ఆ రూపం అపురూపం 

ఆ రూపం అపురూపం 

ఎన్.టి.ఆర్.కు తెలుగు కవులతో, నటులతో, ప్రజలతో, సంస్కృతితో ఉన్న అనుబంధాన్ని చెప్తుంది మహానటుడు ఎన్.టి.ఆర్ పుస్తకం. దీని రచయిత ఎం.కె.రాముకి ఎన్​.టి.ఆర్​.తో ఉన్న ప్రత్యేకానుబంధాన్ని చాటుతుంది. ఏ దేవుని వేషం వేసినా ఆ దేవుడు ఆయనలో ఆవహించే అసాధారణ రూపం ఎన్.టి.ఆర్.ది. క్రమశిక్షణ, పట్టుదల, కార్యసాధన, ప్రణాళికలు, పరిశోధనలు, ఆధ్యాత్మిక భావనలు వారిని మనుషుల్లో మనీషిగా చేశాయంటాడు రాము. ఎం.కె.

రాము రామారావు ప్రసంగాన్ని కర్నూలులో మొదటిసారి విన్నాడు. ఏమి ఉచ్చారణ! ఏమి భాషా పటిమ! అప్పుడు తెలిసింది తెలుగుభాష ఎంత గొప్పదో! అప్పటినుండి రాము కర్నూలు జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వెళ్ళి పురాణాలు, ప్రబంధాలు, కావ్యాలను చదివాడు.రాము అర్థగణాంకశాఖలో ఇన్వెస్టిగేటర్​గా ఉన్నప్పుడు ఒకసారి జి.నాగిరెడ్డితో కలిసి మద్రాసులో నందమూరి ఇంటికెళ్ళాడు. ‘తెలుగు చిత్ర’ పత్రికలో రాము సముద్రాల రాఘవాచార్య గురించి రాసిన వ్యాసాలు, విశ్లేషించిన విధానం బాగున్నాయని రామారావు ప్రశంసించారు. జాతీయగీతం పద్ధతిలో ఓ పాట రాయమని రామారావు కోరగానే రాము “ఉజ్జ్వలం మహోజ్జ్వలం.. మన భారతమాతకీర్తి ఉజ్జ్వలం” అనే పల్లవి వినిపించగానే అద్భుతంగా ఉందన్నారు ఆయన. తెలుగు రాష్ట్రాల భక్తులు తిరుపతిలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని, అప్పటి మద్రాసు (చెన్నై)కు ఎన్.టి.ఆర్.ను చూడడానికి వచ్చేవారు. ఇటువంటి సందర్భం ప్రపంచంలో మరెక్కడా లేదంటాడు రాము.

ఎన్.టి.ఆర్.కు సినారె అభిమాన కవిమిత్రులు.

ఒక సభలో రాము మిత్రులు బుర్రకథా సమ్రాట్ బెనర్జీ ‘రాణీ రుద్రమ’ బుర్రకథ గానాన్ని విని, కథను విలక్షణంగా రాగ తాళయుక్తంగా నర్తిస్తూ వివరించిన తీరు చూసి తాము నిర్మించే ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రంలో బుర్రకథా ప్రదర్శనకు అవకాశమిచ్చారు రామారావు. రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. రాము హైదరాబాద్ లో రసమయి సాహితీ సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తున్నాడు. అమెరికాలో తానా సభలో రాము రూపొందించిన ‘మహాభారతం’ క్యాసెట్ల ఆవిష్కరణ పెట్టించి, ఆవిష్కరించారు రామారావు. 

రసమయి కార్యక్రమాలలో తలమానికం అయిన ‘సుశీలా నారాయణరెడ్డి సాహితీ అవార్డు’ ఎన్.టి.ఆర్. ప్రారంభించారు. ‘ఆయన హస్తవాసి వల్ల రూ. 1116/-లతో ప్రారంభించి, రచయిత్రులను సన్మానించడమే ఒరవడిగా పెట్టుకొని, ఆ తరువాత రూ. 50,000/-లతో సన్మానించేదాకా ఎదిగింది. ఏటా ఒకరు చొప్పున 1984 నుండి నేటి దాకా 39 మందిని సన్మానించుకున్నాం’ అన్నాడు రాము. కవి, నటుడు, గాయకుడు, ప్రయోక్త అయిన పైడి లక్ష్మయ్య పేరున రసమయి పక్షాన రామారావు చేతుల మీదుగా ట్రస్ట్ ప్రారంభించి, ఒక్కొక్కరికి రూ. 10,000/-ల నగదుతో ఏటా నలుగురు చొప్పున 140 మందిని సత్కరించారు.

రామారావు వివిధ సందర్భాలలో - జంధ్యాల పాపయశాస్త్రి కరుణశ్రీ 50వ ముద్రణ, విజయశ్రీ ఉదయశ్రీ గ్రంథాల రజతోత్సవ ముద్రణలను, జానపద కవిగా పేరొందిన కొసరాజు రాఘవయ్య చౌదరి ‘కొండవీటి వైభవం’ పద్యకావ్యాన్ని, మంత్రి జి.నాగిరెడ్డి రాసిన ‘దేవీ భారతి’ నవలను, అజీజ్ రాసిన ‘పాలెగాడు’ (ఉయ్యాలవాడ నరసింహారెడ్డి) నవలను, మర్నూరి కృష్ణరంగం రాసిన ‘కళామతల్లి వరాల బిడ్డ’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఆ సభల్లో రామారావు మాట్లాడిన మాటలు ఆణిముత్యాలు. ఉదాహరణకు జంధ్యాల (కరుణశ్రీ)ను సన్మానించి, ‘ఇటువంటి మహాకవులను సత్కరిస్తేనే మన జాతి నిలుస్తుంది. మన గౌరవం పెరుగుతుంది. భాష విలువ పెరుగుతుంది’ అన్నారు. వేటూరి సుందరరామమూర్తికి జాతీయ అవార్డు కార్యక్రమం, సాలూరి రాజేశ్వరరావు చలనచిత్ర జీవిత స్వర్ణోత్సవం, సినారె చతుషష్టి (64వ) జన్మదినం రామారావు చేతుల మీదుగా రసమయి ఘనంగా నిర్వహించింది. ‘నందమూరి చందమామ సుందర చరితం’ అంటూ రాము రాసిన పాట వీడియోను సభలో చూడడమే కాకుండా... ఇంటికి తెప్పించుకొని మరీ చూసేంతలా కదిలించింది. మహానటుడు ఎన్.టి.ఆర్. రూపాన్ని విశిష్ట వ్యక్తిత్వాన్ని, అంకితభావాన్ని, కవుల పట్ల ఆదరాభిమానాల్ని, సంస్కృతి స్వరూపాన్ని తెలిపి, ఎప్పటికీ రామారావును గుర్తుంచుకునేలా గ్రంథాన్ని రచించిన ఎం.కె. రాము అభినందనీయుడు.

- ఎ. గజేందర్ రెడ్డి

9848894086