రోశయ్య రాజకీయ ప్రస్థానం

V6 Velugu Posted on Dec 04, 2021

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రోశయ్య.. తన దైన ముద్ర వేసుకున్నారు. విలువలతో కూడిన రాజకీయం చేశారు. నిబద్ధతకు మారు పేరు కొనిజేటి రోశయ్య. సభలో ఆయన మాటకు తిరుగు ఉండదు. ఎక్కడైనా సరే తన చతురత ప్రదర్శించేవారు. ప్రతిపక్షాల విమర్శలకు పదునుగా సమాధానాలు ఇచ్చేవారు. ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన రికార్డు కూడా రోశయ్యగారి సొంతం. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై మాట్లాడే విషయంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన వాక్చాతుర్యంతో అసెంబ్లీలో  అందర్నీ  హడలెత్తించిన వారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు రోశయ్య. 

రోశయ్య జీవిత చరిత్ర
కొణిజేటి రోశయ్య 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాడు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యారు.ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.

రోశయ్య ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు

ఆర్థికమంత్రిగా

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య. 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు. 

ముఖ్యమంత్రిగా

వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు.  2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. 2018 ఫిబ్రవరి 11 ఆదివారం నాడు టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు... రోశయ్యకు స్వర్ణ కంకణం బహుకరించారు. రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడని కొనియాడారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారని తెలిపారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

1968 నుంచి వివిధ హోదాల్లో రోశయ్య 

1968-85: శాసనమండలి సభ్యుడు.
1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత.
1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.
2009, సెప్టెంబరు - 2010 నవంబరు 24:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు.

Tagged ex cm rosaiah biography, rosaiah political carrier

Latest Videos

Subscribe Now

More News