బైరాన్​పల్లి బురుజు.. నాటి ఘటనకు నిలువెత్తు సాక్ష్యం

బైరాన్​పల్లి బురుజు.. నాటి ఘటనకు నిలువెత్తు సాక్ష్యం
  • రజాకార్ల మూక దోపిడీని అడ్డుకున్నందుకు గ్రామంపై దండయాత్ర
  • 1,200 మంది ఊరిని చుట్టుముట్టి.. 119 మందిని వెతికి మరీ చంపిన్రు
  • మహిళలను వివస్త్రలను చేసి.. శవాల గుట్టల చుట్టూ  బతుకమ్మ ఆడించిన్రు

సిద్దిపేట : అర్ధరాత్రి నెత్తురు పారిన నేల అది. రజాకార్ల ఆగడాలను అడ్డుకున్నందుకు అట్టుడికిన ఊరు అది. మూకల అరాచకానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరాన్ పల్లి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. ఇక్కడ నిజాం పాలనలో రజాకార్ల ఆగడాలకు భయపడి జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న రోజులవి. రజాకార్ల మూక దాడులను ఎదుర్కొనేందుకు గ్రామ రక్షణ దళాలను బైరాన్​పల్లిలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న లింగాపూర్, దూల్మిట్ట గ్రామాలపై రజాకార్ల మూకలు దోపిడీకి దిగాయి. అక్కడ దోచుకున్న సొత్తుతో బైరాన్​పల్లి గ్రామం మీదుగా వెళ్తుండగా.. గ్రామ రక్షణ దళం వారిని అడ్డుకుంది. సొత్తును స్వాధీనం చేసుకుని మూకను తరిమికొట్టింది. ఈ ఘటనతో బైరాన్​పల్లి గ్రామంపై కక్ష కట్టిన రజాకర్లు.. రెండుసార్లు దాడి చేసి విఫలమయ్యారు. 20 మందిని పోగొట్టుకున్నారు. దీంతో  బైరాన్​పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ వాసీం ప్రకటించడమే కాకుండా ఎప్పటికైనా ఊరిని నాశనం చేస్తానని ప్రతినబూనారు.

దారిలో మరో 30 మందిని చంపి
రజాకార్లు బైరాన్​పల్లిలో మారణకాండను ముగించుకుని వెళ్తూ కూటిగల్ గ్రామంపై దాడి చేశారు. కూటిగల్‌‌లో బీభత్సం సృష్టించి.. తమకు అడ్డుగా వస్తున్నారని 30 మందిని చంపారు.

అర్ధరాత్రి దొంగచాటుగా..
1948 ఆగస్టు 27 అర్ధరాత్రి సుమారు 1,200 మంది రజాకార్లు భారీ మందుగుండు సామగ్రితో బైరాన్​పల్లి గ్రామాన్ని చుట్టుముట్టారు. దొంగచాటుగా గ్రామంలోకి ప్రవేశించారు. రజాకర్ల కదలికలను ఎప్పటికప్పుడు గ్రామ రక్షణ దళానికి చేరవేసే కాపరి విశ్వనాథ్ భట్ జోషి వారికి దొరికిపోయాడు. ఉల్లెంగుల వెంకటనర్సయ్య అనే వ్యక్తి తప్పించుకుని రజాకర్లు గ్రామంలోకి చొరబడ్డారని కేకలు వేశాడు. దీంతో బురుజుపై రక్షణగా ఉన్న దళ కమాండర్ రాజిరెడ్డి.. నగారా మోగించాడు. కాపలాగా ఉన్న మోటం రామయ్య, పోచయ్య, బలిజ భూమయ్య ఏం జరుగుతున్నదో తెలుసుకునే లోపే రజాకర్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. దీంతో బురుజుకు రక్షణ కరువైంది. గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికిన వాళ్లను దొరికినట్టు కాల్చిచంపారు. ఇంటింటికీ తిరిగి మరీ మారణకాండ సాగించారు. గ్రామం బయట శవాల చుట్టూ మహిళలను వివస్ర్తలను చేసి బతుకమ్మ ఆటలను ఆడించారు. వారి ఆగడాలను భరించలేక కొంత మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రికి రాత్రి జరిగిన ఈ ఘటనలో 25 మంది రజాకార్లు, 119 మంది బైరాన్​పల్లి వాసులు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదైనా.. మృతుల సంఖ్య 300కు పైనే ఉంటుందని అప్పటి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బైరాన్‌‌పల్లి ఘటనలో అమరులైన 119 మంది త్యాగాలను స్మరిస్తూ, భవిష్యత్ తరాలకు అమానుష సంఘటనను వివరించడం కోసం గ్రామ శివార్లలో స్మారక స్తూపాన్ని నిర్మించారు. 119 మంది పేర్లను స్థూపంపై చెక్కారు. బైరాన్​పల్లి బురుజు.. నాటి ఘటనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.