మాయాగాళ్ల మాఫియా ‘డార్క్ వెబ్’

మాయాగాళ్ల మాఫియా ‘డార్క్ వెబ్’

అదో చీకటి ప్రపంచం. వాయు వేగంతో దూసుకెళ్తున్న ప్రపంచాన్ని దోచుకుంటున్న మరో ప్రపంచం. ఆశ చూపి మోసం చేసే మోసగాళ్లున్న దోపిడి ప్రపంచం. అక్రమ వ్యాపారాలన్నింటికి అడ్డా. ఇల్లీగల్ గా ఏది చేయాలనుకున్నా ఇప్పుడంతా అందులోకే వెళ్తున్నారు. డ్రగ్స్ నుంచి కిరాయి హంతకుల దాకా అన్నీ దొరుకుతాయి. ఒకసారి ఎంటరైతే అంతే సంగతులు. అదే డార్క్ వెబ్. ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో చాలా వాటి లింకులు డార్క్ వెబ్ లోనే ఉంటున్నాయి. అసలు ఈ డార్క్ వెబ్ ఏంటీ..? అందులో ఏం జరుగుతోంది.?

ఓ వ్యక్తికి డ్రగ్స్ అలవాటు ఉంది. బయట దొరకడం లేదు. ఎలాగోలా డార్క్ వెబ్ లో ఉంటే వెబ్ సైట్ అడ్రస్ తెలుసుకుని అందులోకి ఎంటరయ్యాడు. ఓ వ్యక్తి తుపాకీతో ఒకరిని హత్యచేశాడు. ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే ఆరా తీస్తే..  దాని మూలాలు డార్క్ వెబ్ లో దొరికాయి. ఒకతను గేమింగ్ యాప్ లో లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆ యాప్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతోందని ఎంక్వైరీ చేస్తే.. అది కూడా డార్క్ వెబ్ లోనే ఉందని తెలిసింది. ఇలా.. ప్రస్తుతం క్రైం ఏదైనా సరే.. దాని సోర్స్ మాత్రం డార్క్ వెబ్ లోనే ఉంటోంది. ఈ మధ్యకాలంలో ఇల్లీగల్ డ్రగ్స్ బిజినెస్ భారీగా పెరిగిపోయింది. పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా అక్రమార్కులు ఏదో ఒక రూపంలో తమ దందా నడిపిస్తూనే ఉన్నారు. కొత్త విధానాల్లో, టెక్నాలజీని ఉపయోగించి డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. ఇలా ఓ యాప్ తయారుచేసి మరీ అందులో డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 30 మంది కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే ఉన్నట్టు పోలీసులు 

ఆన్ లైన్ లో డ్రగ్స్ బుకింగ్..డోర్ డెలివరీ

 క్రిప్టో కరెన్సీ ద్వారా ఆన్ లైన్ లో డబ్బులు చెల్లిస్తున్నారు. ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ మాదిరిగా డ్రగ్స్ కూడా ఇంటికే డెలివరీ చేస్తున్నారు. యాప్ ద్వారానే అన్నీ లావాదేవీలు జరుగుతున్నాయి. గోవాకు చెందిన నరేంద్ర ఆర్య ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు గుర్తించారు. 30 లక్షల లావాదేవీలు చేశాడని, దేశవ్యాప్తంగా 450 మంది కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేసినట్టు చెప్పారు. ఆన్ లైన్ లో బుకింగ్, హోం డెలివరీ. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఈ దందా నడుస్తోంది. పోలీసులకు వచ్చిన చిన్న సమాచారంతో ఈ డ్రగ్స్ గుట్టు రట్టయ్యింది. ఒక్క డ్రగ్సే  కాదు ఇలాంటి ఇల్లీగల్ దందాలు ఇప్పుడు చాలా తయారయ్యాయి. అక్రమంగా ఆయుధాల అమ్మకం, హ్యాకింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఫేక్ లింక్స్ తో అకౌంట్లు ఖాళీ చేయడం.. ఇలా చాలా రకాల వ్యవహారాలు నడుస్తున్నాయి. గూగుల్ లో సెర్చ్ చేస్తే హౌస్ కీపింగ్ సిబ్బంది దొరికినంత ఈజీగా.. ఇందులో కిరాయి హంతకులు దొరుకుతారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా వీటికి ఎండ్  కార్డ్ మాత్రం పడటం లేదు. చాలా తక్కువ కేసుల్లో కొద్ది మంది పోలీసులకు చిక్కారు. అయినా కొత్తగా నేరగాళ్లు వస్తూనే ఉన్నారు. దీనికి కారణం డార్క్ వెబ్.

