నవరస నట సార్వభౌముడు కైకాల

నవరస నట సార్వభౌముడు కైకాల

కలలో కూడా మరువలేని కటౌట్ ఆయనది. 
ఎనభై ఏడేళ్ల జీవిత కాలంలో 
అరవయ్యేళ్లకు పైగా నటించిన రికార్డ్ ఆయనది. 
అలాంటి నటుడు మరొకరు లేరు. మరి రారు. 
ఆయనే నవరస నటనా సార్వభౌముడు
కైకాల సత్యనారాయణ

తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్లకు పుట్టారు కైకాల సత్యనారాయణ (1935, జులై 25). అందుకేనేమో.. సినిమాతో పాటే ఎదిగారు. తెలుగు సినీ చరిత్రలో తన పేరును సగర్వంగా లిఖించుకున్నారు. విలన్‌‌గా వికటాట్టహాసం చేసినా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కంటతడి పెట్టించినా.. కమెడియన్‌‌గా కడుపుబ్బ నవ్వించినా.. ఆయనదో ప్రత్యేక శైలి. ఆ పాత్రలు ఆయన కోసమే పుట్టాయా అన్నంతగా పరకాయ ప్రవేశం చేయడం.. ఆయన చేయకపోతే ఆ పాత్ర ఇంకెవరూ చేయలేరేమో అనిపించేంతగా రక్తి కట్టించడం ఆయనకే చెల్లింది. నవరస నటనా సార్వభౌముడంటూ ప్రేక్షక లోకం ఆయనకు నీరాజనాలు పట్టింది.

పౌరాణిక పాత్రల్లో..

కెరీర్‌‌‌‌ ప్రారంభంలోనే పౌరాణిక చిత్రాల్లో మంచి మంచి పాత్రలు లభించాయి కైకాలకి. ‘లవకుశ’లో భరతుడు, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడు, ‘నర్తనశాల’లో దుశ్శాసనుడు, ‘సీతాకళ్యాణం’లో రావణాసురుడు, ‘దానవీర శూర కర్ణ’లో భీముడు, ‘శ్రీ వినాయక విజయం’లో మూషికాసురుడు.. ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలకు తన నటనతో ప్రాణం పోశారు కైకాల. ‘కథానాయిక మొల్ల’లో  శ్రీకృష్ణ దేవరాయలుగానూ కనిపించారు. ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రంలో చేసిన ఘటోత్కచుడి పాత్రకి చాలా పేరొచ్చింది. మళ్లీ ఎన్నో యేళ్ల తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో టైటిల్‌‌ రోల్ పోషించారు.

ఆ బంధం ప్రత్యేకం

ఎన్టీఆర్‌‌‌‌తో పరిచయం కైకాల జీవితాన్నే మార్చేసింది. ఆయన రెగ్యులర్‌‌‌‌గా వేషాలు ఇచ్చేవారు. ‘లవకుశ’లో భరతుడి పాత్ర ఇప్పిం చారు. తన సొంత సినిమాల్లో కూడా చాన్సులు ఇచ్చేవారు. తాను ద్విపాత్రాభి నయం చేయాల్సి వచ్చినప్పుడల్లా కైకాలనే  డూప్‌గా తీసుకునేవారు ఎన్టీఆర్. ‘రాముడు-భీముడు’ లో క్లైమాక్స్‌‌ సీన్స్‌‌లో అయితే మాస్క్ షాట్స్ లేకుండా సత్యనారాయణ తోనే యాక్ట్ చేయించారు. దాంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. తాను నటించిన ప్రతి చిత్రంలోనూ కైకాలని ఏదో ఒక పాత్రకి ప్రపోజ్ చేసేవారు. అలా ఎన్టీఆర్‌‌‌‌తో కలిసి దాదాపు వంద సినిమాల్లో నటించారు కైకాల. 

ఆల్‌‌టైమ్ రికార్డ్

750కి పైగా సినిమాలు 
28 పౌరాణిక చిత్రాలు
51 జానపద చిత్రాలు
9 చారిత్రక చిత్రాలు
200 మంది దర్శకులతో పనిచేసారు
223 సినిమాలు శతదినోత్సవాలు
59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు 
10 సినిమాలు సంవత్సరం ఆడాయి

ఎస్వీఆర్​ తర్వాత...

ఎస్వీ రంగారావు తర్వాత ఆ స్థాయి నటన కనబరిచిన నటుడు కైకాల మాత్రమే. దీంతో ఎస్వీఆర్ మరణం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి దర్శకనిర్మాతలు సత్యనారాయణను ఎంచుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ గంభీరమైన పాత్రలతో మెప్పించారు. ‘మాయాబజార్‌‌’లో ఎస్వీఆర్‌‌ పోషించిన ఘటోత్కచుడు పాత్రలో తెలుగు ప్రేక్షకులు మరొకరిని ఊహించలేరు. కానీ ఆ పాత్రతోనూ మెప్పించడం సత్యనారాయణకే చెల్లింది.

