో పబ్లిక్ మీటింగ్ స్థలం తదితర ప్రాంతాలను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.   

బాధ్యతలు స్వీకరించిన బోధన్ ​ఏసీపీ

బోధన్​,వెలుగు: బోధన్​ ఏసీపీగా కిరణ్​కుమార్​ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.  ఈ సందర్భంగా    ఆయన మాట్లాడుతూ శాంత్రి భద్రతలు కాపాడడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు  సహకరించాలని కోరారు. 

చెక్​డ్యాంలు, నీటికుంటల పరిశీలన

లింగంపేట, వెలుగు: నాగిరెడ్డిపేట అటవీరేంజ్​ పరిధిలోని రాంపల్లి, శెట్​పల్లి సంగారెడ్డి అటవీ ప్రాంతాలలో నిర్మించిన చెక్​డ్యాంలు, నీటికుంటలను శుక్రవారం  కామారెడ్డి ఎఫ్​డీవో  గోపాల్​రావు, ఫ్లయింగ్​స్వ్కాడ్​ సిబ్బందితో కలసి పరిశీలించారు. కొత్తగా నిర్మించిన చెక్​డ్యాంల కొలతలు వేశారు. వీరివెంట నాగిరెడ్డిపేట ఫారెస్ట్​రేంజ్​ఆఫీసర్​రవికుమార్​ ఉన్నారు. 

నిధులిస్తలేరని భిక్షమెత్తిన ఎంపీటీసీ

బీజేపీ సభ్యుడు అయినందుకే  ఇస్తలేరని ఆరోపణ

కామారెడ్డి , వెలుగు: గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ  శుక్రవారం ఓ బీజేపీ ఎంపీటీసీ మండల పరిషత్​ మీటింగ్​లో భిక్షాటన చేశాడు. సదాశివనగర్​ మండలం ధర్మారావుపేట, అమర్లబండ ఎంపీటీసీ  మహిపాల్​ యాదవ్​.. తాను  ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీటీసీ అయినందుకే ఫండ్స్​ఇస్తలేరని ఆరోపిస్తూ మండల పరిషత్​ మీటింగ్​లో నిరసనకు దిగారు. మీటింగ్​ షురూ కాగానే  మహిపాల్​ యాదవ్​ తోటి ఎంపీటీసీలు, సర్పంచులు, ఆఫీసర్ల వద్ద భిక్షాటన చేశారు. ఎంపీడీవో లక్ష్మీ జోక్యం  చేసుకుని ఎంపీటీసీని మీటింగ్​ హాల్​ నుంచి బయటకు పంపారు.  మీటింగ్ హాల్​ డోర్​ వద్ద  బైఠాయించిన మహిపాల్​మళ్లీ భిక్షాటన చేశారు. ఇంత జరుగుతున్నా మీటింగ్​కు హాజరైన ఎమ్మెల్యే జాజాల సురేందర్​ ఏమీ మాట్లాడలేదు.   ఈ సందర్భంగా మహిపాల్​ యాదవ్​ మాట్లాడుతూ..  15వ ఆర్థిక సంఘం నిధులు మిగతా ఎంపీటీసీలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తే తనకు లక్షా 50వేలు మాత్రమే ఇచ్చారన్నారు.  కలెక్టర్​కు, ఇతర ఆఫీసర్లకు  కంప్లైంట్ చేసినా ఫలితం లేదన్నారు. 

కత్తులతో దాడిచేసిన వ్యక్తి అరెస్ట్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు:  మాలపల్లి లో ఒక హోటల్ వద్ద కత్తులతో ఓ వ్యక్తిపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సీపీ వివరాల ప్రకారం.. హష్మీ కాలనీకి చెందిన షేక్ జాస్మిన్ అతడి స్నేహితుడు ఫహద్ ల మధ్య గొడవ జరగడంతో  జాస్మిన్ ఫహద్​పై కక్ష పెంచుకున్నాడు. అతడిపై దాడి చేసేందుకు నిర్ణయించుకుని మహారాష్ట్ర లోని నాందేడ్ కు వెళ్లి  మారణాయుధాలు కొనుగోలు చేశాడు. ఇటీవల మాలపల్లి లోని స్టార్ హోటల్ దగ్గర ఫహద్​కోసం వెయిట్​చేస్తుండగా.. అదే సమయంలో శభాజ్ హైమద్ ఖాన్ అనే వ్యక్తితో  గొడవ జరగడంతో  నిందితుడు కత్తి తీసుకొని అతడిని తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు హైమద్​ఖాన్​కంప్లైంట్​మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి అతడిని  అరెస్ట్​చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు కత్తులు, రెండు గోడ్డళ్ల ను స్వాధీనపరుచుకున్నారు.  వన్ టౌన్ ఇన్​స్పెక్టర్​విజయబాబు, టాస్క్ ఫోర్స్ ఇన్​స్పెక్టర్​శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 