సైబర్ నేరగాళ్లకు మెయిన్ ప్లాట్ ఫాం

పేరుకు తగ్గట్టే నిజంగానే ఇది డార్క్ లో అంటే చీకట్లోనే ఉంటుంది. ఇక్కడ నడిచే వ్యవహారాలు, దందాలు ఎవరికి కనిపించవు. అందుకే ఇది సైబర్ నేరగాళ్లకు మెయిన్ ప్లాట్ ఫాం లాగా మారింది. మనం రెగ్యులర్ గా గూగుల్ సెర్చింజన్ ను వాడే దానికంటే ఎక్కువగా ఈ డార్క్ వెబ్ ను బ్రౌజ్ చేసే వారు తయారవుతున్నారు. ప్రతీ ఇల్లీగల్ యాక్టివిటీతో దీనికి లింక్ ఉంటోంది. వ్యక్తుల సమాచారం, మొబైల్ నంబర్లు, మెయిల్ ఐడీలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసి డార్క్ వెబ్ లో అమ్మేస్తున్నారు. లక్షలాది మంది పర్సనల్ డేటా డార్క్ వెబ్ లో అందుబాటులో ఉందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. చాలా దేశాల ప్రభుత్వ సర్వర్లు, బ్యాంకింగ్ సర్వర్లను హ్యాక్ చేసి.. అందులోని డేటాను డార్క్ వెబ్ లో అమ్ముతున్నారని గుర్తించారు. ఇలా పర్సనల్ డేటాని అమ్మడం, కొనడం చట్ట విరుద్ధం. కానీ చాలా మంది ఇలా డేటాను కొని తమ దందా నడిపిస్తున్నారు. 

ప్రతీరోజు.. 24/7 యాక్టీవ్ గా డార్క్ వెబ్


ఈ చీకటి ప్రపంచం ప్రతీరోజు.. 24/7 యాక్టీవ్ గా పనిచేస్తోంది. పోలీసులు వెంటాడుతున్నారనే భయం వాళ్లకు లేదు. ఎక్కడైనా దొరికిపోతామనే టెన్షన్ కూడా ఉండదు. బయటైతే పోలీసుల భయం.. కానీ ఇందులో అవేం ఉండవు. ఎవరికీ దొరికే ప్రసక్తే ఉండదన్నది నేరగాళ్ల ధీమా. కేవలం మన దేశంలోనే కాదు.. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి. క్రిమినల్ దందాలన్నీ ఇందులోనే నడుస్తున్నాయి. ఎవరికి చిక్కకుండా..? కనీసం చిన్న క్లూ కూడా దొరకకుండా కోట్లలో వ్యవహారం నడిపిస్తున్న ఈ డార్క్ వెబ్  అక్రమార్కులకు అడ్డాగా మారింది,ఇంటర్నెట్ అనేది మానవ జీవితంలో ఓ భాగమైపోయింది. పొద్దున లేచిన దగ్గర్నుంచ పడుకునే వరకు ప్రతీ పనిలో ఇంటర్నెట్ భాగస్వామ్యం ఉంటోంది. ఇంటర్నెట్ కు సంబంధించి డార్క్ వెబ్, డీప్ వెబ్, సర్ఫేస్ వెబ్ అని మూడు ఉంటాయి. మనం రెగ్యులర్ గా వాడేది సర్ఫేస్ వెబ్. డీప్ వెబ్ అనేది సెక్యూర్డ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. ప్రభుత్వాలు, బ్యాంకింగ్ నెట్ వర్క్ లు, పేమెంట్ గేట్ వేలు ఇందులో ఉంటాయి. ఇదంతా చాలా భద్రంగా ఉండాల్సిన సమాచారం. అందుకే వీటికోసం డీప్ వెబ్ వాడతారు. అలాగే రక్షణ సంబంధ  కార్యకలాపాలు డీప్ వెబ్ లోనే జరుగుతాయి. డార్క్ వెబ్ అనేది. డీప్ వెబ్ కంటే సెక్యూర్డ్ ఇంటర్నెట్. దీన్ని 1990లో అమెరికా సైన్యం తమ కార్యకలాపాల కోసం ప్రారంభించింది. భద్రతా సమాచారం లీక్ కాకుండా, శత్రువు చేతికి వెళ్లకుండా ఉండేందుకు డార్క్ వెబ్ ను వాడారు. ఇప్పటికీ చాలా దేశాలు దీన్ని తమ కార్యకలాపాలు సెక్యూర్డ్ గా కొనసాగించడానికి వాడుతున్నాయి. 