నిర్మాతగా

తన బ్రదర్ కె.నాగేశ్వరరావుతో కలిసి నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు కైకాల. ‘రమాఫిల్మ్స్‌‌’ అనే బ్యానర్‌‌‌‌ను స్థాపించి గజదొంగ, మామా అల్లుళ్ల సవాల్, ఇద్దరు దొంగలు, కొదమసింహం, ముద్దుల మొగుడు, బంగారు కుటుంబం వంటి చిత్రాలు ప్రొడ్యూస్ చేశారాయన. రీసెంట్‌‌గా వచ్చిన ‘కేజీఎఫ్‌‌’ చిత్రానికి సమర్పకులుగా కూడా వ్యవహరించారు కైకాల.

ఇతర భాషల్లోనూ..

సుభాష్‌‌ ఘాయ్ డైరెక్ట్ చేసిన ‘కర్మ’ సినిమాలో విలన్‌‌గా నటించారు కైకాల. ఇందులో ఆయనది హీరోయిన్ శ్రీదేవి తండ్రి పాత్ర. అందులో ఒకట్రెండు తెలుగు డైలాగ్స్ కూడా చెప్పడం విశేషం. ఇక తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్స్‌‌ చిత్రాల్లో నటించారు. కన్నడలో కూడా యాక్ట్ చేశారు. 

పొలిటికల్ ఎంట్రీ

నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన సత్యనారాయణ ఓ సమయంలో రాజకీయాల వైపు కూడా మొగ్గు చూపారు. 1996లో పాలిటిక్స్‌‌లో చేరారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి ఆయనకి సాదర ఆహ్వానం లభించింది.  మచిలీపట్నం పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు కూడా. అయితే 1998లో అదే మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

"నాకు నిరాడంబరంగా బతకడమే ఇష్టం. నా డ్యూటీ నేను చేశాను, నా జీతం నేను తీసుకున్నాను, అది తప్ప నేను సాధించింది ఏంటి అని ప్రశ్నించుకుంటూ ఉంటాను. పీవీ నరసింహారావు గారు పల్లెటూరి నుంచి వచ్చి ప్రధాని అయ్యారు. మోడీగారు కూడా గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టలేదు కదా. ఎన్ని కోట్లు ఉన్నా తినేది కొంతే. అందుకే నా పిల్లల అవసరాలకు సరిపడా సంపాదిస్తే చాలనుకున్నాను.

నాకు రాజకీయాన్ని వ్యాపారంలా చేయడానికి మనసొప్పదు. అబద్ధాలాడటం, లంచాలు తీసుకోవడం లాంటివి నా మెంటాలిటీకి సరిపోవు. అందుకే నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను. ఆ తర్వాత ఎంతమంది అడిగినా ఇంటరెస్ట్ లేదని చెప్పేశానే తప్ప వెళ్లలేదు.

మా తమ్ముణ్ని ప్రొడ్యూసర్‌‌గా పెట్టి ఎనిమిది సినిమాలు తీశాను. మా తాతగారి ఊళ్లో ఆయన పేరు మీద కంభంపాటి రామయ్య మెమోరియల్ ప్రసూతి ఆస్పత్రి కట్టించాను. ఆ చుట్టుపక్కల పదిహేను గ్రామాల మహిళలకు ఉచితంగా ట్రీట్‌మెంట్ అందేలా చేస్తున్నాను. ఏదో నేను చేయగలిగింది చేసుకుంటూ వచ్చాను.

ఓ టైమ్ వచ్చాక అవకాశాలు తగ్గాయి. వచ్చినవాటిలో కూడా క్యారెక్టర్, రెమ్యునరేషన్ నచ్చక నో అనేవాడిని. రత్నాల్లాంటి పాత్రలు వేసి ఇప్పుడు చీప్ పాత్రలు వేయడం నావల్ల కాదు. ఇప్పటి డైరెక్టర్లకి కూడా అంత క్లారిటీ ఉండట్లేదు. అందుకే పాత్రలు చేయడం మానేశా". 