‘హెచ్​సీఎల్’ సంస్థ ​కృషి భేష్

నిజామాబాద్,  వెలుగు: ‘హెచ్​సీఎల్ టెక్ బీ ఎర్లీ కెరీర్’ ​ప్రోగ్రాంతో  ఇంటర్​స్టూడెంట్లకు వేగంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఇంటర్ బోర్డు జిల్లా అధికారి రఘురాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ  కాలేజీలో హెచ్​సీఎల్​ఆధ్వర్యంలో 2021–‌‌‌‌‌‌‌‌--22 ​ఇంటర్ ఎంపీసీ, ఎంఈసీ పూర్తి చేసిన స్టూడెంట్లకు  జాబ్​తో  పాటు  పై చదువులకు అవకాశం కల్పించే ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. హాజరైన రఘురాజ్​మాట్లాడుతూ  ప్రముఖ సాఫ్ట్ వేర్, బిట్స్ ఫిలానీ సంస్థలలో స్టూడెంట్లకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు హెచ్​సీఎల్​కృషి అభినందనీయమన్నారు.  హెచ్​సీఎల్​ రాష్ట్ర ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ టెక్నాలజీని కెరీర్ గా ఎంచుకుని, ఉపాధి కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశమని చెప్పారు. డిగ్రీ  కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి  హెచ్​సీఎల్ ​సంస్థ ప్రతినిధి రాజేశ్ తదితరులు 
పాల్గొన్నారు

ఎర్రకుంట అలుగుపై వంతెన నిర్మించాలి

ఆర్మూర్, వెలుగు : మాక్లూర్ మండలం మాందాపూర్ గ్రామం శివారులో ఉన్న ఎర్రకుంట అలుగు ఎత్తు పెంచి, వంతెన నిర్మించాలని కోరుతూ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ లోని డివిజన్​ ఇరిగేషన్, పంచాయతీరాజ్​ శాఖ అధికారులను కలిసి మెమోరండం అందజేశారు. మాందాపూర్, లక్మాపూర్ గ్రామాల ప్రజలు ప్రయాణించేటప్పుడు అలుగు ప్రాంతంలో రోడ్డు ప్రమాదకరంగా ఉండటంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం వంతెన నిర్మించాలని వారు  అధికారులను​  కోరారు. వీడీసీ పెద్దలు రంపె గంగాధర్,  పోశెట్టి పాల్గొన్నారు.

సిద్ధుల గుట్ట అభివృద్ధికి ఫండ్స్​ ఇవ్వండి

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​ టౌన్ లోని  నవనాథ సిద్ధుల గుట్ట అభివృద్ధికి ఫండ్స్​ ఇవ్వాలని  ఆలయ కమిటీ  ప్రతినిధులు శుక్రవారం పీయూసీ చైర్మన్​ఆశన్నగారి జీవన్ రెడ్డి కి మెమోరండం అందజేశారు. వెంటనే ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి  ఇంద్రకరణ్​రెడ్డి తో ఫోన్ లో మాట్లాడారని రూ.50 లక్షలు ఫండ్స్​ శాంక్షన్​ చేస్తానని  మంత్రి హామీ ఇచ్చారని  ఆలయ కమిటీ  చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆలయ కమిటీ సభ్యులు బి సుమన్, పీసీ గంగారెడ్డి, నక్కల లక్ష్మణ్, కొడిగల మల్లయ్య తదితరులు ఉన్నారు. 

సీఎం హామీలు వెంటనే నెరవేర్చాలి

బీర్కూర్​, వెలుగు: సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీర్కూర్​ మండల వీఆర్​ఏలు డిమాండ్​ చేశారు. శుక్రవారం  కామారెడ్డి జిల్లా బీర్కూర్​ మండల కేంద్రంలో వీఆర్ఏలు‘ పే స్కేల్​జాతర’ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ న్యాయమైన హామీలను నెరవేర్చే వరకు సమ్మెను విరమించేది లేదన్నారు.  ఈ కార్యక్రమంలో వీఆర్​ఏల  మండల అధ్యక్షుడు బత్తిని గంగాధర్​, కార్యదర్శి విజయ్​, వీఆర్ఏలు గౌస్​, రవి, మొగులయ్య, సాయిలు,  నర్సవ్వ, నాగవతి తదితరులు  పాల్గొన్నారు.