 మనం రెగ్యులర్ గా వాడే సర్ఫేస్ వెబ్ ని ఏ బ్రౌజర్ ద్వారా అయినా వాడొచ్చు. గూగుల్, ఫైర్ ఫాక్స్, యాహూ.. బ్రౌజర్లతో వెబ్ సైట్లు ఓపెన్ చేస్తాం. కావాల్సిన యూఆర్ఎల్ టైప్ చేసి వెతుకుతాం. సర్ఫేస్ వెబ్ లో కనిపించే ప్రతీ వెబ్ సైట్ డేటా ఇండెక్స్ అయ్యి ఉంటుంది. అందుకే ఏదైనా పదం, లేదా వెబ్ సైట్ పేరు సెర్చ్ చేసినప్పుడు అది సెర్చ్ రిజల్ట్స్ లో కనిపిస్తుంది. సెర్చ్  చేసిన పదానికి సంబంధించిన డేటా కొన్ని వందల పేజీలు కనిపిస్తుంది. డాట్ కామ్, డాట్ ఇన్, డాట్ నెట్, డాట్ ఓఆర్జీ వంటి ఎక్స్ టెన్షన్ తో ఉన్న వెబ్ సైట్లు, అది కూడా సెక్యూర్డ్ సెర్చ్ లైసెన్స్ ఉన్న వెబ్ సైట్లమాత్రమే గూగుల్ లో ఓపెన్ అవుతాయి. లేకపోతే అన్ సెక్యూర్డ్ అని చూపిస్తాయి. కొన్ని సైట్లు పూర్తిగా ఓపెన్ కూడా కావు. మరోవైపు.. ఇందులో ఏది సెర్చ్ చేసినా అది ట్రాక్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఇల్లీగల్ వ్యవహారం జరిగితే సులువుగా పోలీసులకు తెలిసిపోతుంది. ఎవరు.. ఎక్కడ్నుంచి చేశారనే దాన్ని ఐపీ అడ్రస్ ద్వారా పట్టేస్తారు. కానీ ఈ బ్రౌజర్లతో డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయలేం. 

ప్రైవసీ, ప్రొటెక్షన్ ఎక్కువ

డార్క్ వెబ్ లో జరిగే వ్యవహారం అంత ఈజీగా కనిపెట్టలేరు. రెగ్యులర్ గా వాడే బ్రౌజర్లతో ఇందులోకి వెళ్లలేము. దీనికి ప్రత్యేకంగా టోర్ బ్రౌజర్ ఉంటుంది. వాస్తవానికి టోర్ బ్రౌజర్ ను సెక్యూర్డ్ బ్రౌజింగ్ కోసం తయారుచేశారు. ఇందులో ప్రైవసీ, ప్రొటెక్షన్ ఎక్కువ. మనం ఏది సెర్చ్ చేసినా సెర్చ్ ఇంజిన్ లో ఇండెక్స్ కాదు. టోర్ బ్రౌజర్ ఎన్ క్రిప్ట్ అయి ఉంటుంది. దానివల్ల పర్సనల్ డేటాను ఇతరులు చూసే అవకాశం ఉండదు. ప్రజలు తమ అభిప్రాయాలను స్వతంత్రంగా వెల్లడించాలనే ఉద్దేశంతో దీన్ని వినియోగిస్తున్నవాళ్లు ఉన్నారు. కానీ ఇది ఇఫ్పుడు నేరగాళ్లకు స్వర్గధామంగా మారింది.  సాధారణ బ్రౌజర్లలో ఐపీ అడ్రస్ ట్రాక్ అవుతూ ఉంటుంది. ఏ మారుమూల పల్లెలో చెట్టుకింద కూర్చుని మొబైల్ తో ఏ క్రైం చేసినా పట్టేస్తారు. దీనికి కారణం ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఐడీ. కానీ డార్క్ వెబ్ లో ఐపీ అడ్రస్ ని ట్రాక్ చేయడం కష్టం. క్షణక్షణానికి ఐడీలు మారిపోతూ ఉంటాయి. దీంతో బ్రౌజ్ చేస్తున్నవాళ్లు ఎవరనేది కూడా గుర్తించడం కష్టం. అందుకే టోర్ బ్రౌజర్ ద్వారా చాలా మంది ఇల్లీగల్ వెబ్ సైట్లలోకి ఎంటర్ అవుతున్నారు. మామూలుగా ఏదైనా వెబ్ సైట్, యాప్ క్రియేట్ చేయాలంటూ దానికి డేటాబేస్ కావాలి. డేటాబేస్ అందించే కొన్ని సంస్థలకు డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తాం. కానీ డార్క్ వెబ్ లో పర్సనల్ డేటా బేస్ క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే చాలామంది నేరగాళ్లు ఇందులో అకౌంట్లు ఓపెన్ చేసి దందా నడిపిస్తున్నారు. డ్రగ్స్, వెపన్స్ అమ్ముతున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చేస్తున్నారు. తెలిసినవాళ్ల లాగా ఇంటర్నెట్ నుంచి కాల్స్ చేసి నిలువుదోపిడీ చేస్తున్నారు. 

ఆన్ లైన్ లో పోలీసుల డెకాయ్ ఆపరేషన్లు

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది.. కొత్త రకం నేరాలు పెరుగుతున్నాయి. అయినా సవాలుగా తీసుకుని కేసులను డీల్ చేస్తున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్స్ ని కంట్రోల్ చేయడంలో చాలా మెలకువలు నేర్చుకున్నారు. నేరస్తుడు దేశంలో ఏ మూలన ఉన్నా పట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు డార్క్ వెబ్ రూపంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనివల్ల నేరగాళ్లను పట్టుకోవడం కాస్త ఆలస్యమౌతోంది. దీనికోసం ఆన్ లైన్ లోనూ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఓటీపీ, గిఫ్ట్ కూపన్, స్పామ్ లింక్ నేరాలు చాలా పెరిగిపోయాయి. వీటిపై ఫోకస్ పెట్టిన పోలీసులు చాలా వరకు కట్టడి చేయగలిగారు. కానీ డార్క్ వెబ్ లో జరుగుతున్న నేరాలు మాత్రం తగ్గడం లేదు. కొందరిని పట్టుకన్నా కొత్తవాళ్లు వస్తున్నారు.  ఇల్లీగల్ బిజినెస్ చేసేవాళ్లు, వారి కస్టమర్లు డార్క్ వెబ్ లో సులువుగా, ఎలాంటి భయం లేకుండా పని కానిచ్చేస్తున్నారు.

 డ్రగ్స్, వెపన్స్, కిరాయి హంతకులే కాదు.. ఇందులో ఇంకా చాలాఉన్నాయి. చాలాసార్లు మనకు స్పామ్ లింకులు వస్తుంటాయి. అసలు మన ఫోన్ నంబర్ వాళ్లు ఎలా తెలుసు..? మన నంబర్ కే లింక్ ఎందుకొచ్చిందని అర్థం కాదు. కానీ ఇలా చాలా మంది నంబర్లు సైబర్ నేరగాళ్లు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసేవాళ్ల దగ్గర ఉంటాయి. మొబైల్ నంబర్లు, ఈ మెయిల్ ఐడీలు, ప్రజల వ్యక్తిగత డేటా అమ్ముకోవడం డార్క్ వెబ్ లో చాలా పెద్ద బిజినెస్. డార్క్ వెబ్ లో ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు కొనుగోలు చేసి వాటికి స్పామ్ లింక్ లు పంపిస్తున్నారు. అవి నిజమైన లింక్స్ అనుకుని క్లిక్ చేస్తాం. ఇంకేముంది క్షణాల్లో అకౌంట్లలో ఉన్న డబ్బు ఖాళీ అవుతుంది. ఏం జరిగిందో తెలిసేలోపే.. అకౌంట్ మొత్తాన్ని ఊడ్చి పెడతారు. లేకపోతే ఫోన్ ని హ్యాక్ చేసి అందులోని డేటా అంతా లాగేస్తారు. ఫొటోలు మార్ఫింగ్ చేస్తామని.. సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారు. తాము అడిగినంత డబ్బు ఇస్తేనే డేటా తిరిగి ఇస్తామంటారు. 