తొలి అడుగులు

కృష్ణా జిల్లా కౌతరం గ్రామంలో జన్మించారు కైకాల. చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో ప్రవేశించారు. డిగ్రీ పూర్తయ్యాక మనసు సినిమావైపు మళ్లింది. ఓ ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో వెంటనే రైలెక్కి మద్రాసు చేరుకున్నారు.  అదృష్టం నిర్మాత డీఎల్ నారాయణ రూపంలో వెతుక్కుంటూ వచ్చింది. ఆయన తెరకెక్కించిన ‘సిపాయి కూతురు’ చిత్రంలో హీరో చాన్స్ దక్కింది. అయితే ఆ సినిమా ఫెయిలవడంతో చాలా డిజప్పాయింట్ అయ్యారు. ఇంటికి వెళ్లిపోవాలంటే మనసొప్పలేదు. ఏం చేయాలో తోచక అక్కడే ఉండిపోయారు. అయితే సినిమా అంటే పోయింది కానీ సత్యనారాయణ పర్సనాలిటీ చాలామందిని ఆకర్షించింది. ఎన్టీఆర్ పోలికలున్నాయనే కామెంట్స్ రావడంతో ఆయన కొందరు ఫిల్మ్ మేకర్స్‌‌ కళ్లలో పడ్డారు. ఎస్.డి.లాల్ అయితే తాను తీస్తున్న ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంలో కీలక పాత్ర చేసే చాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు రావడం మొదలైంది. ముఖ్యంగా అప్పట్లో విలన్‌‌ పాత్రలకు నటుల కొరత బాగా ఉండడంతో సత్యనారాయణకు వరుస అవకాశాలు దక్కాయి. 

తిరుగులేని విలన్

విలనీని పండించడంలో కైకాల తీరే వేరు. ఆయన్ను  చూడగానే సగం భయపడేవారు. ఇక తన పర్‌‌‌‌ఫార్మెన్స్‌‌తో ఆ భయాన్ని పీక్స్‌‌కి తీసుకెళ్లేవారు. ఆయన చేసిన విలన్ పాత్రల్లో ఆడవాళ్లను హింసించేవే ఎక్కువగా ఉండేవి. దాంతో బయట ఎక్కడైనా కనిపిస్తే మహిళలు పగబట్టినట్టే ప్రవర్తించేవారట. ఓసారి ఓ ఫంక్షన్‌‌కి వెళ్తే ఒకావిడ.. ‘ఈ సత్తిగాడిని వెనక నుంచి పొడిచేయాలి’ అందట. మరొకావిడ ‘ఎందుకయ్యా ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తావు. నీకు అక్కాచెల్లెళ్లు లేరా’ అని అడిగిందట. బయట కూడా ప్రేక్షకులు అలా తిట్టేవారంటే ఆయన ఎంత గొప్పగా ఆ పాత్రల్ని పండించారో అర్థం చేసుకోవచ్చు. పౌరాణిక చిత్రాల సమయంలోనే విలన్‌‌గా తన ముద్ర వేయడం ప్రారంభించారాయన. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో విలన్‌‌గా మెప్పించారు. ఆ తర్వాత సోషల్‌‌ పిక్చర్స్‌‌లో స్మగ్లర్‌‌‌‌గా, డాన్‌‌గా, పల్లెటూరి రౌడీగా, డబ్బున్న అహంకారిగా, మాటలతో మాయచేసే మోసగాడిగా.. ఒకటా రెండా.. ఎన్ని రకాల విలన్లు ఉంటారో అన్ని రకాలుగానూ విలనీని ప్రదర్శించారు కైకాల.  ముఖ్యంగా ఆయన నవ్వితే థియేటర్లో చిన్నపిల్లలు జడుసుకునేవారట. అదీ విలన్‌‌గా ఆయనకున్న స్థాయి.

నటనకు నిర్వచనం

సాధారణంగా ఒక్కో నటుడు ఒక్కో విషయంలో ఎక్స్‌‌పర్ట్ అయ్యుంటాడు. ఒక్కో రకమైన పాత్రలకి ఫేమస్ అవుతాడు. కానీ కైకాల అలా కాదు. ఆయనకి ఏ పాత్రయినా ఒకటే. దాని నిడివి ఎంతయినా ఒకటే. తెరమీద ఉన్నంతసేపు ప్రేక్షకుడి మైండ్‌‌ని కబ్జా చేసేస్తారు. విలన్‌‌గా అయితే భయపెట్టేస్తారు. కమెడియన్‌‌ అయితే తెగ నవ్వించేస్తారు. ఎమోషనల్ రోల్ అయితే కదిలించేస్తారు. ఏ పాత్రకైనా ఆయన బెస్ట్ ఆప్షనే. తాత మనవడు, సంసారం సాగరం, రామయ్యతండ్రి, జీవితమే ఒక నాటకరంగం, దేవుడే దిగి వస్తే, సిరిసిరి మువ్వ, తాయారమ్మ బంగారయ్య, పార్వతీ పరమేశ్వరులు లాంటి సినిమాల్లోని పాత్రలు ఆయన్ని విలన్ ఇమేజ్‌‌ నుంచి బైటపడేశాయి. ఆ తర్వాతి కాలంలో శ్రుతిలయలు, రుద్రవీణ, కొండవీటి దొంగ, అల్లుడు గారు లాంటి చిత్రాల్లోనూ మంచి మంచి పాత్రలు చేశారు. ఇక ఈమధ్య అందరివాడు, అరుంధతి, ఎన్టీఆర్ కథానాయకుడు, మహర్షి చిత్రాల్లో కనిపించి మెప్పించారు. అలాగే తన కెరీర్‌‌‌‌లో సత్యనారాయణ చేసినన్ని పోలీస్ పాత్రలు బహుశా ఇంకెవరూ చేసి ఉండరేమో. ఆయన పర్సనాలిటీ, హుందాతనం కారణంగా పోలీసాఫీసర్ రోల్స్‌‌కి ఆయన కేరాఫ్ అయ్యారు. మామా అల్లుళ్ల సవాల్, గ్యాంగ్ లీడర్‌‌‌‌, సూర్య ఐపీఎస్, అలీబాబా అరడజను దొంగలు, సమర సింహా రెడ్డి లాంటి చాలా చిత్రాల్లో ఖాకీ డ్రెస్సులో కనిపించారాయన. మొత్తంగా ఆయన చేయని పాత్రంటూ ఏదీ లేదనే చెప్పాలి. 