బైక్​కు అడ్డొచ్చిన అడవిపందులు..
కింద పడి యువకుడు మృతి

లింగంపేట, వెలుగు:  మండలంలోని పర్మల్ల గ్రామ శివారులో  బైక్​కు అడవిపందుల గుంపు అడ్డురావడంతో కిందపడి ఓ యువకుడు చనిపోయాడు.  ఎస్సై శంకర్​వివరాల ప్రకారం..  శెట్​పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన బిట్ల సాయి మనీశ్​(24)  కామారెడ్డి జిల్లా సివిల్​సప్లై ఆఫీస్ లో  ఔట్​ సోర్సింగ్ ఎంప్లాయ్​గా జాబ్​ చేస్తున్నాడు. విధులు ముగించుకుని కామారెడ్డి  నుంచి శెట్​పల్లి సంగారెడ్డి గ్రామానికి గురువారం రాత్రి బైక్​పై వెళ్తుండగా పర్మల్ల ఊరచెరువు దగ్గరలో అడవిపందులు​ అడ్డురావడంతో బైక్​ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలై స్పాట్​లోనే చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. తండ్రి సాయిలు  కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

మాకు ఎన్నికలు పెట్టండి
ఎన్నికల సంఘం కమిషనర్ ను కోరిన నాగిరెడ్డిపేట నేతలు

హైదరాబాద్ ,వెలుగు: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట ధర్మారెడ్డి ఎంపీటీసీ సీటు కు ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం  కమిషనర్​పార్థసారధిని జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి కోరారు.  శుక్రవారం మాసబ్​ట్యాంక్​లోని ఆయన కార్యాలయంలో  కమిషనర్​ను మనోహర్ రెడ్డి తో పాటు నేతలు సిద్ధయ్య,   పుప్పాల నారాయణ తో పాటు పలువురు నేతలు వినతిపత్రం అందచేశారు. రాష్ర్టంలో పలు సర్పంచ్ , ఉప సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈసీ ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసినా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు.

మట్టి వినాయకులనే పూజించాలి

కామారెడ్డి, వెలుగు: గణేశ్​ఉత్సవాల సందర్భంగా  మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించుకోవాలని  కామారెడ్డి కలెక్టర్​ జితేశ్​వి పాటిల్ పిలపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్​లో పీస్​కమిటీ మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ..  ఉత్సవాలు శాంతి యుతంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు. ఆయా శాఖల  అధికారులు కోఆర్డినేషన్​తో  పనులు చేపట్టాలన్నారు. ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ..   గణేశ్​ మండపాలప్రతినిధులు  స్థానిక పీఎస్​లలో తమపేర్లను  నమోదు  చేసుకోవాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్​, అడిషనల్ ఎస్పీ అన్యోన్య,  మున్సిపల్  చైర్​పర్సన్​ నిట్టు జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. 

పాల్వంచ మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్

కామారెడ్డి, వెలుగు:  మాచారెడ్డి మండలంలోని  పాల్వంచను కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు శుక్రవారం ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది.  పాల్వంచ,  వెల్పుగొండ,  వాడి, ఫరీద్​పేట,  బండరామేశ్వర్​పల్లి,  ఇసాయిపేట, దేవన్​పల్లి,  పోతారం, భవానిపేట,  సింగరాయిపల్లి  గ్రామాలతో  కొత్త గా మండలానికి  చీఫ్ సెక్రటరీ సోమేశ్​కుమార్ నోటిఫికేషన్​ ఇచ్చారు.

ఘనంగా పొలాల అమావాస్య

బోధన్, వెలుగు: బోధన్​ మండలంలోని గ్రామాలలో పొలాల అమావాస్య పండుగ ఘనంగా  నిర్వహించారు. మండలంలోని గ్రామాల్లో రైతులు తమ ఎద్దులకు రంగురంగుల  బట్టలు, గొంగళ్లతో అలంకరించారు. ఆనంతరం హనుమాన్​ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  గ్రామంలోని హనుమాన్​ మందిరాల చుట్టు ఎద్దులను ఐదు రౌండ్లు తిప్పారు.  

అవినీతి వీసీని తొలగించాలి

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న వీసీ రవీందర్​ను వెంటనే తొలగించాలని  స్టూడెంట్​ లీడర్లు ఎమ్మెల్యే బాజిరెడ్డి  గోవర్ధన్​కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడిటోరియం, గర్ల్స్  హాస్టళ్లను నిర్మించమంటే డబ్బులు లేవంటున్న వీసీ 3 నెలల్లో రూ. 11 కోట్లు   ఖర్చు చేశారని  ఆరోపించారు. యూనివర్సిటీకి బస్సు సౌకర్యం, మెస్​ ఛార్జీల పెంపు, ఓపెన్​జిమ్ ఏర్పాటు​ తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టి కి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. స్టూడెంట్​ లీడర్లు సంతోష్​, నవీన్​, అర్బాజ్​ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.