ఇల్లీగల్ యాప్ ల డేటా బేస్ అంతా ఈ డార్క్ వెబ్ లోనే

 అంతేకాదు.. చాలా గేమింగ్ యాప్ లు, ఇల్లీగల్ యాప్ ల డేటా బేస్ అంతా ఈ డార్క్ వెబ్ లోనే ఉంటుంది. యాప్ లు క్లిక్ చేసినప్పుడు అవి మన అకౌంట్ ని యాక్సెస్ చేస్తాయి. సైబర్ నేరగాళ్లు మన అకౌంట్లను ఊడ్చేస్తారు. గేమ్ ల పేరుతో క్రిప్టో కరెన్సీ ఇస్తామని చెప్పి, బిట్ కాయిన్ బిజినెస్ పేరుతో మన అకౌంట్లోకి డబ్బు వచ్చినట్టు చూపిస్తారు. కానీ దాన్ని మనకు ట్రాన్స్ ఫర్ చేయరు. మనం క్రియేట్ చేసిన అకౌంట్ వాలెట్ లో డబ్బు ఉన్నట్టు టెక్నికల్ గా మేనేజ్ చేస్తారు. మన దగ్గర్నుంచి లక్షలాది రూపాయలు లాగేశాక.. పత్తా లేకుండా పోతారు.  పోలీసులు చాలా కేసుల్ని చేధిస్తున్నా.. డార్క్ వెబ్ వేదికగా జరుగుతున్న క్రైమ్స్ ని కంట్రోల్ చేయడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఐపీ అడ్రస్ లు మారుతుండటంతో నేరస్తుడు ఎక్కడున్నాడో గుర్తించడం కష్టమవుతోంది. అందుకే పోలీసులు.. టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతున్నారు. నేరస్తులను పట్టేసేందుకు డార్క్ వెబ్ లోకి ఎంటరవుతున్నారు. డ్రగ్స్ అమ్ముతామంటూ, వెపన్స్ ఉన్నాయంటూ డార్క్ వెబ్ లో ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. వాటి ద్వారా నేరస్తులను ట్రాక్ చేసి.. అసలు నిందితులను పట్టేస్తున్నారు. ఒకప్పుడు డార్క్ వెబ్ లో ఉన్నోళ్లను పట్టుకోవడం ఇబ్బందిగా ఉన్నా.. ఇప్పుడున్న టెక్నాలజీతో ఈజీ అవుతోందని చెబుతున్నారు. 

డార్క్ వెబ్ లోకి ఎంటరవ్వడం చాలా ప్రమాదకరం

చాలా మంది యూత్ డ్రగ్స్ కోసం టోర్ బ్రౌజర్ వాడుతున్నట్టు ఇటీవల పట్టుబడిన కొందరు నేరస్తుల ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే.. డార్క్ వెబ్ లోకి ఎంటరవ్వడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో ఉండే హ్యాకర్లు డేటాని హ్యాక్ చేస్తే జేబులు ఖాళీ అవడం ఖాయమంటున్నారు. అందుకే డార్క్ వెబ్ జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. హైస్పీడ్ ఇంటర్నెట్ ఉంది. టెక్నాలజీని మంచి కోసం వాడాలా.? చెడుకోసం వాడాలా అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అత్యాశకు పోయి, అక్రమ దందాలు చేద్దామని డార్క్ వెబ్ లోకి ఎంటరైతే తిప్పలు తప్పవంటున్నారు పోలీసులు. నేరం చేద్దామని ఆ చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టి.. నేరగాళ్ల చేతుల్లో చిక్కే ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. డార్క్ వెబ్ లో చిక్కి జీవితాలు చీకటిపాలు చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.