నేనే యముండ

‘యముండ’ అని ఒక్కసారి కైకాల అరిచారంటే పక్కనున్న క్యారెక్టర్లే కాదు.. సినిమా చూస్తున్న జనాలు కూడా అదిరి పడాల్సిందే. యముడి పాత్రకి అంతగా ప్రాణం పోశారాయన. మొట్టమొదటిసారిగా ‘యమగోల’ చిత్రంలో యముడిగా నటించారు కైకాల. అందులో ఎన్టీఆర్‌‌‌‌, అల్లు రామలింగయ్య కాంబినేషన్‌‌లో కైకాల సీన్స్‌‌ అత్యద్భుతంగా ఉంటాయి. వాటిని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆ తర్వాత యముడికి మొగుడు, యమలీల, రాధామాధవ్, యమగోల మళ్లీ మొదలైంది, దరువు చిత్రాల్లోనూ ఆ పాత్రలో కనిపించారు కైకాల. ‘యమగోల’కి ‘యమలీల’కి మధ్య పదిహేడేళ్ల గ్యాప్ ఉన్నా.. ఆయన నటనలో, రాజసంలో  మాత్రం ఎక్కడా తేడా రాలేదు. అప్పటి ప్రేక్షకులు ఆయన్ని ఆ పాత్రలో చూసి ఎంత ఇంప్రెస్ అయ్యారో, ఇప్పటి ప్రేక్షకులు అంతకంటే ఎక్కువ మెస్మరైజ్ అయ్యారు. అందుకే యముడు అనగానే సత్యనారాయణే గుర్తొస్తారు. ఎన్నేళ్లు గడిచినా ఆ పాత్రలో ఆయన్ని తప్ప మరొకర్ని ప్రేక్షకులు ఊహించుకోలేరు.

ప్రతిభకు పురస్కారాలెన్నో!

తన అద్భుతమైన నటనకుగాను పలు పురస్కారాల్ని అందుకున్నారు కైకాల సత్యనారాయణ. ‘బంగారు కుటుంబం’ చిత్రానికి నంది అవార్డు వరించింది. 2011లో రఘుపతి వెంకయ్య అవార్డు తీసుకున్నారు. 2017లో ఫిల్మ్‌‌ఫేర్ లైఫ్‌‌టైమ్ అచీవ్‌‌మెంట్ అవార్డ్ లభించింది. ఇంకా ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డ్, ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా నటశేఖర, కావలి కల్చరల్ అసోసియేషన్ చేతుల మీదుగా కళాప్రపూర్ణ , టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ నుండి ‘విశ్వ నటసామ్రాట్’  వంటి పురస్కారాల్ని అందుకున్నారు.  

ఆరు పదుల సినీ ప్రయాణంలో ఐదు తరాల హీరోలతో కలిసి నటించిన నవరస నట శిఖరం... ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన అభినయ కౌశలం సత్యనారాయణ. ఆయన లేకపోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కైకాల మరణం ఇండస్ట్రీకే కాదు, తన కుటుంబానికీ తీరని లోటు అన్నారు చిరంజీవి. ‘కుటుంబ పెద్దను, అన్నయ్యను కోల్పోయాను’ అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆహార్యం, అభినయం, ఆంగికాలతో అశేషాభిమానుల్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల మరణం చిత్ర పరిశ్రమతోపాటు, తెలుగువారికి తీరనిలోటు అని బాలకృష్ణ సంతాపం తెలిపారు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చూపిన అభినయం ఎన్నటికీ మరువలేనిదని, తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోవడం విచారకరమని బాలకృష్ణ అన్నారు. భౌతికంగా ఆయన దూరమైనా ఎన్నో  వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చెరగని స్థానం పొందారంటూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు.