చిన్నప్పుడు గ్యాంగ్ రేప్.. రోడ్లపై భిక్షాటన అడ్డంకులను దాటుకుంటూ అందాల కిరీటం దాకా ఏడేండ్ల వయసులో కుటుంబం వదిలేసింది. పదకొండేండ్ల వయసులో గ్యాంగ్ రేప్. మంచి చదువులు చదివినా జాబ్ దొరకని పరిస్థితి. చివరికి మసాజ్ పార్లర్లలో పని. ఇవన్నీ వింటుంటే జీవితమంతా కష్టాలే అనిపిస్తోంది కదా! కానీ అన్ని అడ్డంకులనూ అధిగమించిన ఆమె మిస్ వరల్డ్ డైవర్సిటీగా నిలిచింది. అది ఒకసారో రెండుసార్లో కాదు వరుసగా మూడుసార్లు. ఇప్పుడు ఎంప్రెస్ ఎర్త్ 2021–22 టైటిల్‌ను దక్కించుకుంది. ఇదంతా ఓ ట్రాన్స్ జెండర్ స్ఫూర్తిదాయక కథ. ఆమె పేరు అయిజ్యా నాజ్జోషి. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఆమె.. ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. హార్డ్ వర్క్‌తో ఎలాంటి విజయాలు సాధించవచ్చనే దానికి ఆమె జీవితమే నిదర్శనం.
నాజ్ పుట్టింది ఢిల్లీలో. తల్లి ముస్లిం.. తండ్రి హిందూ. పుట్టుకతోనే ఆమె ట్రాన్స్ జెండర్. కవల సోదరుడు, మరో తమ్ముడు ఉన్నా కూడా ఫ్యామిలీలో ఆమెకు అన్నీ ఇబ్బందులే. ఐదేండ్ల వయసుకు వచ్చేసరికి హిజ్రా కమ్యూనిటీ దగ్గరకు పంపేయాలని ఆమె తల్లిదండ్రులకు బంధువులు చెప్పేవారు. అయితే వాటిని వారు పట్టించుకోలేదు. కానీ ఆమెను తమతో ఉంచుకోవడం ఇష్టంలేక ముంబైలోని మేనమామ దగ్గరకు పంపించేశారు. ఇక్కడి నుంచే ఆమె ఒంటరి జీవితం మొదలైంది. అక్కడ ఒక రెస్టారెంట్లో క్లీనింగ్ జాబ్‌లో చేరింది. 11 ఏండ్ల వయసులో మేనమామ, అతని స్నేహితులు ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు.
పెద్ద చదువులు చదివినా..
గ్యాంగ్‌రేప్‌కు గురైన ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఒక ట్రాన్స్‌జెండర్ ఆమెను చేరదీశాడు. ఆమెను తనతో పాటు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె చాలా చోట్ల పనిచేసింది. బార్ డాన్సర్‌గా, మసాజ్ పార్లర్లలోనూ పనిచేసింది. రోజు గడవడం కోసం కొన్నిసార్లు బిచ్చమెత్తుకుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన చదువును మాత్రం ఆపలేదు. చిన్నచిన్న పనులు చేస్తూ.. ఆ వచ్చిన డబ్బుతోనే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(ఎన్ఐఎఫ్టీ) నుంచి ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ సాధించగలిగింది. ఘాజియాబాద్‌లోని ఐఎంటీ నుంచి ఎంబీఏ చేసింది. ఎయిర్‌హోస్టెస్‌గా చేసేందుకు డిప్లొమా కూడా పూర్తి చేసింది. ఇన్ని చేసినా ఆమెకు మంచి ఉద్యోగం మాత్రం రాలేదు.
మోడలింగ్ వైపు..
చివరికి సౌత్ ఢిల్లీలోని ఒక మసాజ్ పార్లర్లో పనిచేసింది. ఆ తర్వాత 2013లో జెండర్ సర్జరీ చేయించుకుని, మోడలింగ్‌వైపు అడుగులు వేసింది. ఇలాంటి టైంలో ఆమెను కలిసిన ఒక ఫొటోగ్రాఫర్ ట్రాన్స్ జెండర్ సెక్స్ వర్కర్ ఫొటో కోసం ఆమె ఫొటోలు తీసుకున్నాడు. ఓ నేషనల్ మేగజీన్ కవర్‌పై ఆమె ఫొటో ప్రింట్ అయ్యింది. ఈ ఫొటోషూట్ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా అందాల పోటీల్లో పాల్గొంటూ విజయాలు సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్ డైవర్సిటీ బ్యూటీ పేజెంట్‌లో వరుసగా మూడుసార్లు విజేతగా నిలిచింది. ఇవి కాకుండా మరో ఎనిమిది బ్యూటీ పేజెంట్స్లోనూ గెలిచింది. ఇప్పుడు ఇండియా తరఫున మొట్టమొదటి ఇంటర్నేషనల్ ట్రాన్స్‌జెండర్ బ్యూటీ క్వీన్ కిరీటాన్ని దక్కించుకుంది.