
- నియోజకవర్గాల్లోనే ఆశావహుల తిష్ట.. ఊర్ల చుట్టూ చక్కర్లు
- ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నెలకు రూ.కోటికిపైగా ఖర్చు
- లగ్గాలు, బర్త్‌డేలు, చావులు సహా అన్ని ప్రోగ్రామ్స్‌కు అటెండ్
- కుల సంఘాలతో ప్రత్యేక మీటింగ్స్
- యువత కోసం కోచింగ్ సెంటర్లు, జాబ్ మేళాలు
- సోషల్ మీడియా టీంలు, సర్వేలతో హడావుడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇది ఎలక్షన్ ఇయర్. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల టైమ్ కూడా లేకపోవడంతో ఎట్లయినా సరే ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని లీడర్లు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు టికెట్ ఆశిస్తున్నవాళ్లు ఊర్ల దిక్కు క్యూ కడ్తున్నారు. నియోజకవర్గంలో లగ్గాలు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యాలతోపాటు చావులకు అటెండ్ అవుతూ.. ఆయా కుటుంబాలకు ఎంతో కొంత ముట్టజెప్తున్నారు. యూత్‌ను ఆకట్టుకోవడానికి నియోజవర్గాల్లో జాబ్‌మేళాలు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేయడం, సర్కారీ కాలేజీల్లో స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనం సహా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తాము పోటీ చేద్దామనుకుంటున్న సెగ్మెంట్లో ఎవరి పరిస్థితి ఏంది? ఎవరికి ప్రజల మద్దతు ఉంది..? ప్రజలకు చేరువ కావాలంటే ఇంకా ఏమేం చేయాలి?.. అనే దానిపై సర్వే టీంలను రంగంలోకి దింపి వివరాలు సేకరిస్తున్నారు. టికెట్ ఆశించే వాళ్లలో ఒక్కో లీడరు నెలకు కోటి రూపాయలకు పైగానే ఇలా తమ పర్యటనలకు, కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. ఏదైనా గ్రామానికి లీడర్లు వెళ్లేటప్పుడు తమ వెంట ఐదు, పది లక్షలకు తక్కువ కాకుండా డబ్బులు తీసుకెళ్తున్నారు. మందీమార్బలంతో నియోజకవర్గంలో హడావుడి చేయడం.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామే అన్నట్టుగా సీన్ క్రియేట్‌చేయడానికి భారీగానే కుమ్మరిస్తున్నారు. జనం కూడా ఎన్నికల టైమ్ కావడంతో లీడర్ల నుంచి ఇంటింటికీ పైసలు వస్తాయని బలంగా నమ్ముతున్నారు. తమ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు రావాలని లీడర్లకు ఆహ్వానాలూ పంపుతున్నారు.
నియోజకవర్గాల్లోనే తిష్ట
ఎలక్షన్ఇయర్లోకి ఎంటర్అయింది మొదలు సిట్టింగ్ఎమ్మెల్యేలతో పాటు వివిధ పార్టీల నుంచి టికెట్ఆశిస్తున్న నేతలంతా నియోజకవర్గాల్లోనే తిష్ట వేశారు. ఏదైనా ఇంపార్టెంట్పని ఉంటే తప్ప సెగ్మెంట్‌ను వీడి బయట అడుగు పెట్టడం లేదు. రాష్ట్రంలోని అన్ని సెగ్మెంట్లలో కనీసం ముగ్గురు, నలుగురు లీడర్లు వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో గ్రౌండ్‌వర్క్ చేసుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలతో రోజూ టచ్‌లో ఉంటున్నారు. సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
ఎన్నికల్లో పోటీ చేయాలంటే గతంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్, చిన్నపాటి సభలతో ప్రజలకు చేరువయ్యే వారు. ఆయా గ్రామాలు, వార్డుల్లో ప్రభావితం చేయగల నేతలను తమ దిక్కు తిప్పుకుంటే గ్రౌండ్లో చేయాల్సిన పని అంతా వాళ్లే చూసుకునే వాళ్లు. అంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుండటంతో లీడర్ల ప్రచారం స్టయిల్మారిపోయింది. ప్రజల్లోకి ఎంత దూకుడుగా వెళ్తున్నా దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని తీరాల్సిందేనని భావిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యే, ఒక్కో ఆశావహ నేత ప్రత్యేకంగా సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలు ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో తమ కార్యక్రమాలను లైవ్పెట్టడం.. పోస్టర్లు, స్క్రీన్షాట్లతో తమ ప్రోగ్రామ్ షెడ్యూల్‌ను ప్రజలకు చేరవేస్తున్నారు. తాము అటెండ్అయిన అన్ని కార్యక్రమాలను విధిగా సోషల్ మీడియా ద్వారా ఫోకస్ చేయించి ఆ నియోజకవర్గ ప్రజలకు తెలిసేలా చూస్తున్నారు. ప్రతి నెలా ఆయా నియోజకవర్గంలో తమతో పాటు సిట్టింగ్ఎమ్మెల్యే, ఇతర పార్టీల నుంచి టికెట్ఆశిస్తున్న లీడర్ల గ్రాఫ్ ఎలా ఉంది.. ప్రజల మైండ్సెట్ఏమిటీ.. ఎక్కడ ముందున్నాం.. ఇంకెక్కడ వెనుకబడిపోయాం.. అనే వివరాలు సేకరిస్తూ ఆ రిపోర్టులకు తగ్గట్టుగా తమ ప్రచార సరళిలో మార్పులు చేసుకుంటున్నారు.
యువతకు కోచింగ్ సెంటర్లు, స్టడీ మెటీరియళ్లు
ఉద్యోగ నోటిఫికేషన్ల వల్ల యువత ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు. వారిని తమ దిక్కు తిప్పుకునేందుకు ఎమ్మెల్యేలు, టికెట్ ఆశిస్తున్నవారు ఇప్పటికే ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంకా ఎక్కడెక్కడ అవసరమో గుర్తించి ఏర్పాటు చేస్తున్నారు. నిపుణులతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ క్లాసులు చెప్పిస్తున్నారు. ఫ్రీగా స్టడీ మెటీరియల్ అందజేస్తున్నారు. జాబ్‌మేళాలు ఏర్పాటు చేయించి ప్రైవేట్సెక్టార్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు.
ప్రత్యర్థులకు స్పేస్ ఇవ్వొద్దని..!
‘‘నియోజకవర్గంలో అడుగు పెడితే రోజుకు కనీసం రూ.5 లక్షలు అంతకన్నా ఎక్కువే ఖర్చు చేయాల్సి వస్తున్నది. నేనే కాదు ఇతర పార్టీల నుంచి టికెట్ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్లు కూడా సెగ్మెంట్లోనే ఉండి రోజుకు రెండు, మూడు లక్షల వరకు ఖర్చు చేస్తున్నరు. వాళ్లు లోకల్లోనే ఉండటంతో నేనూ ఉండాల్సి వస్తున్నది. స్థానికంగా లేకుంటే ప్రత్యర్థులకు స్పేస్ ఎక్కువ దొరుకుతది. ఆ చాన్స్ ఇవ్వకుండా స్థానికంగానే ఉంటూ అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయితున్న. ఒక్కో నెలకు రూ.కోటికిపైగానే ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇప్పుడే ఇట్లుంటే ఎలక్షన్స్ నాటికి పరిస్థితి ఎట్టుంటదో అర్థమైతలేదు.’’
- ఇదీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ముచ్చట
కార్యకర్తలు చేజారకుండా
తమ వెంట ఉన్న కార్యకర్తలు, నేతలు చేజారకుండా వారి అవసరాలు తీర్చడంతో పాటు ఇతర పార్టీల్లోని కార్యకర్తలను, నేతలను తమ వైపు రప్పించుకోవడానికి లీడర్లు భారీగానే ఖర్చు చేస్తున్నారు. కనీసం 20 ఓట్లు ప్రభావితం చేయగల నేతలను కూడా వదలకుండా తమతో కలిసి పనిచేయాలని స్వయంగా వెళ్లి అడుతున్నారు. కుల సంఘాల నేతలతో ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టి.. తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమపై జనంలో ఉన్న నెగిటివిటీని దూరం చేసుకోవడానికి, పాజిటివిటీని బిల్డప్ చేసుకోవడానికి లీడర్లు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎలక్షన్ షెడ్యూల్, నోటిఫికేషన్ వచ్చే నాటికి ఖర్చు ఇంకింత పెరగనుంది. ఆ మధ్య వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లో లీడర్లు కోట్లకు కోట్లు కుమ్మరించారు. దీంతో దేశంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నికలకు రాష్ట్రం మారుపేరుగా మారిందని, అందుకే ఇప్పుడు తామూ భారీగా ఖర్చు చేయాల్సి వస్తున్నదని లీడర్లు అంటున్నారు.
ఈసారైనా గెలిచి తీరాలని
‘‘2009 నుంచిరాజకీయాల్లో ఉన్న. రెండు సార్లు కంటెస్ట్ చేసినా అదృష్టం కలిసిరాలె. ఈసారి ఎట్లయినా గెలిచి తీరాలనే లక్ష్యంతో ఏడాదిగా స్థానికంగానే ఉంటున్న. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రచారం చేస్తున్న. సోషల్‌మీడి యా టీంలతో క్యాంపెయిన్ చేయిస్తు న్న. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తున్నది. డబ్బుకు వెనుకాడితే ఎన్నికల్లో గెలిచే చాన్స్ మిస్ అవుత.”
- ఇదీ ఉమ్మడి కరీంనగర్‌జిల్లాకు చెందిన ఓ ఆశావహుడి మాట